మొన్నటి కథ…!
బాల్యం అంటే…
వెచ్చటి అమ్మ కౌగిలిలో ఆదమరిచి నిద్రపోవడం,
‘అఆ’లు దిద్దించే నాన్నను చూసి దాక్కోవడం,
అక్కలతో, అన్నలతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం,
ఎగిరే గాలిపటాలను చూస్తూ ఊహల్లో విహరించడం,
బడి ఎగ్గొట్టేందుకు వాన కోసం దేవుడిని ప్రార్థించడం,
దండించిన మాస్టారు సైకిల్ టైర్లో గాలి తీసేయడం,
సాయంకాలాలు బంతాటలు,
రాత్రుళ్లు దాగుడుమూతలు,
పక్క మీదకి చేరాక ముసలమ్మల కాశీ మజిలీ కథలు..
బాల్యం అంటే…
ఒక సరదా.. మళ్లీ మళ్లీ తిరిగి వస్తే బాగుండునని
ప్రతి ఒక్కరు తపించే, ఆశించే
ఓ మధురమైన, అందమైన
మరిచిపోలేని ఓ అద్భుతమైన కల.
మరి నిన్నటి పరిస్థితి…!
బాల్యం అంటే…
బండెడు హోమ్ వర్క్,
స్పెషల్ క్లాసుల పర్వం,
తోటి పిల్లలతో ప్రోగ్రెస్ కార్డుల పోటీ,
ఉదయాన్నే కాళ్లీడ్చుకుంటూ ట్యూషన్లు,
సాయంకాలాలు కంప్యూటరు క్లాసులు,
డాన్సు క్లాసులు, యోగాభ్యాసాలు,
రాత్రుళ్లు ఆన్లైన్ కోచింగులు,
కాన్వెంట్ కుర్రాళ్లకు ఐఐటి టార్గెట్లు..
బాల్యం అంటే…
ఒక బాధ.. ఒక వ్యథ
నిద్రలో సైతం
ఉలికిపాటుకు గురిచేసే
ఓ పీడకల.
నేటి (దు)స్థితి…!
బాల్యం అంటే..
జిహాద్ పాఠాలు,
తుపాకీ గుళ్లు, సైనేడ్ బిళ్లలు..
ఆత్మాహుతి సైనికులు,
మత మౌఢ్యంలో కొట్టుమిట్లాడే
రాక్షసుల చేతుల్లో
ఊపిరి పోసుకునే మారణాయుధాలు,
ఉగ్రవాద రక్కసి కోరల్లో
ఆహుతవుతున్న చిన్నారులు..
నేటి బాలలు….
పసిమొగ్గ ప్రాయంలోనే
వాడిపోతున్న గులాబీలు..
మరి రేపు (?!?!?)….
(http://telugu.webdunia.com/miscellaneous/kidsworldకు స్పందన)
1 comments:
బాగుంది.
కాని మీరు ఒకే బ్లాగుని రెండు చోట్ల నిర్వహిస్తున్నారెందుకు? నిర్వహించ కూడదని కాదూ ..
Post a Comment