“నిజమేరా” మా మావయ్య సమాధానంలో ఏమాత్రం తేడా లేదు.
ఈయనేనా.. వరకట్నాలకు, భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఇతనేనా పైసా కట్నం అక్కర్లేదంటూ ఓ పేద యువతిని తన జీవితంలోకి ఆహ్వానించింది. ఇంత చేసిన ఈయనా ఈ రోజు ఇలాంటి పని చేసింది.
లోపలి నుండి మా అత్తమ్మ ఏడ్పులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.
నా దృష్టిలో ఎంతో ఉన్నతుడిగా ఉన్న మా మావయ్య ఒక్కసారిగా పురుగు కంటే హీనమైపోయాడు. మరొక్క క్షణం కూడా అక్కడ నిల్చోలేక, ఆయన వెనుక నుండి పిలుస్తున్నా పరుగులాంటి నడకతో నా గదికి వచ్చేసాను.
వరసకు మావయ్యే కానీ, మాది సోదర బంధాన్ని తలదన్నే ఆత్మీయ బంధం. మా మధ్య దాపరికాలు ఏమీ ఉండవు. వయస్సులో నాకంటే పెద్దవాడైనప్పటికీ, దాదాపు అన్నీ విషయాల్లోనూ నేను ఆయన సలహా తీసుకుంటూ ఉంటాను. అలాగే ఆయన కూడా. ఇద్దరం సాహిత్య ప్రియులమే. ఆయనకేమో చలం ఇష్టం. నాకు శ్రీశ్రీ అంటే అభిమానం. మా ఇద్దరి చర్చల్లో కుటుంబ విషయాల కంటే పుస్తకాలు, సాహితీ విలువల గురించిన ప్రస్తావనలే ఎక్కువ ఉంటాయి.
సహజంగానే మావయ్య అభ్యుదయవాది. చిన్నతనంలోనే ఊరి పెద్దలను ఎదిరించి సహపంక్తి భోజనాలను ప్రోత్సహించాడు. ఆ (అ)కారణంగా ఊరి నుంచి వెలి వేయబడ్డాడు. అందరికీ, అన్నింటికీ దూరమైనప్పటికీ తన అభిప్రాయాలను ఏ మాత్రం మార్చుకోని మా మావయ్యంటే చిన్నప్పటి నుంచి ఓ రకమైన భక్తితో కూడిన ఇష్టం నాకు.
అలాంటి మావయ్య ఈ రోజు మా అత్తమ్మకు అబార్షన్ చేయించాడంటే నేనే కాదు - మా మావయ్యతో పరిచయమున్న ఏ ఒక్కరూ నమ్మలేరు. కానీ, దురదృష్టవశాత్తూ అది నిజమే.
రకరకాల ఆలోచనలతోనే రెండ్రోజులు గడిచిపోయాయి. అసలు ఇలాంటి పనికి ఎందుకు పూనుకున్నాడో ఆయన్నే నేరుగా అ(క)డిగేద్దామని బయల్దేరేంతలో ఆయనే నా గదికి వచ్చాడు. అయితే ఎప్పటిలా చిరునవ్వుతో కాదు.
“అత్తమ్మ ఎలా ఉంది..” నా గొంతులో ఏదో లోపించినట్టు ఉంది.
“ఏరా.. నా గురించి అడగవా..” ఆయన గొంతులో నిష్టూరం ఇసుమంతైనా లేదు.
“నీకేంలే మావయ్యా. చెప్పేవి శ్రీరంగనీతులు అనే సామెతలాగా ….!” నా గొంతులో ఏదో అడ్డు పడింది. అక్కడితో ఆపేశాను.
“ఏరా.. ఆపేసావేం. పూర్తి చెయ్యరా. నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు కదూ” ఆయన మాటలో ఇప్పటికీ అదే మార్దవం, నన్ను కదిలించేది అదే, కట్టిపడేసేది అదే.
ఏంటిది.. అప్పుడే చీకటి పడుతోందా. గదిలో అంతా మసక మసకగా ఉందేం..
ఓ.. కంట్లో పల్చటి నీటి పొర.
చటుక్కున గోడవైపు తిరిగాను.
“ఏరా.. నా మొహం చూడటం కూడా ఇష్టం లేదా..”
“ఎందుకిలా చేసావ్ మావయ్యా.. ఎందుకింతలా దిగజారిపోయావ్. ఆదర్శాలు, నీతులు ఊరి జనాలకేనా. అసలు అత్తయ్య మొహం ఎలా చూడగలుగుతున్నావ్ నువ్వు. ఎంతో కాలంగా పిల్లల కోసం ఎదురుచూసిందే.. నోచని నోము, ఎక్కని గుడి లేదే. తీరా ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంటే ఎందుకా బిడ్డను కడుపులోనే చంపేసావ్.. కేవలం ఆడపిల్లనేగా.. కట్నాలు, కానుకలు ఇచ్చుకోలేవనేగా.. ఏం.. మేమంతా చచ్చామనుకున్నావా?” ఆవేశం, ఏడుపు కలగలిపిన నా మాటలు నా గది గోడలకే విచిత్రంగా వినిపించాయేమో.
“అయిపోయిందా” ఏంటసలు నాకర్థం కాకుండా ఉంది ఆయన తీరు. అదే స్థిరత్వం, ఎక్కడా తొట్రుపాటు లేకుండా..
“రేయ్ మాధవా.. ఈ నిర్ణయం తీసుకోబోయే ముందు నేనెంత మథనపడ్డానో, నాలో నేను ఎంత నలిగిపోయానో నీకు తెలియదురా.. ”
“ఏమైతేనేంలే మావయ్యా. జరగవలసింది జరిగిపోయిందిగా”
“నీకు సమకాలీన సమస్యల పట్ల అవగాహనే లేదురా”
“ఏంటి.. యాసిడ్ దాడులా.. ఇంకేం మాట్లాడకు మావయ్యా.. ఇంత పిరికివాడివి అనుకోలేదు” మొదటిసారిగా ధిక్కార స్వరం.. తాడో పేడో తేల్చేసుకుందామనే కసి..
“మా నాన్న నా చిన్నతనంలో ఎప్పుడూ ఓ మాట అనేవాడ్రా..
మా అక్కకి, అదే మీ అమ్మకు పెళ్లి కాక ముందు నుంచి అదే వరస. ఆడ బిడ్డకు ఆ మూడు ముళ్ళు వేయించేసానంటే, నా బాధ్యత తీరిపోతుంది. ఇక మగపిల్లలా.. గోచి పెట్టుకు తిరిగినా అడిగే నాథుడు లేడు అనేవాడు. మంచి రోజులు, చెడు రోజులు లేవు. సమయం, సందర్భం లేవు. ఎప్పుడు పడితే అప్పుడు. ఆయన ఆర్థిక పరిస్థితే అందుకు కారణమేమో. పదే పదే మీ అమ్మ పెళ్ళి గురించి ఆలోచించేవాడు. ఎట్టకేలకు ఓ శుభ ముహూర్తంలో ఆ కాస్తా ఘనకార్యం జరిపించేసాడు. ఇక చూడాలి ఆయన ఆనందం. .పట్టపగ్గాల్లేవనుకో.”
ఇవన్నీ నాకు తెలిసిన విషయాలే.. ఎన్నోసార్లు ఈయన చెప్పగా విన్నవే. ఇప్పటి చర్చకు దానికి సంబంధం ఏంటో అర్థం కాకున్నా ఆయన వాక్ప్రవాహానికి అడ్డు రాదల్చుకోలేదు. మళ్ళీ ఆయనే కొనసాగించాడు..
“బాధ్యతలురా మాధవా.. ఆడబిడ్డ అంటేనే బాధ్యతలు, కష్టాలు, కన్నీళ్లు.. బిడ్డ పుట్టిన మరుక్షణం కలిగే ఆనందం దాన్ని ఓ అయ్య చేతిలో పెట్టేవరకేరా. దాన్ని తీరా అత్తారింటికి పంపాక చూడాలి పాట్లు. రేయ్.. అత్తగారింటికి వెళ్లిన కూతురు ఇంటి నుండి ఫోన్ వస్తే చాలు, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని హడలి చచ్చే తల్లిదండ్రులు నాకు తెలుసురా. ఉన్న ఆస్తులు హారతిగా చేసి, వాళ్ల గొంతెమ్మ కోర్కెలు తీర్చినా ఏదో ఒక నెపంతో బిడ్డను కష్టపెడితే ఏం చేయాల్రా. కాలు కింద పెడితే కందిపోతాయేమోనని భయపడే కన్నతండ్రి తన కూతుర్ని దారుణంగా హింసించే వియ్యంకులను, అల్లుళ్లను ఏం చేయలేక గేటు బయట నుండి నిస్సహాయంగా కన్నీరు కార్చే సంఘటనలు కోకొల్లలురా”
“ఏం.. అందరూ ఒకేలా ఉంటారా ఏం. నువ్వు, మా నాన్న పెళ్ళాలను తన్ని తగలేసిన వారి జాబితాల్లో లేరుగా.. చేసిన తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నంలో పొంతనలేని మాటలు మాట్లాడుతున్నావ్ మావయ్యా..”
“కాస్తా నన్ను మాట్లాడనిస్తావా
తీవ్రవాదుల పుణ్యమా అని రోడ్డెక్కిన వాడు ఇంటికి వస్తాడో లేడో చెప్పలేని పరిస్థితి. గతంలో కేవలం ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలకే పరిమితమైన ర్యాగింగ్ భూతం కారణంగా కాలేజీకి వెళ్లిన బిడ్డ ఇంటికి వస్తాడో రాడో తెలియని దుస్థితి. రోడ్ల మీద ఈవ్ టీజింగ్ల పుణ్యమాని ముక్కుపచ్చలారని విద్యార్థినులు అమానుష దాడులకు బలి అవుతున్నారు. ఈ రోజుల్లో ఉద్యోగాలకే కాదురా, ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో నాకేమైనా జరిగితే, ఇప్పటికే అవిటిదైన మీ అత్తయ్య ఆడబిడ్డతో ఎలా వేగుతుందిరా.. దానికి తగిన భద్రతను ఎలా ఇస్తుంది.”
“ఎప్పుడో చస్తామనే భయంతో, ఇప్పుడే చచ్చిపోవాలనుకోవడం అవివేకం మావయ్యా. సహజంగా మరణించడం వేరే, బలవన్మరణం వేరే. రెండు పరస్పర భిన్నాభిప్రాయాలను నువ్వు ఒకే గాటిన కట్టేస్తున్నావ్. నువ్వు చనిపోయే పరిస్థితే వస్తే, అత్తయ్యను ఆదుకోవడానికి అయినవారం మేమంతా లేమా” ఆయన చెప్పేది కొంతవరకు నిజమనే అనిపిస్తూ ఉన్నా అంగీకరించలేని నైజం.
“ఎవర్ని ఎవర్రా కాపాడేది. నువ్వు బంధాల గురించి మాట్లాడుతున్నావ్.. నేను వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాను.. అలా అని నేను చేసిందే కరెక్ట్ అని నేను వాదించను. కానీ, ఆడబిడ్డను కని, స్కూల్ రోజుల నుండి కాలేజీ రోజుల వరకు, ఆపై పెళ్లయ్యి అత్తవారింటికి వెళ్లాక, కడుపులు, కాన్పులు అంటూ వేగేందుకు నా తాహతు సరిపోదురా”
“నువ్వు చెప్పే ఏ కారణాలతోనూ నేను ఏకీభవించలేకున్నాను మావయ్యా..” అన్యమనస్కంగానే సంభాషణకు ముగింపు చెప్పాలనుకున్నాను..
“సరే.. కొన్నాళ్లాగు.. నిజం నిలకడ మీద తెలుస్తుంది” నా గది నుండి మొదటిసారి తలవంచుకు వెళ్లిపోయాడు మావయ్య..
పగలంతా ఆహారం కోసం తిరిగి అలసిపోయిన పక్షులు గూళ్లకు చేరుకుంటున్నాయి..
0 comments:
Post a Comment