పండగంతా మా ఇంట్లోనే ఉందా అన్నట్లుగా ఉందా వాతావరణం..
సందడే సందడి..
ఏ రోజైనా ఫ్యాంటు, షర్టు అదీ కాకుంటే ఏ ఫ్రాక్‌లోనో ఆధునికంగా కన్పించే మా బుడిగమ్మ కూడా ఫక్తు సంప్రదాయ దుస్తుల్లో కన్పించేస్తూ ఉంది కళ్లెదుట..
డివిడి ప్లేయర్‌లో మా అన్నగారి అభిరుచికి తగ్గట్లు ఘంటసాలగారి భక్తి పాటలు..
అంతా బాగానే ఉందే అనుకునేలోపు మా అక్కగారి కేకలు..
ఏమైందో ఏంటో అని లోనికి పరిగెట్టేలోపు..
ఆ కేకలకు మూలకారణమైన మేనల్లుడు బబ్లూగారు, వాడి వెనకాలే అక్కగారు నా దగ్గరికే పరిగెత్తుకుంటూ వచ్చేసారు..
బబ్లూగాడు కన్పించేంతటి మంచోడేం కాదు..
నా పోలికే అంటుంటుంది మా అమ్మ..
ఒకటే గొడవ..
నాకు ప్రీపెయిడ్ వద్దంటే వద్దు.. పోస్ట్ పెయిడ్ కావాలంటూ ఏడ్చేస్తున్నాడు వీడు.
కాదు కూడదు.. వాతావరణం బాగోలేదు.. ఇక నుంచి నీకు ప్రీపెయిడే దిక్కు అంటుంది మా అక్క..
నాకేం అర్థం కాలా..
పట్టుమని పదేళ్లయినా లేని వీడు - పోస్ట్ పెయిడ్ కావాలంటాడు.
ఈవిడేమో ప్రీపెయిడ్ అయితే ఓకే అంటోంది..
మా బావగారేమో నిమ్మకు నీరెత్తినట్లు పేపర్‌లో దూర్చిన తల బయట తీయడం లేదు…
మా అమ్మ తన మనవడు చేస్తున్న అల్లరిని తన్మయత్వంతో చూస్తోంది.
అసలేం జరుగుతోంది ఇక్కడ
నాకంతా తెలియాలి అంటూ గర్జించాను..
వీడికేమో పోస్ట్ పెయిడా..
వాళ్లమ్మ ప్రీపెయిడ్ తీసుకోమంటుందా..
అసలెన్ని మొబైళ్లు వాడుతున్నారు ఇంట్లో..
లెక్కా పక్కా లేకుండా పోతోంది..
ఎంత ఖర్చు, ఎంత వృథా..
అంటూ చిన్నపాటి లెక్చరిచ్చేసాను (అది మనకు వెన్నతో పెట్టిన విద్య)
అంతా సైలెన్స్..
పర్లేదు.. మనక్కూడా ఇంట్లో భయపడుతున్నారు అని లోలోన సంతోషించేలోపు..
పూజ గదిలోనుంచి బయటకు వచ్చిన అన్న, అమ్మ, అక్క, బావ, చివరికి మా బుడిగి, బబ్లూ అందరూ పడీ పడీ నవ్వులు..
నా అవస్థ చూసి జాలిపడిన మా అన్న ఆ పొడుపు కథ కాస్తా విడమర్చి చెప్పాడు..
గీతలో కృష్ణుడిలా..
నాయనా మాధవా..
పోస్ట్ పెయిడ్ అనగా చన్నీటి స్నానం.. ప్రీపెయిడ్ అనగా వేడినీటి స్నానం.. - అని…
ఇదేం పోలిక అని నేనడిగేలోపు మా బబ్లూగాడు అందుకున్నాడు..
వేడినీళ్లు అయితే లిమిటెడ్ మామయ్యా.. బకెట్‌లో ఎన్ని ఉంటే అన్నే పోసుకోవాలి.. అదే చన్నీళ్లనుకో.. మనిష్టం.. ఎన్నయినా పోసుకోవచ్చు.. అందుకే చన్నీటిని పోస్ట్ పెయిడ్ అని, వేణ్ణీళ్లను ప్రీపెయిడ్ అని అంటుంటా అనేసి తుర్రుమని బాత్రూమ్‌లో దూరి తలుపేసుకున్నాడు..
నా మొహంలో ఇంకా ప్రశ్నార్థకమే…
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment