Thursday, March 17, 2011

నేను... నేనే...!!


నేనేమైనా అద్దన్నా
నిన్ను కేవలం నిన్నులా చూపేందుకు

నేనేమైనా మైనాన్నా
అచ్చు నీలా మారిపోయేందుకు

నేనేమైనా ఆ చిలుకనా
నీ ప్రతిమాటను వల్లించేందుకు..

నేను... నేనే
అచ్చంగా.. మరో మార్పు లేకుండా...!!

Thursday, March 10, 2011

మిలియన్ "సందేహాల" మార్చ్...!!

తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన ఎందరో అమాయక ప్రజల కంటే ట్యాంక్‌బండ్‌పై ధ్వంసమైన విగ్రహాలు ఏమంత గొప్పవి కావని, అంత అవసరమైతే వాటిని మళ్లీ పునరుద్ధరించుకోవచ్చని, ఇక మీడియాపై జరిగిన దాడిని 'ఖండిస్తున్నాము' అని సరిపుచ్చుకున్న కేటిఆర్ అండ్ కో.,లకు, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే తక్కిన రాజకీయులందరికీ -

పోలీసుల లాఠీ దెబ్బలకు ఎప్పుడూ ఆ అమాయకులే ఎందుకు గురవుతున్నారు..????
పోలీసుల తూటాలు వారినే ఎందుకు వరిస్తున్నాయి..????

ఆ అమాయకులనే రక్షణ వలయంగా ఉపయోగించుకుంటూ పబ్బం గడుపుకుంటున్నదెవరు..?

ఆంధ్ర కేసరి వలె తూటాలకు రొమ్ము ఎదురొడ్డి నిలువగలిగే దమ్ము, తెగువ, అంకితభావం గల వారు మీలో ఎందరున్నారు..?

మల్టీస్పెషాలిటీ హాస్పిటళ్లలో డాక్టర్ల పర్యవేక్షణలో కాకుండా.. అమరజీవి వలె అకుంఠిత దీక్షతో, నిజమైన 'ఆమరణ నిరాహారదీక్ష' చేసే వారు మీలో ఎందరున్నారు..?

రాజులు, రాజ్యాలు అంతరించిపోయినా, పెత్తందార్లకు, భూస్వాములకు కాలం చెల్లిపోయినా ఆ శైలి పోరాటాలు మాత్రం ఆగటం లేదేం మరి.. నాయకుల జిత్తులకు సామాన్య కార్యకర్తలు, ప్రజలేగా అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ బలైపోతుండేది...

పైసల కోసమో, పదవుల కోసమో కార్యకర్తల జీవితాలను పణంగా పెట్టే నాయకుల కుటుంబాల్లో ఎవరికైనా, ఏ ఒక్కరికైనా వీసమెత్తు నష్టం జరిగిందా?? ఈ నాయకులు జరగనిస్తారా?

"దున్నపోతు ఈనిందంటే దూడను కట్టెయమన్నట్లు" ఎప్పటికప్పుడు ఈ స్వార్థ రాజకీయుల జిత్తులకు పోలోమంటూ గుడ్డిగా మద్దతిచ్చేసి, జైకొట్టే 'సామాన్య ప్రజానీకం' ఆ ఉసిగొల్పే నాయకుల 'అసలు రంగు'ని పట్టించుకునే ప్రయత్నమే చేయదెందుకో??

ఈ సదరు నాయకులు ఎన్నెన్నో పదవులు అనుభవిస్తూ, ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు ఈ తెలంగాణా వాదాన్ని వినిపించేందుకు నోరు పెగల్లేదెందుకో??

Monday, March 7, 2011

అంతేలేని ఆరంభం ఇది..!!


http://www1.sulekha.com/mstore/preethakannan/albums/default/sunset-mother-child.jpg

అంతేలేని ఆరంభం ఇది
గమ్యం తెలియని ప్రయాణమిది
అలుపు సొలుపు దరిచేరనివ్వక
విసుగు విరామం ఊసే ఎత్తక

ప్రతి అణువు నిలువెల్లా
తపించి తపించి తపములు చేసి
ఎదురుచూసి ఎదురుచూసి
ఎన్నో జన్మలు వేచి చూసి

బంధాల బంధనాలను సడలించి అదిలించి
ఉప్పొంగి పొంగు గంగా ఝరిలా ప్రవహించి
ప్రవహించి ప్రవహించి నీ దరికే వస్తున్నా

నీ పాద పద్మములకే అర్పిస్తున్నా.......!!!!

Friday, March 4, 2011

గౌరవనీయులైన *** *** వారికి…!!


ఇటీవల నాయకులు చేస్తున్న ఓ అత్యంత సాధారణమైన పని – “నిరాహార దీక్ష“

మరి ఇంతకు ముందు ఫ్యాషనేంటి?? – “బహిరంగ లేఖ”



ఆ పాత పంథాలోనే నేను కూడా ఓ బహిరంగ లేఖ వ్రాసేద్దామని నిన్న రాత్రి ఫిక్సయిపోయా.

విశాఖపట్టణంలోని గాజువాకలో ఉన్న ఓ ప్రముఖ విద్యా సంస్థకు చెందిన విద్యార్థులను నిన్న రాత్రి రైల్లో చూసిన తర్వాత.

ఈ లేఖ ముఖ్యోద్దేశం – ఆ కళాశాలను రచ్చకీడ్చేయాలన్న కుత్సిత బుద్ధి కానే కాదు.

ఇలాంటి కాలేజీల్లో చేరిన పిల్లలు బహు జాగ్రత్తగా ఉంటున్నారు, చక్కగా చదివేసుకుంటున్నారు… కళాశాల యాజమాన్యం, సిబ్బంది వారి గురించి తగు జాగ్రత్తలు తీసుకుని వారిని కంటికి రెప్పలా కాపాడుతుంటారనే అపోహలో, ఆ కాలేజీ ఫీజులను కట్టేందుకు, వాళ్ల పిల్లల గొంతెమ్మ కోర్కెలను తీర్చేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటున్న తల్లిదండ్రుల్లో కొందరైనా ఇది చదివి తగు రీతిన జాగ్రత్తపడితే చాలు.

ఫీజులు కట్టేసాము, కావలసిన పుస్తకాలు, బట్టలు తీసిచ్చేసాము.. ఇక మనకేంలే అనుకుంటూ హ్యాపీగా సెటిలైపోయిన పేరెంట్స్ కొంచెమైనా నేలకు దిగి, వాస్తవ పరిమాణాలను అర్థం చేసుకోవాలనే.

ఈ టపా కొందరు తల్లిదండ్రులకు, కళాశాలల యాజమాన్యాలకు కనువిప్పు కలిగిస్తుందని ఆశిస్తూ..

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

గౌరవనీయులైన *** *** కళాశాల యాజమాన్యానికి,

నేను నిన్న రాత్రి (అనగా 29వ డిసెంబర్ 2010 రాత్రి సుమారు 8 గంటలకు) నెల్లూరు నుండి చెన్నై వెళ్లే ప్యాసింజర్ రైలులో వెళ్తుండగా, మీ కళాశాలకు చెందిన సుమారు 30 మంది విద్యార్థినీ విద్యార్థులు తడ స్టేషనులో అదే రైల్లో ఎక్కారు.

స్వతహాగా విద్యార్థులంటే నాకున్న అభిప్రాయం ఆ వెంటనే మార్చుకోవలసి వస్తుందని నాకు అప్పుడు తెలియలేదు.

కొత్త సంవత్సర వేడుకలను జరుపుకునేందుకే వస్తున్నారో, ఏదైనా విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికే వస్తున్నారో తెలియదు గానీ, వారి ఆగడాలు శృతి మించి పాకాన పడ్డాయి. వారి వేషాలు, చేష్టలను ఇక్కడ విశదపరిచేందుకు నాలోని సభ్యత, సంస్కారం అడ్డుపడుతున్నందున మీకు తెలియచేయలేకపోతున్నందుకు బహుదా చింతిస్తున్నాను.

కనీసం బహిరంగ ప్రదేశాల్లో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని, తెలిసినా అందుకు తగిన విధంగా ప్రవర్తించే బుద్ధి, జ్ఞానం లేని విద్యార్థులను ఇలా ఊళ్ల మీదికి వదిలివేయడం మీకు, మీ కళాశాలకు ఉన్న మంచి పేరును చెడగొడుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంత మంది పిల్లలను విహార యాత్రకు విశాఖపట్టణం నుండి చెన్నై వరకు పంపేటప్పుడు కనీసం వారిని ఆజమాయిషీ చేసేందుకు పంపే వ్యక్తి/ వ్యక్తులకు తగిన జాగ్రత్తలు చెప్పవలసిన ధర్మం కళాశాల యాజమాన్యానికి ఉన్నదనడం కాదనలేని విషయం. మరి కేర్‌టేకర్ అనబడే సదరు వ్యక్తి తనతో పాటే వచ్చిన మరో ఉపాధ్యాయురాలితో మరో కంపార్టుమెంటులో సరస సల్లాపాలు సాగిస్తున్నాడేమోనన్న నా సహ ప్రయాణీకుని మాటలను నేను కాదనలేకపోయాను కూడా.

ఇంతా చేసి మీ విద్యార్థుల్లో కొందరికి ఉన్న బహు మంచి లక్షణం ఏంటయ్యా అంటే -
వాళ్ల మెడల్లో నుండి మీ కళాశాల గుర్తింపు కార్డులను తీయకపోవడం.

ఈ క్రింది తెలిపిన వాటిల్లో నుండి మీ సౌకర్యాన్ని బట్టి మీరో పని చేయండి -

1. ఇకపై ఇలాంటి విహార యాత్రలకు మీ కళాశాల నుండి విద్యార్థులను పంపేటప్పుడు వారి వారి ఐడి కార్డులను స్వాధీనం చేసుకోండి. అప్పుడు ఆ కోతిమూక మీ కళాశాలకు చెందినదనే విషయం బయటికి పొక్కదు. ఆ విధంగా మీ కళాశాల పరువు ప్రతిష్టలను కొంతవరకు నిలబెట్టుకోవచ్చు.

2. ఎలిమెంటరీ స్కూలు పిల్లలే ప్రేమలేఖలు వ్రాసేసుకుంటున్న ఈ రోజుల్లో ఇంత మందిని సామూహిక యాత్రకు ప్రోత్సహించిన పెద్దమనిషి ఎవరో పట్టుకుని, నాలుగు దులిపి సంజాయిషీ కోరండి.

3. ఒకవేళ ఈ యాత్ర మీకు తెలియకుండా జరిగి ఉంటే, ఈ మొత్తం లేఖలో మిమ్మల్ని ఉద్దేశించి ఆశీర్వదించిన పదాలను పక్కనపెట్టి, ఈ సంఘటనకు మూలకారణాన్ని అన్వేషించి, వాటిని రూపుమాపేందుకు తగు చర్యలను చేపట్టండి.

ఇవేవీ కాదనుకుంటే, మీకు స్వంతంగా ఆలోచించి ఇంతకంటే మాంఛి నిర్ణయాలు తీసుకునే మానసిక పరిపక్వత ఉంటే – అలానే చేయండి.

ఇట్లు,
‘శ్రీచరితం’ మాధవుడు