Sunday, April 5, 2009

పిల్లలు దేవుడు చల్లనివారే..



పిల్లలు చల్లనివారేనా.. అంతేనా.. మరేమీ కాదా అని ప్రశ్నిస్తే మనలో చాలా మంది తెల్లబోతారు…

ఎందుకు కారు, పిల్లలు గడుగ్గాయిలు, చిచ్చర పిడుగులు, సందేహ ప్రాణులు.

వాళ్లు అడిగే చిన్న చిన్న ప్రశ్నలకు, ఆ క్షణంలో వారి నుండి తప్పించుకునేందుకు ఏవో సమాధానాలు చెప్పి దాటవేస్తాం గానీ, లోతుగా ఆలోచించుకుంటూ పోతే మహా మహా వేదాంతులకు, పండితులకే అంతుపట్టని విశ్వ రహస్యాలుంటాయి.

ఆ రోజు ఆదివారం. ఇల్లు సందడిగా ఉంది. మా అక్క, బావ పిల్లలతో మా ఇంటికి వచ్చారు. ఇక్కడికే కాదు, ఎక్కడికి వెళ్లినా మా అక్క టీవి సీరియల్‌లు వదలదు, మా బావ పట్టుకున్న పేపర్ వదలడు. మా కోడలు, అల్లుడి ఆటలకు ఎక్కడా కొదువ లేదు. వాళ్లు ఒక్కో ఏరియాలో ఒక్కో బ్యాచ్‌ను మెయింటైన్ చేస్తుంటారు.

కోడలు బుద్ధిమంతురాలే, మేడ మీదో, వరండాలోనో బొమ్మలు పెట్టేసుకుని ఆడేసుకుంటుంది. మా అల్లుడు బబ్లూగారితోనే సమస్యలన్నీ. బ్యాట్ ఎత్తుకుని రోడ్డు మీద పడితే, బాల్‌ను కొట్టకుండా వాడితో పాటు ఆడే పిల్లల్ని కొట్టేస్తుంటాడు. మా అన్నగారు గతంలో అక్కడ టీచర్ గిరీ వెలగబెట్టారు కాబట్టి… చుట్టుపక్కల పిల్లలు ఆయన భయంతో వీడినేమి అనరు, అనలేరు.

కొండొకచో అన్నా వీడు అంతకు రెండింతలు అనకుండా ఊరుకోడు. అలాంటి ప్రతాపాలు నేనో, మా అన్నో చూసినా తుర్రుమంటూ పోయి అమ్మ కొంగు చాటున దాక్కుంటాడు - బుద్ధిమంతుడిలా. ఆ కొంగు వాళ్లమ్మదైతే ఫర్లేదు, మా అమ్మది.

అప్పటికీ కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో వాడిని ఏమైనా అన్నామంటే, మా అమ్మ మా భరతం పట్టేస్తుంది.

ఒకసారి నేనే బలైపోయా వాడి తెలివితేటలకి. వెంటపడి ఓ దెబ్బ వేసానో లేదో ఎప్పట్లానే మా అమ్మనాశ్రయించాడు. వాడి తరపు ఈవిడ వకాల్తా.

మా అమ్మకో ఊత పదం ఉంది. “పోనీలేరా.. వాడి పాపాన వాడే పోతాడు. దేవుడు అన్నీ చూస్తుంటాడు” అని.

భాగస్వామ్య వ్యాపారం పేరుతో స్నేహితుడు నాకు శఠగోపం పెట్టినప్పుడు ఇదే మాట. అవసరానికి డబ్బు తీసుకున్న బంధువులు మొత్తానికి నామం పెట్టినప్పుడు అదే మాట. “పోనీలేరా.. వాడి పాపాన వాడే పోతాడు. దేవుడు అన్నీ చూస్తుంటాడు” అని.

మా వాడేదో ఏడుస్తున్నాడు కదాని ఊరడింపుగా ఇదే వాక్యాన్ని ఉపయోగించేసింది. ఆ తర్వాత ఆమెకు తీరిగ్గా నాలుక్కరుచుకునే అవకాశాన్ని వాడు ఇచ్చేసాడు.

అయితే అమ్మమ్మా.. దేవుడు అన్నీ చూస్తుంటాడా

అవును..

అంటే ఇప్పుడు చిన్న మామయ్య నన్ను కొట్టింది

అది కూడా..

మరి.. రెండ్రోజుల ముందు మా ఊరిలో నేను వంశీగాడిని కొట్టింది కూడా చూసాడంటావా

ఒక్క క్షణం ఖంగుతిన్న ఆవిడ అంతలోనే తేరుకుని - ఖచ్చితంగా చూసే ఉంటాడు అంది.

దేవుడు ఒక్కడే కదా.. అక్కడ, ఇక్కడ.. ఎంతమందిని చూస్తాడు.

అంతలోనే కలగజేసుకున్న మా అక్క వాడిని గద్దించడం, వాడు మళ్లీ వీధిలోకి తుర్రుమనడం జరిగిపోయాయి.

ప్రతి రోజూ నిద్రపోయే ముందు ఆ రోజు జరిగిన సంగతులను, సంఘటనలను సింహావలోకనం చేసుకోవడం నాకు పరిపాటి. వాటిలో ఎక్కువ భాగం సంతోషం కలిగించే సంఘటనలే ఉంటాయి. అందులో మా అల్లుడికి నా పక్కన పడుకుంటే గానీ నిద్ర రాదు. నేను వాళ్ల ఊరు వెళ్లినా, వాడు ఇక్కడికి వచ్చినా మా పడకలు పక్క పక్కన ఉండాల్సిందే. క్రమంగా నాకూ అలవాటైపోయింది.

ఆడి ఆడి అలసిపోయాడేమో, ఎక్కువసేపు కబుర్లాడకుండానే నిద్రలోకి జారుకున్నాడు.

వాడిని చూస్తుంటే నాకు నా బాల్యం గుర్తుకొస్తుంది. బాల్యంలో మేము కోల్పోయిన కొన్ని ఆనందాలను వెతికి పట్టుకుని మరీ వాళ్ల చేతికందిస్తుంటే అవన్నీ మేమే అనుభవిస్తున్నట్లు, మేము మళ్లీ చిన్నపిల్లలమైపోయినట్లు ఉంటుంది. నిద్రపోయేటప్పుడు పిల్లల్ని అదే పనిగా చూస్తుంటే వాళ్లకి దిష్టి తగులుతుందని వాళ్లు పుట్టినప్పటి నుండి అమ్మ వారిస్తూనే ఉంటుంది. పువ్వులను, పిల్లలను చూడకుండా ఎలా ఉంటాం..?

హఠాత్తుగా మా అమ్మతో వాడి వాదన గుర్తుకొచ్చింది.

నిజంగా దేవుడు అన్నీ చూస్తుంటాడా? దేవుడు ఒక్కడే కదా. మరి జనాభా సంఖ్య… రోజురోజుకీ పెరిగిపోతోంది. ఎవడి శక్తిమేరకు వాడు పాపాల చిట్టాను పెంచుకుంటున్నారు. పాతిక మందికి మించని తరగతి గదిలో పిల్లల అల్లరినే మాస్టర్లు భరించలేరే. ఇన్ని వేల కోట్ల ప్రజల పుణ్యాలు, పాపాలు, మంచి, చెడు, కోరికలు, కన్నీళ్లు, … ఎన్నని చూస్తాడు దేవుడు.

మధ్యలో పుట్టించడం, చంపడం వంటి అదనపు పని ఒత్తిడి ఉండనే ఉంది. ఏమైపోతాడు దేవుడు? మన కష్టాల గురించి ఆయనకి చెప్పుకుంటాం. మరి ఆయన కష్టాలు ఎవరితో చెప్పుకుంటాడు? మన మేనేజర్‌కి పైన మరొక మేనేజర్ ఉండే విధంగా, మన దేవుడికి ఆయన లోకంలో మరొక దేవుడుంటాడా? ఈయనకి అసలు విశ్రాంతే ఉండదా? భార్యా పిల్లలు, సంసారం ఉండవా?

ఆఫీస్‌లో రెండు మూడు గంటలు ఎక్కువ పని చేయాల్సి వస్తే మన మొహంలో రంగులు మారిపోతుంటాయే.. ఈయన సంగతేంటి?

అంతలోనే మరో సందేహం….

అసలు ఇంతకీ దేవుడున్నాడా? ఉన్నాడని మనం అనుకుంటున్నామా?

అలా అనుకుంటున్నానో లేదో, ఇలా మా అల్లుడుగారు తన ఎడమకాలితో చాచిపెట్టి డొక్కలో తన్నారు - నిద్రలోనే. దెబ్బకు దేవుడు దిగివచ్చాడు. అంతూపొంతూలేని ఆలోచనలతో హిమాలయ అంచులకు వెళ్లిపోతున్న నన్ను ఒక్క తన్నుతో మళ్లీ నా గదిలోకి తోసేశాడు. వాడిని సరిగ్గా పడుకోబెట్టి నేనూ నిద్రపోయాను, దేవుడికి దండం పెట్టుకుని…!!

0 comments: