Thursday, April 7, 2011

పాడు కళ్లు


పాడు కళ్లు
పాఠాలు నేర్పుతానన్నా నేర్చుకోవు
తరగతి గదిలోంచి తొంగిచూసే పసిడిపిల్లల్లా
పై పై మెరుగుల అందాలవైపు
పరుగులు పెడుతున్నాయి...

పాడుకళ్లు
భావం వ్యక్తం చేసే నేర్పు ఉందనే గర్వం
భవిష్యత్ గురించి బెంగపడకుండా చేసింది
అసలు భయమే లేకుండా
భాష నేర్పుతానన్నా నేర్చుకోవు...

పాడుకళ్ళు
గండు వడగండ్ల జడిలో తడిచినప్పుడు
మనసు మనుగడకే ముప్పు ఎదురైనప్పుడు
గుండె గూటిలోని గులాబీ వాడినప్పుడు
కన్నీరే తమ భాషగా వర్షిస్తాయి.....
పాడుకళ్ళు........!!!!

Thursday, March 17, 2011

నేను... నేనే...!!


నేనేమైనా అద్దన్నా
నిన్ను కేవలం నిన్నులా చూపేందుకు

నేనేమైనా మైనాన్నా
అచ్చు నీలా మారిపోయేందుకు

నేనేమైనా ఆ చిలుకనా
నీ ప్రతిమాటను వల్లించేందుకు..

నేను... నేనే
అచ్చంగా.. మరో మార్పు లేకుండా...!!

Thursday, March 10, 2011

మిలియన్ "సందేహాల" మార్చ్...!!

తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన ఎందరో అమాయక ప్రజల కంటే ట్యాంక్‌బండ్‌పై ధ్వంసమైన విగ్రహాలు ఏమంత గొప్పవి కావని, అంత అవసరమైతే వాటిని మళ్లీ పునరుద్ధరించుకోవచ్చని, ఇక మీడియాపై జరిగిన దాడిని 'ఖండిస్తున్నాము' అని సరిపుచ్చుకున్న కేటిఆర్ అండ్ కో.,లకు, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే తక్కిన రాజకీయులందరికీ -

పోలీసుల లాఠీ దెబ్బలకు ఎప్పుడూ ఆ అమాయకులే ఎందుకు గురవుతున్నారు..????
పోలీసుల తూటాలు వారినే ఎందుకు వరిస్తున్నాయి..????

ఆ అమాయకులనే రక్షణ వలయంగా ఉపయోగించుకుంటూ పబ్బం గడుపుకుంటున్నదెవరు..?

ఆంధ్ర కేసరి వలె తూటాలకు రొమ్ము ఎదురొడ్డి నిలువగలిగే దమ్ము, తెగువ, అంకితభావం గల వారు మీలో ఎందరున్నారు..?

మల్టీస్పెషాలిటీ హాస్పిటళ్లలో డాక్టర్ల పర్యవేక్షణలో కాకుండా.. అమరజీవి వలె అకుంఠిత దీక్షతో, నిజమైన 'ఆమరణ నిరాహారదీక్ష' చేసే వారు మీలో ఎందరున్నారు..?

రాజులు, రాజ్యాలు అంతరించిపోయినా, పెత్తందార్లకు, భూస్వాములకు కాలం చెల్లిపోయినా ఆ శైలి పోరాటాలు మాత్రం ఆగటం లేదేం మరి.. నాయకుల జిత్తులకు సామాన్య కార్యకర్తలు, ప్రజలేగా అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ బలైపోతుండేది...

పైసల కోసమో, పదవుల కోసమో కార్యకర్తల జీవితాలను పణంగా పెట్టే నాయకుల కుటుంబాల్లో ఎవరికైనా, ఏ ఒక్కరికైనా వీసమెత్తు నష్టం జరిగిందా?? ఈ నాయకులు జరగనిస్తారా?

"దున్నపోతు ఈనిందంటే దూడను కట్టెయమన్నట్లు" ఎప్పటికప్పుడు ఈ స్వార్థ రాజకీయుల జిత్తులకు పోలోమంటూ గుడ్డిగా మద్దతిచ్చేసి, జైకొట్టే 'సామాన్య ప్రజానీకం' ఆ ఉసిగొల్పే నాయకుల 'అసలు రంగు'ని పట్టించుకునే ప్రయత్నమే చేయదెందుకో??

ఈ సదరు నాయకులు ఎన్నెన్నో పదవులు అనుభవిస్తూ, ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు ఈ తెలంగాణా వాదాన్ని వినిపించేందుకు నోరు పెగల్లేదెందుకో??

Monday, March 7, 2011

అంతేలేని ఆరంభం ఇది..!!


http://www1.sulekha.com/mstore/preethakannan/albums/default/sunset-mother-child.jpg

అంతేలేని ఆరంభం ఇది
గమ్యం తెలియని ప్రయాణమిది
అలుపు సొలుపు దరిచేరనివ్వక
విసుగు విరామం ఊసే ఎత్తక

ప్రతి అణువు నిలువెల్లా
తపించి తపించి తపములు చేసి
ఎదురుచూసి ఎదురుచూసి
ఎన్నో జన్మలు వేచి చూసి

బంధాల బంధనాలను సడలించి అదిలించి
ఉప్పొంగి పొంగు గంగా ఝరిలా ప్రవహించి
ప్రవహించి ప్రవహించి నీ దరికే వస్తున్నా

నీ పాద పద్మములకే అర్పిస్తున్నా.......!!!!

Friday, March 4, 2011

గౌరవనీయులైన *** *** వారికి…!!


ఇటీవల నాయకులు చేస్తున్న ఓ అత్యంత సాధారణమైన పని – “నిరాహార దీక్ష“

మరి ఇంతకు ముందు ఫ్యాషనేంటి?? – “బహిరంగ లేఖ”ఆ పాత పంథాలోనే నేను కూడా ఓ బహిరంగ లేఖ వ్రాసేద్దామని నిన్న రాత్రి ఫిక్సయిపోయా.

విశాఖపట్టణంలోని గాజువాకలో ఉన్న ఓ ప్రముఖ విద్యా సంస్థకు చెందిన విద్యార్థులను నిన్న రాత్రి రైల్లో చూసిన తర్వాత.

ఈ లేఖ ముఖ్యోద్దేశం – ఆ కళాశాలను రచ్చకీడ్చేయాలన్న కుత్సిత బుద్ధి కానే కాదు.

ఇలాంటి కాలేజీల్లో చేరిన పిల్లలు బహు జాగ్రత్తగా ఉంటున్నారు, చక్కగా చదివేసుకుంటున్నారు… కళాశాల యాజమాన్యం, సిబ్బంది వారి గురించి తగు జాగ్రత్తలు తీసుకుని వారిని కంటికి రెప్పలా కాపాడుతుంటారనే అపోహలో, ఆ కాలేజీ ఫీజులను కట్టేందుకు, వాళ్ల పిల్లల గొంతెమ్మ కోర్కెలను తీర్చేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటున్న తల్లిదండ్రుల్లో కొందరైనా ఇది చదివి తగు రీతిన జాగ్రత్తపడితే చాలు.

ఫీజులు కట్టేసాము, కావలసిన పుస్తకాలు, బట్టలు తీసిచ్చేసాము.. ఇక మనకేంలే అనుకుంటూ హ్యాపీగా సెటిలైపోయిన పేరెంట్స్ కొంచెమైనా నేలకు దిగి, వాస్తవ పరిమాణాలను అర్థం చేసుకోవాలనే.

ఈ టపా కొందరు తల్లిదండ్రులకు, కళాశాలల యాజమాన్యాలకు కనువిప్పు కలిగిస్తుందని ఆశిస్తూ..

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

గౌరవనీయులైన *** *** కళాశాల యాజమాన్యానికి,

నేను నిన్న రాత్రి (అనగా 29వ డిసెంబర్ 2010 రాత్రి సుమారు 8 గంటలకు) నెల్లూరు నుండి చెన్నై వెళ్లే ప్యాసింజర్ రైలులో వెళ్తుండగా, మీ కళాశాలకు చెందిన సుమారు 30 మంది విద్యార్థినీ విద్యార్థులు తడ స్టేషనులో అదే రైల్లో ఎక్కారు.

స్వతహాగా విద్యార్థులంటే నాకున్న అభిప్రాయం ఆ వెంటనే మార్చుకోవలసి వస్తుందని నాకు అప్పుడు తెలియలేదు.

కొత్త సంవత్సర వేడుకలను జరుపుకునేందుకే వస్తున్నారో, ఏదైనా విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికే వస్తున్నారో తెలియదు గానీ, వారి ఆగడాలు శృతి మించి పాకాన పడ్డాయి. వారి వేషాలు, చేష్టలను ఇక్కడ విశదపరిచేందుకు నాలోని సభ్యత, సంస్కారం అడ్డుపడుతున్నందున మీకు తెలియచేయలేకపోతున్నందుకు బహుదా చింతిస్తున్నాను.

కనీసం బహిరంగ ప్రదేశాల్లో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని, తెలిసినా అందుకు తగిన విధంగా ప్రవర్తించే బుద్ధి, జ్ఞానం లేని విద్యార్థులను ఇలా ఊళ్ల మీదికి వదిలివేయడం మీకు, మీ కళాశాలకు ఉన్న మంచి పేరును చెడగొడుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంత మంది పిల్లలను విహార యాత్రకు విశాఖపట్టణం నుండి చెన్నై వరకు పంపేటప్పుడు కనీసం వారిని ఆజమాయిషీ చేసేందుకు పంపే వ్యక్తి/ వ్యక్తులకు తగిన జాగ్రత్తలు చెప్పవలసిన ధర్మం కళాశాల యాజమాన్యానికి ఉన్నదనడం కాదనలేని విషయం. మరి కేర్‌టేకర్ అనబడే సదరు వ్యక్తి తనతో పాటే వచ్చిన మరో ఉపాధ్యాయురాలితో మరో కంపార్టుమెంటులో సరస సల్లాపాలు సాగిస్తున్నాడేమోనన్న నా సహ ప్రయాణీకుని మాటలను నేను కాదనలేకపోయాను కూడా.

ఇంతా చేసి మీ విద్యార్థుల్లో కొందరికి ఉన్న బహు మంచి లక్షణం ఏంటయ్యా అంటే -
వాళ్ల మెడల్లో నుండి మీ కళాశాల గుర్తింపు కార్డులను తీయకపోవడం.

ఈ క్రింది తెలిపిన వాటిల్లో నుండి మీ సౌకర్యాన్ని బట్టి మీరో పని చేయండి -

1. ఇకపై ఇలాంటి విహార యాత్రలకు మీ కళాశాల నుండి విద్యార్థులను పంపేటప్పుడు వారి వారి ఐడి కార్డులను స్వాధీనం చేసుకోండి. అప్పుడు ఆ కోతిమూక మీ కళాశాలకు చెందినదనే విషయం బయటికి పొక్కదు. ఆ విధంగా మీ కళాశాల పరువు ప్రతిష్టలను కొంతవరకు నిలబెట్టుకోవచ్చు.

2. ఎలిమెంటరీ స్కూలు పిల్లలే ప్రేమలేఖలు వ్రాసేసుకుంటున్న ఈ రోజుల్లో ఇంత మందిని సామూహిక యాత్రకు ప్రోత్సహించిన పెద్దమనిషి ఎవరో పట్టుకుని, నాలుగు దులిపి సంజాయిషీ కోరండి.

3. ఒకవేళ ఈ యాత్ర మీకు తెలియకుండా జరిగి ఉంటే, ఈ మొత్తం లేఖలో మిమ్మల్ని ఉద్దేశించి ఆశీర్వదించిన పదాలను పక్కనపెట్టి, ఈ సంఘటనకు మూలకారణాన్ని అన్వేషించి, వాటిని రూపుమాపేందుకు తగు చర్యలను చేపట్టండి.

ఇవేవీ కాదనుకుంటే, మీకు స్వంతంగా ఆలోచించి ఇంతకంటే మాంఛి నిర్ణయాలు తీసుకునే మానసిక పరిపక్వత ఉంటే – అలానే చేయండి.

ఇట్లు,
‘శ్రీచరితం’ మాధవుడు

Monday, February 28, 2011

కొడుకు ప్రతిరూపం…!

నా పుట్టినరోజును గుర్తు పెట్టుకుని మరీ ఓ బహుమతి పంపాడు. చాలా విలువైందే. ఈ వయస్సులో నాకు అవసరమైందే. వాడు అంత దూరాన ఉన్నప్పటికీ నాకు ఎందులోనూ తక్కువ చేయలేదు. చేతినిండా డబ్బులుంటే ఈ రోజుల్లో దొరకంది ఏముంది? వాడు డాలర్లు సంపాదించి, వాటిని రూపాయల్లోకి మార్చి నెలనెలా నా అవసరాలకు అవసరమైన దానికంటే ఎక్కువే పంపుతుంటాడు.

ఏమో.. దూరంగా ఉంటే ప్రేమ ఎక్కువవుతుందేమో..

వాడు పంపే డబ్బును ఖర్చు పెట్టేస్తుంటే చాలా బాధగా ఉంటుంది. నాకు అది డబ్బులా అ(క)నిపించదు. వాడికి నాపై ఉండే ప్రేమలా అనిపిస్తుంది. డబ్బులైపోతూ ఉంటే నా కొడుకు నాకు దూరమవుతున్నట్లే ఉంటుంది. అలాగని డబ్బును చూసుకుంటూ కూర్చుంటే ఈ వయసులో నాకు గడిచేదెలా. ప్రభుత్వం ఇవ్వజూపిన పెన్షన్‌ను ప్రజల మీద ప్రేమతో, కొడుకుపై నమ్మకంతో వదులుకుంటిని. ముక్కుసూటి వైఖరి కారణంగా సర్వీసులో ఉన్నప్పుడూ కూడబెట్టుకున్నదేమీ లేదు. దానికి నేనేమీ బాధపడటం లేదు కూడా…


నాకున్న ఆస్థంతా నా కొడుకే. పుట్టిన బిడ్డ ప్రయోజకుడైనప్పుడే కదా తండ్రి గర్వపడేది. చదువులోనూ చురుకైన వాడు కావడంతో జీవితంలో త్వరగానే సెటిల్ అయ్యాడు. అంచెలంచెలుగా ఎదిగి కొన్ని వందల మందికి జీవనోపాధి కలిగించే స్థాయికి ఎదిగాడు. అంత మంచి బిడ్డను కన్న నా అదృష్టానికి బంధువులు, మిత్రులు పొగుడుతుంటే నాలో నేనే సంబరపడిపోతుంటాను – చిన్నపిల్లాడిలా.

అందరికీ వాడంటే ఇష్టమే, వాడికీ అందరూ ఇష్టమే. ఇక్కడికి వచ్చే ప్రతిసారీ అందరికీ బహుమతులు తెస్తుంటాడు. అందరినీ పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు వాకబు చేస్తుంటాడు.

నా పుట్టినరోజు బహుమతి గురించి చెప్పనే లేదు కదూ… ఈ వయస్సులో నాకు అంత పనికొచ్చేది, అవసరమైంది ఏముంటుంది??

వయసు మీరిపోయావు, తూలిపడగలవు జాగ్రత్త అంటూ గుర్తు చేసే చేతికర్ర..

నేను వేలు పట్టుకుని నడిపించిన నా కొడుకు, తను నా చేయి అందుకుని ఆసరాగా నిలవలేకపోయినా – తన గుర్తుగా ఉంచుకోమని అపురూపంగా పంపాడు.

Monday, February 21, 2011

ఇంజినీర్లమా.. డాక్టర్లమా...!!మనం రోజుకు ఎన్నో (ఫైళ్లు, ప్రాజెక్ట్‌లు) డెలివరీలు చేస్తుంటాము కదా..

ఏయే సమస్యలున్నాయో (ఫైల్‌లో బగ్‌లు) వెతికి పట్టుకుని మరీ పరిష్కరించేస్తుంటాం..

ఇంటికి వెళ్లే దారిలో ఉన్నా, లేకుంటే ఇంటికెళ్లాక కూడా అర్జెంట్ కేస్ (అదే – డెడ్‌లైన్) అని ఫోనొస్తే అంతే వేగంగా తిరిగొచ్చేసి దాని సంగతి చూసి గానీ వెళ్లం..

అంతెందుకు..

అసలు ఒకసారి పనిలో దిగాక, అంటే ఉదయాన ఇంటి నుండి బయల్దేరి కార్యాలయానికి చేరుకున్నాక తిరిగి ఆరోజు ఇంటికి పోతామా పోమా, ఆ రాత్రి పనిలోనే తెల్లారిపోతుందా వంటివి తెలియవు కదా..??

మనం తెల్లని కోట్లు వేసుకోం గానీ, మనదీ వైట్ కాలర్ జాబేగా..

ఇన్ని పోలికలున్నా మనల్నెందుకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అంటారు..

సాఫ్ట్‌వేర్ డాక్టర్లు అనాలి గానీ!!!

నలుగురికీ నచ్చినది..!!


నాకు చిన్నప్పట్నుంచీ ఇంట్లో చాలా ముద్దుపేర్లే ఉన్నాయి..

ఇంట్లో చిన్నవాడిని కావడం మూలాన చిన్నా, మున్నా, నాన్నా అంటూ ఎవరికి తోచినట్లు వాళ్లు పిల్చుకుంటూ ఉంటారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా పలికే శ్రీకృష్ణుడు చిన్నతనంలోనే తల్లికి దూరమై, పెంపుడు తల్లి యశోదకు దగ్గరైతే, నేను ఉద్యోగరీత్యా మా అమ్మకు తాత్కాలికంగా దూరమై, పిన్ని ఇంటపడ్డాను. గత నాలుగేళ్లుగా ఆమె కూడా నాకో కొత్త ముద్దుపేరు తగిలించేసిందనుకోండి..

http://holidays.vgreets.com/Janmashtami/Around/Baby_Krishna.jpg
కానీ చాన్నాళ్ల తర్వాత మా అన్న నాకీరోజు ఓ కొత్త పేరు పెట్టాడు… – టక్కరి దొంగ అని. అలాగని నేనేదో మా అన్న పర్సులో నోట్లు దొంగిలించాననుకునేరు… “నలుగురికీ నచ్చినది నాకసలే ఇక నచ్చదురో” అంటూ చిన్నగా హమ్ చేస్తున్నాడు కూడా. అలాగని నేను ప్రిన్స్ మహేష్‌బాబులా ఉన్నానని మీరు అనుకుంటే అది మీ పొరపాటే.

ఆయన నాకా పేరు తగిలించడానికి గల ఏకైక కారణం – నేను నా బ్లాగ్‌లో ఉంచిన “వైష్ణవి హత్య – మరో కోణం” అనే పోస్ట్ మాత్రమే. ఈ రెండింటికీ గల లింక్ ఏమిటి అని మీరనుకోవచ్చు.

ఇదిగో… నాకు మా అన్నకు జరిగిన వాగ్యుద్ధం:

ఎందరో బ్లాగ్ మిత్రులు కూడలి, జల్లెడ, హారం వంటి వాటి ద్వారా బ్లాగ్ పెట్టిన వెంటనే చదివేస్తే మా అన్న మాత్రం నేను బ్లాగ్ పెట్టిన ఏ మూడు నాలుగు రోజులకు గానీ చూడడు. ఆయన ఓ పేద్ద ఎంఎన్‌సికి మేనేజర్ మరి. సరేలే ఎంతైనా అన్న కదాని ఫోన్ చేసి ఇలా అన్నా.. “అన్నా, నేనో బ్లాగ్ వ్రాసాను “వైష్ణవి హత్య” గురించి. చూసి నీ అభిప్రాయాన్ని తెలియజేయి” అని.. ఇలా అన్నానో లేదో వెంటనే – “నేనసలు ఆ పాప గురించి వార్తలు కూడా చదవడం మానేసాన్రా.. మనస్సంతా ఏదోలా ఉంది.. మళ్లీ నీ సోదొకటా.. నేను చదవను పో” అనేసి ఫోన్ పెట్టేసాడు.

అన్నాడేగానీ, వీడెలా వ్రాసాడో, ఏమి వ్రాసాడోననే కుతూహలంతోనే కావచ్చు.. నా బ్లాగ్ తెరిచినట్లున్నాడు..

ఈ రోజు మొదలెట్టడమే “ఎంతైనా నువ్వో పెద్ద టక్కరి దొంగవిరా” అనేసాడు.. అదేంటి అని నేనడిగేలోపే “నలుగురికీ నచ్చినది నాకసలే ఇక నచ్చదురో” అని తన సినిమా పరిజ్ఞానాన్ని ప్రదర్శించాడు.

ఇక నేరుగా రంగంలోకి దిగిపోతూ -
“పాపం ఆ ప్రభాకరాన్ని ఇంతలా ఏకేశావేంట్రా.. తన కూతురు చనిపోయిందనే బాధతో గుండె ఆగి మరణించాడన్న జాలైనా లేకుండా.. ప్రపంచమంతా అతనంత గొప్ప తండ్రి లేడని, ఫాదర్స్ డేని తను చనిపోయిన రోజుకు బదలాయించాలనీ కోడై కూస్తుంటే ఈ సరికొత్త కోణమేంటి మధ్యలో. నీ లాజిక్కుల మ్యాజిక్‌కి అంతంటూ లేదా..” అని తనకున్న వాగ్దాటిని ప్రదర్శించాడు.

ఎంతైనా వయస్సులో పెద్దవాడు.. పూర్తిగా మాట్లాడనిచ్చానీసారికి.. ముగించాక నేనొకే ప్రశ్న వేసాను..

“నేను వ్రాసినదాంట్లో ఏమైనా అసంబద్ధంగా ఉందా?” – ఆ వైపు నుండి నిశ్శబ్దం..
“వాస్తవదూరం అనిపించిందా?” – ఆ వైపు నుండి చిన్న శబ్దం – “కాదనుకో” అంటూ..

“అనుకో ఏంటి.. కాదు.. మందలో గొర్రెలా ఉండలేకే కదా ఈ అవస్థలు. ఎవడో ఎక్కడో ఏదో చేసి దేనికో చస్తాడు.. అయ్యో పాపం అంటూ ఏ ఒక్క పేపరోడో, టీవీ చానెలోడో మొదలెడతాడు బాకా (చంద్రబాబుకు ఈనాడులా, వైఎస్‌కో, కాంగ్రెస్‌కో సాక్షిలా, మరికొందరికి ఆంధ్రజ్యోతిలా).. ఇంక అంతే… పోలోమంటూ వెంటపడతారు జనం.. చేసిన తప్పులన్నీ గాలికి పోతాయి.. పోయినోళ్లందరూ మంచోళ్లేనంటూ మెట్ట వేదాంతాన్ని వల్లిస్తారు.. జరిగిన అనర్థానికి, తప్పుకు మూలకారణాన్ని వదిలేసి చెత్తంతా మాట్లాడేస్తారు”

భార్యాభర్తల సంబంధం గురించి, మనస్పర్థలతో కాపురాలను చెల్లాచెదురు చేసుకున్న వారి గురించి, అక్రమ సంబంధాలతో జీవితాలను నాశనం చేసుకున్న వారి గురించి నేనీ బ్లాగ్ వ్రాసిన రోజు రాత్రే బాబాయి ఒక క్లాస్ పీకాడు. గోడకు కొట్టిన బంతిలా నేను ఓ పెద్ద క్లాసే పీకాననుకో.

భార్యకు తెలీకుండా భర్త, భర్తకు తెలీకుండా భార్య ఎన్నో తప్పులు చేస్తుంటారు. పగిలిన అద్దం అతకదు, రగిలిన చిచ్చు ఆరదు అని శోభన్‌బాబు డైలాగులన్నీ వల్లించాడు కూడా. దొరకనన్నాళ్లు ప్రతివాడూ దొరే అని ఆయన రెచ్చిపోయాడు.. ఈ విషయాన్ని పిన్నీకి చెప్పాలి ముందు.. ఆయనేమేమి చేస్తున్నాడో ఏంటో.. గురుడు.. ప్లాట్‌ఫామ్ తయారు చేసుకుంటున్నట్లున్నాడు.

నేను ఏదో ఉలిపికట్టె చందాన విడ్డూరంగా ప్రవర్తించాలి, బ్లాగాలి అనే దుగ్ధతో ఆ పోస్ట్ వ్రాయలేదు.. అలాగని ఆ ప్రభాకరం పట్ల సానుభూతి కురిపించిన వాళ్లను తప్పు పట్టడం లేదు.. ఎవరి అభిప్రాయాలు వారివి..

ఎవరి ప్రభావంతోనో అభిప్రాయాలను మార్చుకోవడం నాకు చేతకాదు. ఓ సంఘటన జరిగిందని చదివినప్పుడో, చూసినప్పుడో దాని మూలాలేంటి అనే విషయాన్ని గాలికి వదిలేయడం చాలా తప్పు. మా మేనేజర్‌లా పక్కనోడి ద్వారా పని చేయిస్తూ, ఇష్టమైన వాడి బుర్రతో ఆలోచిస్తూ గడిపేస్తే ఎలా. స్వంత బుర్రను కూడా ఉపయోగించాలి కదా…

మనం అసలు స్పందించేదే చాలా తక్కువ విషయాలకు..
కొన్ని విషయాలకు తక్షణమే మాటలతోనో, చేతల ద్వారానో స్పందిస్తాం..
చాలా చాలా కొన్ని విషయాలకే మనస్సుతో స్పందిస్తాం..
చాలా విషయాలకు అసలు స్పందించమనుకో.. అసలే స్పీడు యుగం కదా
మనం స్పందనల్లో మునిగి తేలుతుంటే, మరొకడెవడో మనకంటే ముందుకెళ్లిపోతాడనే బెంగ, ఆదుర్దా, భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి..

ఆ స్పందించే కొన్ని విషయాలకు కూడా మరొకడి పంథాలోనే సాగితే ఎందుకు బ్రతుకు…

మా అన్న అర్థం చేసుకున్నట్లున్నాడు..

మరి మీరు??

Sunday, February 20, 2011

వైష్ణవి హత్య – మరో కోణం..!వైష్ణవిని చంపింది ఎవరు!?

మామ (సవతి తల్లి సోదరుడు) కాదు, కిరాయి హంతకులు కాదు…

ఇంకెవరు…
మరెవరో కాదు – సాక్షాత్తూ ఆమె తండ్రే..!

ఆ చిన్నారిని ప్రాణప్రదంగా ప్రేమించాడు, ఆ చిన్నారి మరణించందన్న ఘోరమైన వార్త విని తట్టుకోలేక చనిపోయాడు అని అందరూ సానుభూతి కురిపిస్తున్న ఆమె తండ్రే..

నమ్మ(లే)కపోయినా అదే నిజం.

ఒకామెని పెళ్లి చేసుకుని, ఆమె ద్వారా ఓ బిడ్డను కూడా కని ఆపై మరొక స్త్రీపై (వ్యామోహంతోనో, ప్రేమతోనో – అది ప్రస్తుతానికి అప్రస్తుతం) మనసుపడి ఆమెనూ వివాహం చేసుకుని పిల్లలను కని, అంతటితో ఆగకుండా అసలు ఆ మొదటి భార్య ఊసే పట్టించుకోకుండా ఆమె ముఖం చూడకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించిన ప్రభాకరే పరోక్షంగా ఈ దారుణానికి కారకుడు.

ఈ తప్పులన్నింటితో పాటు అతను మరికొన్ని తప్పులు చేసాడు..

కుటుంబం పరువు కోసమో ఏమో గానీ తనకెవరూ శత్రువుల్లేరంటూనే కాలయాపన చేసాడు. ఒకవేళ ఆ చిన్నారి మొదటిసారి అపహరణకు గురైనప్పుడే తగిన సమాచారం అందించి ఉంటే అప్పుడే ఈ నిందితులు శిక్షించబడి ఉంటే.. .. పోనీ, ఈ దఫా అయిన పోలీసులతో అతను సరిగ్గా సహకరించాడా అంటే అదీ లేదు.

బహుశా తన చిన్నారి అపహరణకు గురైన రెండ్రోజులు తాను చేసిన తప్పులను సమీక్షించుకున్న అతని గుండె తట్టుకోలేకపోయిందేమో.. ఆ చిన్నారినే చేరుకునేందుకు ప్రభాకరాన్ని సిద్ధం చేసేసింది.

ఈ వైష్ణవి ఉదంతం పెళ్లయ్యినప్పటికీ పరస్త్రీలపై మోజు పడే ప్రభాకరం లాంటి ప్రతి పురుషుడికి గుణపాఠంగా మిగిలిపోతుంది..
పెళ్లయ్యి, అందునా పిల్లలున్న ఓ పురుషుడి పట్ల ఆకర్షితురాలు కాకుండా ప్రతి స్త్రీకి పీడకలగా మిగిలిపోతుంది..

తమ ఇంట అల్లారుముద్దుగా పెరిగిన సోదరి లేదా ఆమె సంతానం ఎక్కడ దిక్కులేనివారైపోతారోననే భయం, అభద్రతాభావం కారణంగానే కావచ్చు వెంకట్రావ్ అతి నీచమైన ఓ దారుణానికి ఒడిగట్టాడు. హత్య చేయడానికి సిద్ధపడినవాడు తన అక్కను వదిలి మరొక స్త్రీని ప్రభాకరం పెళ్లి చేసుకున్నాడన్న నిజం తెలిసిన వెంటనే తన బావనే హత్య చేసి ఉండవచ్చు. అప్పుడు అతను చేసిన హత్య పట్ల ఇంత వ్యతిరేక భావం ప్రజల్లో కూడా ఏర్పడి ఉండకపోవచ్చు. కాదు.. తన అక్క సౌభాగ్యాన్ని తన చేతులారా చెరపలేకపోయాడనుకుంటే…. పెళ్లయ్యి, పిల్లలున్న ఓ పురుషుడిని ఆకర్షించిన లేదా అతని పట్ల ఆకర్షితురాలైన ఆ స్త్రీనే హత్య చేసి ఉండాల్సింది. అతడిని ఆమె నిజంగానే ప్రేమించి ఉండవచ్చు.. లేదా అతని మాయమాటలకు వంచించబడి ఆపై మరొక దారి లేక అతనితోనే జీవనం సాగిస్తూ ఉండవచ్చు.. లేదా ఆస్థి కోసం పన్నాగం పన్ని అతడినే వలలో వేసుకుని ఉండవచ్చు కూడా.

ఏది ఏమైనా ఇక్కడ అన్ని సందర్భాల్లోనూ నష్టపోతుండేది స్త్రీయే.
కాకపోతే వాళ్ల పేర్లు, సంఘంలో వాళ్ల హోదాలే వేర్వేరుగా ఉంటాయి..
ఒకరు మొదటి భార్య, మరొకరు రెండవ భార్య.

హత్యలు ఎలా చేయాలో, ఎవరిని చేయాలో, చేస్తే ఏ కారణాలతో చేయాలి అని బోధించడమో ఈ పోస్ట్ సారాంశం కాదు.

పెద్దలు చేసిన తప్పులకు పిల్లలను దండించకండి అనే..
ఆస్థుల కోసం అన్నెం పున్నెం ఎరుగని పసిమొగ్గలను తుంచెయ్యకండి అనే..

తెలంగాణా కోసం – దశాబ్దానికొక్కడు...!!ముందుగా, తెలంగాణా వాళ్లని తాలిబన్లు అని నేను నా బ్లాగ్‌లో ఎక్కడా సంబోధించలేదు. అలాంటి విద్వేషాలను రెచ్చగొట్టే పదప్రయోగాలు నాకు అలవాటు లేదు కూడా. తెలంగాణా కోసం పోరాడే వాళ్లందరినీ ఒకే గాటన కట్టేయడం కూడా సమంజసం కాదు. ప్రత్యేక తెలంగాణా జబ్బుకు అభివృద్ధి అనే పరిష్కారాన్ని ఎందుకు ఉపయోగించకూడదో, అక్కడి ప్రజలు ఆ కోణంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారనే నా బాధ. కాలికో, చేతికో కాన్సర్ వచ్చినా ముందుగా మందులతో నయం చేసేందుకు ప్రయత్నిస్తాం.. స్థోమతను బట్టి అంతో ఎంతో ఖర్చుపెడతాం గానీ ఏకంగా సర్జరీ చేసి తీసెయ్యంగా, ఇన్నేళ్లుగా కలిసిమెలిసి ఉన్న ప్రజల మనోభావాలతో చెలగాటాలాడటం ఎందుకని ఎవరూ ఆలోచించలేకపోతున్నారే.

ఇప్పుడు తెలంగాణా ఇవ్వండని పార్టీలకతీతంగా జెఎసి వంటివి వెలుస్తున్నాయి కదా. అసలు ఆ రాజకీయులు తాము పదవిలో ఉన్నంత కాలమూ ఆ ప్రాంతానికి ఏం చేసి అలసిపోయారు. నేను ఏ ఒక్క కెసిఆర్ గురించో మాట్లాడటం లేదు.. జానారెడ్డి, నాగం – ఇలా ఎవరైనా కావచ్చు. అలాంటి మాయాగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకునే, పోలీసులతో వీధి పోరాటాలు చేసే అమాయకుల గురించి ఎవరూ మాట్లాడరేం?

ఈ తెలంగాణా అంశాన్ని నేను నా బ్లాగ్‌లో ప్రస్తావించింది సమైక్యాంధ్రుల కోసమే కాదు. మీరన్నట్లు నా బ్లాగ్‌ను అనుసరించే వాళ్లలో తెలంగాణా వాళ్లు కూడా ఉన్నారు. ఒక రకంగా వాళ్లే ఎక్కువ. “విడిపోవడం ఒక్కటే పరిష్కారం కాదు – కలిసి ఉండి కూడా అభివృద్ధి సాధించవచ్చు” అనేదే నా స్లోగన్. ఎవరేమనుకున్నా సరే!!

తెలంగాణా ప్రాంతం అభివృద్ధి కోసం దీక్షలు చేయండి, ధర్నాలు చేయండి, నీళ్ల కోసం, భూమి కోసం, కనీస సౌకర్యాలు కూడా లేని పల్లెల్లో వెలుగుల కోసం పోరాడండి. అది మీ హక్కు కూడా. తెలంగాణా కావచ్చు, కోస్తా, రాయలసీమ – ఇలా ఏదైనా కావచ్చు.. ఏ ఒక్కరి జాగీరో కాదు. తెలంగాణా అంటే కెసిఆర్, రాయలసీమ అంటే వైఎస్, కోస్తా అంటే మరొకరో కాదు సోదరా.. 10 కోట్ల మందికి వీళ్లు కేవలం ప్రతినిథులు మాత్రమే. ఎవడో ఎక్కడో తెలంగాణా వాళ్లను తాలిబన్లు అంటే అది మొత్తం తెలంగాణేతర ప్రజల ఉద్దేశ్యం కాదు అని గుర్తుంచుకో. ఆ మాటకొస్తే ఆ ప్రాంత నాయకుడు అయిన కెసిఆర్ కోస్తా, రాయలసీమ ప్రజలను అనని మాట ఉందా. వాటన్నింటినీ వల్లె వేయడం మొదలెడితే, నా బ్లాగ్ బూతు బ్లాగ్ అయిపోతుంది.

సంవత్సరానికొక్కడు, దశాబ్దానికొక్కడో తన స్వప్రయోజనార్థం ప్రజల మధ్యన చిచ్చు పెట్టి తన పబ్బం గడుపుకుంటాడు. కాకుంటే అప్పుడు చెన్నారెడ్డి, ఇప్పుడు కెసిఆర్. చూస్తూ ఉండండి.. కెసిఆర్ కొడుకు సోనియమ్మ చంకనెక్కి ప్రత్యేక తెలంగాణాను అటకెక్కించే రోజు ఎంతో దూరంలో లేదు.

ఇక లగడపాటి అంటారా -

వెయ్యి అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. ప్రాణహాని, మానహాని సమయాల్లో బొంకవచ్చన్నారు. (ఇక్కడ మళ్లీ నేను తెలంగాణేతరుణ్ణి కాబట్టి లగడపాటిని వెనకేసుకుస్తున్నాననే కొత్త వాదనను తెర మీదకు తీసుకురావద్దని మనవి). అతను కొంత ఓవరాక్షన్ చేసిన మాట నిజమే. అయినా “కెసిఆర్ దీక్ష చేసింది కూడా ఇలాగే. దీన్ని మీకు అర్థం అయ్యాలే చేసేందుకే నేను ఇలా చేసానం”‘టూ తప్పించుకోబోయాడు. ఒక రాష్ట్రం విడిపోయే పరిస్థితే ఉత్పన్నమయినప్పుడు.. దాన్ని అడ్డుకునే ప్రహసనాన్ని రామాయణం అనుకుంటే – ఈ లగడపాటి వివాదాన్ని (రామాయణంలో) పిడకలవేట అనుకోండి. అయినా మీరడిగారు కాబట్టి, తప్పకుండా అతని గురించి ఆలోచిద్దాం. కొన్నాళ్లుగా మీడియాకు, వివాదాలకు దూరంగా ఉంటున్నాడుగా. మళ్లీ రాకపోడు.. తీవ్రతను బట్టి చెడామడా దులిపేద్దాం..

ఏమంటారూ??!

Friday, February 18, 2011

తెలంగాణా విభజన – ఆత్మహత్యా సదృశమే..!!

మిత్రులు (చందమామ) రాజుగారు commented – “తెలంగాణాను దోచుకునేందుకు..!” on December 29th, 2009 -

సినీ రంగంలో దాదాపు 20 సంవత్సరాలు వెకిలి కామెడీలు చేసిన ఆలిండియా అందగాడు బాబూమోహన్ మీకు గుర్తున్నాడా? కొడుకు హఠాన్మరణంతో అతని వెండితెర జీవితం ఒక్కసారిగా కుదేలైపోయింది. మరో కొడుకుతో తీసిన సినిమా కూడా తూతూమంత్రంగా చీదేసేటప్పటికీ అతను ఒక సరిక్రొత్త వివాదానికి తెరతీసాడు… – ఏమని.. తాను “దళితుడు” అయినందువల్లనే దర్శక నిర్మాతలు తనతో వెకిలి కామెడీలు చేయించారని, గాడిదకు తాళి కట్టే సీన్లు, కాలితో తన్నించుకునే సీన్లను తనపై చేసారని పెద్ద దుమారమే రేపాడు. (ఇంచుమించు ఆ సమయంలోనే స్వర్గీయ శోభన్‌బాబు గురించి మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో రచ్చకెక్కాడనుకోండి..)

ఈ సమయానికే తెలంగాణా రామాయణంలో బాబూమోహన్ పిడకలవేట ఏమిటనే సందేహం మీకొచ్చే ఉంటుంది..

తెలంగాణావాదుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే సందర్భాలు, సంఘటనలు సంభవించినప్పుడే వాటిని ఎదుర్కొనే తీరులో ఎదుర్కొని ఉంటే సమస్యకు అంతిమ పరిష్కారం విడిపోవడం అనేది అయ్యి ఉండేది కాదు. ఇన్ని దశాబ్దాలుగా దాన్ని నాన్చి, నాన్చి ఇక్కడ వరకు తెచ్చారు. అంతెందుకు – మన పొరుగున ఉండే తమిళనాడులో ప్రముఖ హీరో విజయ్ నటించిన ఓ సినిమాలో న్యాయవాదులను కించపరిచే సన్నివేశాలున్నాయని అక్కడి న్యాయవాదులందరూ రచ్చకెక్కారు. ఆ హీరో క్షమాపణలు చెప్పాడనుకోండి. ఆ తర్వాత అలాంటి సన్నివేశాలను చిత్రీకరించేందుకు మిగతావారు వెనుకడుగు వేసారు, వేస్తారు కూడా. అంతేగానీ, ఇలాంటి సంఘటనలను తక్షణమే స్పందించకుండా దాని గురించే ఓ 40, 50 ఏళ్లు ఆలోచిస్తూ ఉపేక్షించడం తప్పని మాత్రమే నా భావన. వీటన్నింటికీ పరిష్కారంగా ఇప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టడం అని వాదించడం సరికాదు కదా.

మన బాబూమోహన్‌నే చూడండి – వేషాలు వచ్చినన్ని రోజులూ చేసాడు, సంపాదించాడు, చక్కగా స్థిరపడ్డాడు. గతంలో అతను ఇలాంటి వేషాలు నేను చేయను అంటూ వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయా? అవసరార్థం, స్వప్రయోజనార్థం అప్పుడు ఒప్పేసుకుని, చేసేసి ఇప్పుడేమో “దళిత” మాస్క్ వేసుకుని ప్రకటనలు గుప్పించేయడం సరి కాదు.

ఇప్పుడేమో మన ఓయూ విద్యార్థులు, తెలంగాణా వేర్పాటువాదులు అందరూ నిరాహార దీక్షలు చేస్తున్నారు – దేని కోసం.. రాష్ట్రాన్ని విడగొట్టమని. అంతేగానీ, వీళ్లల్లో ఏ ఒక్కరైనా, ఎప్పుడైనా మా కోసం ఒక డ్యామ్ కట్టండి, మా కోసం ఒక ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయండి, మా ప్రాంతంలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టండి అని ఎప్పుడైనా దీక్షలు చేసినట్లు చరిత్ర ఉందా? (ఇది తెలంగాణాకే కాదు, యావద్భారతానికి వర్తిస్తుంది..) విడిపోవడం సమస్యలకు పరిష్కారమా? చేతనైతే అలాంటి దీక్షలు చేపట్టమనండి. అప్పుడు మనస్సుండే ప్రతి తెలుగువాడూ వాళ్ల దీక్షకు సంఘీభావం ప్రకటిస్తారు. కాదని మీరు, మరొకరు వ్యతిరేకించగలరా?

మీరన్నట్లు – తెలంగాణా ఆత్మగౌరవార్థం ప్రత్యేక రాష్ట్రాన్ని మంజూరు చేసారనే అనుకుందాం.. అప్పుడు సినిమాల్లో వాళ్ల యాసను కించపరిచే సన్నివేశాలుండవని ఎవరైనా హామీనివ్వగలరా? ఇప్పటికీ మన తమిళ సినిమాల్లో తెలుగు భాష, యాసతో పాటు అక్షరాలను సైతం కించపరుస్తూనే ఉంటారే – జిలేబీలు చుట్టినట్లుగా గందరగోళంగా ఉంటాయని.. తమిళనాడు నుండి మనం విడిపోయి ఎన్ని సంవత్సరాలు గడిచాయి మరి?

మీ వ్యాఖ్యలో -
1. ‘మీ నాయకుల చేతకానితనాన్ని మీరు ప్రశ్నించరెందుకు’ అంటూ వారిని దెప్పడం సమస్యకు పరిష్కారం కానేకాదు.
2. తెలంగాణాలో నిజమైన బాధితుల సమస్యను పట్టించుకోకుండా కేవలం అక్కడి రాజకీయ నేతల స్వార్థం మీద మాత్రమే బాణం ఎక్కుపెడితే మరింత ఆవేశకావేషాలు పెరగడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఒరగదు.

మొదటిదానికి నా జవాబు -
ఇప్పుడు తెలంగాణాను విడగొట్టడానికి చేతులు కలిపిన నాయకుల్లో ఎన్నో ఏళ్లు ఎన్నో హోదాల్లో, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పదవులు వెలగబెట్టిన వారున్నారు. వారు ఆ ప్రాంత అభివృద్ధికి ఎంత కృషి చేసారు.. అలాంటి వారి దొంగ దీక్షలకు తలొగ్గి ఇప్పుడు తెలంగాణా అనే ప్రాంతాన్ని విడగొడితే ఆ ప్రాంతాన్ని వీరు అభివృద్ధి చేయగలరా? అసలు ఆ నాయకులకు తెలంగాణా ఇమ్మని అడిగే నైతిక హక్కు ఉందా?

అక్కడి అక్షరాస్యతా శాతం ఎంత? పన్నుల రూపంలో లభించే ఆదాయమెంత? అక్కడి సగటు జీవి తలసరి ఆదాయమెంత? తెలంగాణా ఇచ్చేస్తే రాత్రికి రాత్రి అల్లా ఉద్దీన్ కథలోలా ఏమైనా అద్భుతాలు జరిగిపోతాయా?

జల వనరులను వినియోగించుకోవడానికి రోడ్ల మీద గోడలు కట్టినట్లు ప్రాజెక్టులు కట్టెయ్యలేరుగా? ఆ అనుమతులను వారు పొందగలరా? పొందగలిగితే అదేదో కలిసి ఉండే చేసుకోవచ్చుగా. అందుకే మీ నాయకులను ప్రశ్నించండి అని నేను వారికి వారు మర్చిపోయిన వాళ్ల హక్కును గుర్తుచేసానే తప్ప దెప్పలేదు, దెప్పను, దెప్పడం నా అభిమతం కాదు.

ఇక రెండోది -
నా మొత్తం బ్లాగ్ పోస్ట్ సారాంశం అదే మహాశయా.. నిజమైన బాధితుల సమస్యలను పట్టించుకోండి అనే. నీతిమాలిన రాజకీయులను నమ్మి మోసపోవద్దనే. బాధితుల సమస్యలను పట్టించుకోవడమంటే రాష్ట్ర విభజనకు సై అనడం కాదు కదా. అక్కడ సర్వతోముఖాభివృద్ధికి బీజాలు వేయమనే కానీ కపట దీక్షలకు పొంగిపోయో, లొంగిపోయో అనవసర ఆవేశాలకు లోనయ్యో ప్రాణాలు తీసుకోవద్దనే.. అభివృద్ధిపరచమని అడిగేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది, ఆత్మగౌరవానికి భంగం కలిగితే తిరగబడే హక్కూ ఉంది, కానీ – విడిపోవడమే పరిష్కారమా..?

తెలంగాణాను విడగొట్టడమనేది నూటికి నూరు శాతం ఆత్మహత్యా సదృశమే తప్ప మరొకటి కానే కాదు…!

మీ స్పందనకు నా ప్రతిస్పందన సముచిత రీతిలో ఉందనే భావిస్తూ..