Sunday, May 31, 2009

నీ కోసం నిరీక్షణ..!

ఇన్నాళ్ల
నా నిరీక్షణకు ప్రతిఫలమా -
కలలో..
నీ దర్శనం…!

* * *

అడిగినదానికంటే
పదింతలు ఎక్కువే ఇచ్చావు -
నేనడిగింది నీ చిరునవ్వులు..
నువ్విచ్చింది నాకు కన్నీళ్లు…!

* * *

ఆశకు హద్దే లేకుండా పోతోంది
ఇంకా ఎదురుచూస్తూనే ఉంది -
ఆశగా నీ కోసం..
సమాధిలో…!

* * *

గద్దరు… ఖద్దరు


ప్రత్యక్ష రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరో కొత్త నాయకుడు తెరపైకి రానున్నారు. ఆయన గుణగణాలు కీర్తించడం నారదాది మునీంద్రులకే సాధ్యం కాదు. గొప్ప పాటగాడు, వెన్నులో బుల్లెట్ ఉన్నవాడు, తెలంగాణ సాంస్కృతికోద్యమ నాయకుడు, పీపుల్స్‌వార్ మా’నస పుత్రుడు. పేరుకు నాస్తికుడే, తిరిగేవేమో రామాలయాలు. పోలవరం నిర్వాసితుల కోసం సంవత్సరాల తన నాస్తికత్వాన్ని తుంగలో తొక్కి రాముణ్ణి శరణు వేడాడు కూడా.

చరిష్మా లేదు, అహింసనే ఆయుధంగా చేసుకున్న గాంధీజీని అనుకరిస్తూ గోచీ, చొక్కాలేని అలంకరణ, ఆ పక్కనే తుపాకీని నమ్ముకున్న మావోయిస్టుల సానుభూతిపరుడనే ముద్ర.

పేరు గుమ్మడి విఠల్ రావు… ఎవరబ్బా అని బుర్రలు గోక్కుంటున్నారా.. సరే అయితే… గద్దర్!!
కుటుంబం.. భార్య విమల, పిల్లలు సూరీడు (ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు), చంద్రుడు (2003లో అనారోగ్యం కారణంగా మరణించారు), వెన్నెల (డాక్టర్ అనుకుంటా)

సిల్వర్ స్క్రీన్‌పై రెచ్చిపోయి రికార్డులు నెలకొల్పిన విధంగానే ఎన్‌టిఆర్ రికార్డును కూడా అధిగమించేస్తామన్న అత్యాశో, స్పష్టమైన అవగాహన, ప్రణాళిక లేకపోవడం మూలానో… కారణాలేవైతేనేం, అట్టహాసంగా ప్రారంభమైన “ప్రజారాజ్యం” పార్టీ జంపింగ్ రాయుళ్లతో నిండిపోయి సార్వత్రిక ఎన్నికల్లో చతికిలపడింది. జాతరకి వచ్చేవారందరూ భక్తులు కారు, సభలకు హాజరయ్యే జనమంతా ఓట్లు వేయరు అనే విలువైన సూక్తిని చిరు & కో ఇప్పటికి అర్థం చేసుకునే ఉంటారు.

కోట్ల రూపాయల బడ్జెట్‌తో సినిమాలు తీసి, వందల ప్రింట్లతో పంపిణీ కార్యక్రమాలు చేపట్టి, రాష్ట్రంలోని థియేటర్లపై గుత్తాధిపత్యం సాధించిన మెగాస్టారుకే సాధ్యం కాని రాజకీయ క్రీడలో ఓ గోచీ పెట్టుకుని, నల్ల కంబళి, గుబురు గడ్డంతో, జజ్జనకరజనారే పాటలతో ఈయన ఏ మాత్రం ప్రభావం చూపగలడు. పోనీ, ఏమైనా స్పష్టమైన సిద్ధాంతాలకు కట్టుబడతాడా అంటే.. అదీ అనుమానమే.

ఎలాంటి నైతిక విలువలున్నాయని అతను ఈనాడు రాజకీయ పార్టీని స్థాపించి, తెలంగాణను కోరుతున్నాడు. ఆమాటకొస్తే ఏ రాజకీయ నాయకునికి లేని నైతిక విలువలు ఇతనికి ఎందుకు అనొచ్చు. అయితే దాదాపు 4 దశాబ్దాల పార్టీ జీవితం గడిపిన అతనికి ఇతరులకి తేడాల్లేవా. అలాంటప్పుడు ఇతనెందుకు. ఎలాంటి నిబద్ధత ఇతని స్వంతమని ఈ రోజు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీని స్థాపిస్తున్నాడు. ఎప్పుడో 1969లో ముట్టుకుని వదిలేసిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనని ఇప్పుడు మళ్లీ ఎందుకు నెత్తికెక్కించుకుంటున్నాడు.. నిజంగా అతనికీ విషయంలో నిజాయితీ ఉంటే.. ఈ 40 ఏళ్లూ అవిరామ కృషి చేసి ఉంటే, సమైక్య ఆంధ్ర రాష్ట్రం నుండి వేరుపడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాలని ఆ ప్రాంతం ప్రజలు భావిస్తూ ఉంటే తెలంగాణను వైఎస్, చంద్రబాబు కాదు కదా, సోనియా, వాజ్‌పేయిలు కూడా అడ్డుకుని ఉండలేరు.

తెలంగాణ కోసం కుష్టురోగిని కావలించుకుంటా, గొంగళి పురుగునైనా ముద్దెట్టుకుంటాననే డైలాగులతో బాటు, అడ్డొచ్చిన వాడిని తలను తెలంగాణా తల్లికి అర్పిస్తానంటూ తైతక్కలాడే కేసిఆర్… ఆత్మప్రబోధం, అమ్మ ఆదేశం, అన్నగారి దీవెనలు అంటూ అర్థం పర్థంలేని ప్రకటనలతో నవ తెలంగాణ స్థాపించి, అంతలోనే (తన హైటు, వెయిటూ గుర్తొచ్చేమో) చిరు పార్టీలో విలీనం చేసిన గౌడు బ్రదరూ.. ఎక్స్‌ట్రా, ఎక్స్‌ట్రాల్లాగే ఈయనా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిచ్చెనలా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు.

ఇక్కడ నాదో చిన్న ప్రశ్న…

వేల సంఖ్యలో యువకులను పార్టీలోకి ఆకర్షించిన ప్రజాగాయకుడు, తన స్వంత కుటుంబాన్ని తన గీతాలతో, రాగాలతో, చిందులతో మార్చలేకపోయాడు. అతని జీవితంలో ఇది కూడా ఓ వైఫల్యమే. ఓ ఫ్యాక్టరీలో పని చేసి అతని భార్య విమల పిల్లలను చదివించుకున్నారట. భార్య అయితే సరే, మరి స్వంత కొడుకు సూరీడిని, కూతురు వెన్నెలను మార్చలేకపోయాడే. వారిని ఉద్యమంలో చేర్చ(లాగ)లేకపోయాడే.

చేర్చలేకపోయాడా లేక ఉద్దేశ్యపూర్వకంగానే తనకలవాటైన డ్రామాలాడుతున్నాడా. వ్యక్తిగత జీవితానికి ఏమాత్రం భద్రత లేని తాను కనీసం తన కుటుంబానికైనా భద్రత కల్పించాలనే స్వార్థంతో ముందుగానే వ్రాసుకున్న స్క్రీన్‌ప్లేతో నటిస్తున్నాడా.

మరి ఆయనకు దూరమైన భార్య అతని అవినీతి సంపాదననూ దూరం ఉంచిందా.. కేవలం తన కూలీ డబ్బులతో, సామాజిక వర్గం ఆధారంగా వచ్చిన రిజర్వేషన్లతోనే కూతురిని డాక్టర్‌ను చేసిందా, కొడుక్కి ఉన్నత చదువులు చెప్పించి అమెరికా పయనమయ్యేలా చేసిందా అనేవి ఎప్పటికీ శేషప్రశ్నలే..

“తప్పు చేయి, తప్పులు చేస్తూనే ఉండు, అయితే ఆ తప్పులను ఒప్పుకునేందుకు భయపడకు - అవి నేర్పే జీవితానుభవాలను మరిచిపోకు” అనేలా తాను మూడు చారిత్రాత్మక తప్పులను చేసినట్లు ఒప్పుకున్నాడు.

ముందుగా ఓ పద్యం (పాతదే):

కూరిమి గల దినములలో
నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచు చుండు నిక్కము సుమతీ!

1వ తప్పు - జంతర్‌మంతర్ సదస్సుకు అద్వానీని ఆహ్వానించడం
ఉత్తినే ఆహ్వానించారా? కేంద్రంలో అధికారానికి వస్తే, వచ్చిన వెంటనే జేబులో నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసిచ్చేస్తామని ఆయనగారు ప్రకటించబట్టే కదా. విజయానికి సారథులు చాలా మందే ఉంటారు, పొరపాటున అపజయం ఎదురైందో అందరూ తప్పుకుంటారు. భాజపా లేదా ఎన్‌డిఏ కూటమి అధికారంలోకి వచ్చేస్తుందేమోనని పొరపాటునో, గ్రహపాటునో వీళ్లంతా ఆ వైపుకు గెంతారు. మొత్తానికే ఎసరొచ్చిందనుకోండి. అది వేరే విషయం.

2వ తప్పు - విప్లవకారులను చంపిన దేవేందర్‌గౌడ్‌ను అమరవీరుల స్థూపం వద్దకు ఆహ్వానించడం
ఇదీ ఆ వరసే. అసలు ఆహ్వానించినప్పుడు, ఆహ్వానించిన తర్వాత ఇన్నాళ్ల వరకు కలగని ఆలోచన ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే ఎలా కలిగింది. సార్‌గారికి ఏ చెట్టు కింద జ్ఞానోదయమైంది. ఎన్నికల సమయంలో తన గొంతు నొక్కారంటూ, తానెక్కడికీ పారిపోలేదంటూ గగ్గోలు పెడుతున్న గద్దర్ సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందా. ఇన్ని సంవత్సరాలుగా చేయించుకోని వెన్ను శస్త్రచికిత్సకు ముహూర్తం ఇప్పుడే కుదురుతోందా.

3వ తప్పు - కెసిఆర్ నిర్వహించిన విద్యార్థుల సభకు హాజరు కావడం
హాజరయ్యానంటున్నారే గానీ, ఎందుకు హాజరయ్యారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండానే ఆయన వెంట తిరిగారా. ప్రలోభాలు అని ఎందుకు అంటున్నానంటే, ఈయన ఘనమైన గత చరిత్రే కారణం. గతంలో ఈ పెద్దమనిషి కాంగ్రెస్, తెదేపాలను భూస్థాపితం చేయమని, తరిమి కొట్టండని పిలుపునిచ్చాడు. మొన్నటికి మొన్న తెరాసతో చేతులు కలిపాడు. మళ్లీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి - తప్పు చేసాను క్షమించండి అంటున్నాడు.

అంబేద్కర్ ఆశయాల ప్రేరణతో, ప్రేరేపణతో లక్షల రూపాయల విరాళాలు సేకరించి వెంకటాపురంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో మహాబోధి హైస్కూల్‌ను ప్రారంభించారుగా, దాని సంగతేమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఈయన ఏం జవాబు చెబుతాడు.

చివరికి కొన్నాళ్ల తర్వాత తెలంగాణ ఉద్యమం ప్రారంభించి చాలా తప్పు చేశాను.. ఇది నా జీవితంలో చేసిన 4వ చారిత్రాత్మక తప్పు అని ముక్తాయించినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు కూడా.

సిద్ధాంతపరంగా గద్దర్ మావోయిస్టులకు సన్నిహితుడు. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందనే నమ్మకాన్ని మావోయిస్టులు ఇంకా వదలుకోలేదు. ఎన్నికల రాజకీయాలకు వారు విముఖులు. ఇలాంటి సిద్ధాంతాల ఊబిలో కూరుకుని నిషేధంతో బయటకు వచ్చిన గద్దర్ తన కాళ్లకు అంటిన బురదను ఇంకా శుభ్రం చేసుకోనే లేదు. ఆ పార్టీ సానుభూతిపరుడు అనే ముసుగు తీయనేలేదు. అంతలోనే వారి సిద్ధాంతాలకు పూర్తి భిన్నమైన, వ్యతిరేకమైన ఎన్నికల రాజకీయాలను ఎలా చేపడతారు. ఇది రెండు పడవలపై కాళ్లు ఉంచినట్లు కాదా?

గద్దర్ గురించి మరికొన్ని, మరికొందరి అమూల్యమైన అభిప్రాయాలు, కథనాలు:
http://gsnaveen.wordpress.com/2006/10/20/bakta_gaddaru/
http://telugu.stalin-mao.net/?p=75

గద్దర్ పాటలు:
http://www.ourtelangana.com/node/2023

Sunday, May 10, 2009

“శ్రీ” మథనం


అసలే విద్యుత్తు ఉండదు
ఉన్నా అందులోనూ కోతలు
రాత్రుళ్లు మోటారు పంపు దగ్గర కాపలాలు
కరెంటు - రైతు దాగుడుమూతలు
ఎప్పుడూ “అవుట్” అయ్యి “పోయేది” రైతే !!

తడిసీ తడవని పైరు
నకిలీ విత్తనాలు
రైతులపై తప్ప పంటల్లో
పురుగులపై పని చేయని మందులు !!

వానలు పడవు
జలయజ్ఞాలు ఫలించవు
కృత్రిమ వాన కరుణించదు
కప్పల పెళ్లిళ్లు కనికరించవు !!

పట్నవాసులేమి చేయగలరు
నేల విడిచి నింగికెగుస్తున్న
బియ్యం ధరను నిలువుగుడ్లతో చూడడం తప్ప !!

ఆకాశ గంగమ్మపై ఆశ ఎలాగూ పోయింది
ఇక అంతంత మాత్రంగా మిగిలింది
ఎండిన నదుల అట్టడుగున దాక్కున్న గంగమ్మే !!

ఇంతలో..
నదుల నీరు లేదు, నన్నడిగే వాడూ లేడు అంటూ
బయలుదేరారు "ఇసుకాసురులు" -
మేము లేమా స్వాహా చేసేందుకు అంటూ !!

నిర్భీతిగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా
ట్రాక్టర్ల లోడులతో కప్పెట్టేస్తున్నారు….
భారతదేశ వెన్నెముకను
మనకు అన్నం పెట్టే రైతన్నను !!