Sunday, April 5, 2009

పోలీసా.. నక్సలైటా..?!

అసలు సమస్యే అది..

తెలిసీ తెలియని వయసులో మొదలైన మా స్నేహానికి ఇటీవలే పాతిక సంవత్సరాలు నిండాయి. ఎప్పుడు ఎవరి వైపు నుంచి మొదలైందో తెలియదు గానీ, ఏదైనా విషయానికి మాలో ఒకడు అవునంటే, ఖచ్చితంగా కాదనడం మరొకడికి అలవాటైపోయింది. ఎన్నో చర్చలు జరిగేవి.

ఉదాహరణకు - లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి గుళ్లు, గోపురాలు ఎందుకు దండగ.. ఆ డబ్బుతో కొన్ని వేల కుటుంబాలు బాగుపడతాయి కదా అని నేనంటే ; ఈనాటికీ అంతో ఇంతో పాపభీతి ఉంది, అక్కడో ఎక్కడో కొందరైనా పాపాలకు ఒడిగట్టకుండా ఉన్నారంటే దానికి కారణం పాపభీతి అని, దానికి కారణం వీధివీధినా కనిపించే గుళ్లే అంటాడు వాడు. పొరపాటున క్యారెక్టర్లు మారినా, డైలాగులు మాత్రం మారవు. సారాంశం ఏమిటంటే - ఎడ్డెమంటే, తెడ్డెమనడమే. హద్దులు దాటి, ఆవేశాలకు లోనైంది కొన్నిసార్లే అయినా, తత్ఫలితంగా కొన్ని వారాలో, నెలలో మా మధ్య నిశ్శబ్దం రాజ్యమేలేది. మళ్లీ ఏ శుభ ముహూర్తంలోనో సయోధ్య కుదిరి, పాత విషయాలను తల్చుకుని నవ్వుకునేవాళ్లం.

ఈ సంవాదాల సంబరాల వలన కొండొకచో పరస్పరం మంచి విషయాలను తెలుసుకున్నాం కూడా.

ఇటీవలే మా మధ్య ఓ మంచి (?!?) అంశం చర్చకు వచ్చింది. అదేంటో కాదు - పోలీసులు, నక్సలైట్లు. (వాడు గానీ ఈ బ్లాగు చదివాడంటే, ముందు పోలీసుల పేర్లు ఎందుకు ఉంచావు, ఏం నక్సలైట్ల పేర్లు ఉంచవచ్చుగా అంటూ మరో కొత్త యుద్ధానికి బాకా ఊదేస్తాడు)

“పోలీసులకు తగిన శాస్తే జరిగింది బావా” అంటూ ఓ చల్లని సాయంకాలం నా రూమ్‌కు విచ్చేశాడు. “ఆహా, ఏంటో” అన్నా నేను ఎక్కసెక్కంగా. “టీవీలో ఇరవై నాలుగ్గంటలూ ఎఫ్ టీవి చూస్తుంటే సరిపోదురా.. అప్పుడప్పుడూ న్యూస్ ఛానెళ్లు కూడా చూస్తుండాలి” అంటూ చురక. “తమరికి తెలిసిందేమిటో సెలవియ్యండి సార్” ఓ అవకాశమిచ్చేసా వాడికి.

డైరెక్ట్‌గా రంగంలోకి దిగిపోయాడిక..

“వెన్నుపోటు పొడిచేందుకు కోవర్టులు, మెరుపుదాడి చేసేందుకు గ్రేహౌండ్స్ దళాలు, అత్యాధునిక ఆయుధాలతో అరణ్యాల్లో ఆదమరిచిన వారిపై దాడులు చేస్తూ బూటకపు ఎన్‌కౌంటర్లతో మీసాలు మెలితిప్పుకునే పోలీసులపై అనూహ్య దాడి చేసిన నక్సలైట్లు”.. నాటకీయంగా ప్రారంభించి, “నా అంచనా ఏమిటంటే - కనీసం ఓ 50, 60 మంది లేచిపోయుంటారబ్బాయ్” అంటూ ముగించాడు.

“ఏంట్రా, పోలీసులు మాత్రం మనుష్యులు కాదా, వాళ్లకు పెళ్లాం, పిల్లలు, కుటుంబాలు, వారిపై ఆధారపడినవారు ఉండరా ఏంటి? అంత ఆనందం ఏంట్రా శాడిస్ట్ వెధవా” మానవత్వం అనే అస్త్రంతో మొదటి దెబ్బ కొట్టాను. (అనుకున్నా)

“మరే.. నక్సలైట్లు మనుష్యులు కాదూ? వాళ్లను కాలిస్తే రక్తం రాకుండా సాంబార్, చట్నీ కారుతాయా” కామెడీ టచ్‌తో పాటు “వాళ్లపై ఆధారపడిన వాళ్లూ ఉంటారు, వాడికీ పెళ్లాం బిడ్డలు ఉంటారు.” అంటూ తిప్పికొట్టాడు.

“అవున్రా.. ఆళ్లకీ కుటుంబాలు ఉంటాయి. వాళ్లను కన్నపేగులు ఉంటాయి. కానీ - వాళ్ల గురించి ఆ నక్సలైట్ బిడ్డ అడవుల బాట పట్టకముందే ఆలోచించాలి. తుపాకీ’గొట్టం’తో దేశాన్ని బాగుపర్చలేరు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పాల్గొనండి అంటూ తాత ముత్తాతల సీజన్ నుంచి మన నాయకులు ఏడుస్తూనే ఉన్నారుగా.. అంత చేవ ఉంటే, తమది అంత నిఖార్సయిన పంథా అనుకుంటే, పోరాట బాటను వీడి మన నేపాల్ మావోయిస్టుల్లా తెర ముందుకు రమ్మను.. అధికార పీఠాన్ని అధిరోహించి స్వయంగా ప్రజల కష్టాలను కడతేర్చమనవోయ్” శ్లేషతో కూడిన సవాల్ విసిరా.

“స్వంత కుటుంబం, స్వంత బ్రతుకు అంటూ స్వార్థానికి పోకుండా ఏ వెయ్యికో, లక్షమందికో ఒక్కడంటే ఒక్కడు సమాజంలోని చీడను రూపుమాపేందుకు తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఉద్యమ బాట పట్టే క్రమంలో కన్నవాళ్లను, తోడబుట్టినవాళ్లను విస్మరిస్తే అది మహాపాపం కాబోలు.. ఆ బిడ్డ కోసం కన్నవారు బాధపడటంలో అర్థం లేదంటావ్?” సూటిగా ప్రశ్నించాడు.

“నిజమేరా.. ‘దారి తప్పిపోయిన’ బిడ్డ కోసం కన్నవాళ్లు బాధపడతారు. కానీ - అనుక్షణం భయం నీడలో బ్రతుకుతూ, బ్రతికాడో, చచ్చాడో తెలియని బిడ్డ కోసం తల్లి ఆలోచించే విధానానికి.. అదే సమయంలో, పోలీసు విధులను నిర్వర్తిస్తూ, సమాజంలో ఉన్నత స్థానంలో ఉంటూ ఉదయాన డ్యూటీకి వెళ్లిన బిడ్డ సాయంకాలానికి శవమై ఇంటికి వస్తే తల్లి గుండె మరోలా స్పందిస్తుందిఅంతే సూటిగా చెప్పాను.

నువ్వెన్ని చెప్పు.. నక్సలైట్లు తినే అన్నంలో విషం కలిపి చంపిన పోలీసులు, అరణ్యాల్లో ప్రవహించే వాగుల్లోని నీళ్లలో కేవలం నక్సలైట్ల కోసం విషం కలిపిన పోలీసులు, ఆత్మ రక్షణార్థం నక్లలైట్లపై పోలీసుల కాల్పుల పేరుతో బూటకపు ఎన్కౌంటర్లు.. అంటూ రోజూ పత్రికల్లో, టీవీల్లో వార్తలను చూడటం లేదా తమరు?” ఆవేశంతోనో, ఆవేదనతోనో వాడి మొహం ఎర్రబారింది.

కాసేపు నిశ్శబ్దం..
మళ్లీ వాడే కొనసాగించాడు..

ప్రాణం పోయలేని మనిషికి ప్రాణం తీసే హక్కు లేదంటూ మహా మహా న్యాయస్థానాలే ఉరిశిక్షలను రద్దు చేస్తున్నాయి. ఎంత పాపాత్ములకైనా, ఘోరమైన నేరాలకు పాల్పడినవారికైనా బ్రతికేందుకు, వారి ప్రవర్తనలో పరివర్తనను తెచ్చుకునేందుకు అవకాశాన్ని ఇస్తున్నాయి. మరి మధ్యలో పోలీసులకేం పోయే కాలంరా.” ఊపిరి పీల్చుకునేందుకో, ఆలోచించుకో రా అన్నట్లో కాసేపు మళ్లీ నిశ్శబ్దం.

ప్రాణాలు తీయడం తప్పే. మరి దాడులతో పోలీసుల ప్రాణాలు తీసే నక్సలైట్లు గొప్పవాళ్లాకాలుకు కాలు, కన్నుకు కన్ను అనే అరణ్య నీతినే నమ్ముకుంటే ఇక మనిషికి, జంతువుకు తేడా ఏముందంటావ్అన్నాను.

వాళ్లకు వీళ్లకు ఏం తేడా లేదు? గదిలో కట్టేసి కొడితే పిల్లి అయినా తిరగబడుతుందని నీకు తెలియదా. ప్రాణాలు తీసేందుకు సిద్ధపడిన వాడి ముందు కూర్చుని న్యాయసూత్రాలు వల్లిస్తే ఫలితముంటుందా? తమను తాము రక్షించుకునే క్రమంలో, తమపై దాడి చేసేందుకు వచ్చే వారిని అంతమొందించడంలో రాజనీతి ఉంది. యుద్ధంలోనైనా మనం గెలవడం ఒకటైతే, అవతలివాడిని ఓడించడం మరొక పద్ధతి. నువ్వూ చదరంగం పులివేగా. నీకా మాత్రం తెలీదాఅన్నాడు.

అయితే, నీ దృష్టిలో పోలీసులను లేపేస్తున్న నక్సలైట్లు హీరోలన్నమాటనా గొంతులో మార్పు నాకే విచిత్రంగా ధ్వనించింది.
మరి నీకు - నక్సలైట్లను అన్యాయంగా చంపేస్తున్న పోలీసులే హీరోలన్నమాటవాడి గొంతూ గంభీరంగానే విన్పించింది.

నువ్వన్నట్లు తాము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం తమ యవ్వనాన్ని, భవిష్యత్తును, కుటుంబాన్ని వీడి పోరుబాట పట్టినోళ్లు కొందరు. తమను తాము మావోయిస్టులనో, నక్సలైట్లనో పరిచయం చేసుకుంటారు. మరొక వైపు - సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల్లో కొన్నింటినైనా అరికట్టే సదుద్దేశ్యంతో కొందరు ఖాకీ దుస్తులు ధరించి పోలీసులు అవుతారు. పదుగురాడు మాట పాడియై ధఱ చెల్లు అనే సామెత నీకు తెలీదా. రాష్ట్రంలో, కాదు దేశంలోనైనా ప్రపంచంలోనైనా మీ మావోఇష్టులు ఎందరున్నారు. పోలీసులు ఎందరున్నారు. నువ్వు చెప్పే పోరుబాటే ఉన్నతమైనదైతే, అందరూ దాని పట్ల ఆకర్షితులై ఉండాలిగా.” కాస్తా గ్యాప్ ఇచ్చాను..

మంచి చేసే వేప చేదును ఎవరూ ముట్టుకోరు.. వ్యాధులను తెచ్చిపెట్టే పంచదారకే ఆకర్షితులవుతారు.” సింపుల్గా తేల్చేశాడు.

ఇక్కడ సిద్ధాంతం పనిచేయదోయ్. నా కొడుకు నక్సలైట్ కావాలి, సమాజాన్ని బాగు చేయాలి అని తల్లి అనుకోదు. కానీ, నా కొడుకు పోలీసాఫీసర్ కావాలి అని అనుకునే తల్లి ఉంటుంది. తల్లి మనసు గురించి, తల్లి ప్రేమ గురించి ఏకైక కుమార రత్నానివి నీకు తెలియదాసెంటిమెంట్ కోటింగ్ ఇచ్చా.

కానీ అలా కోరుకునే ప్రేమలో స్వార్థం ఉంటుంది. పోలీసైతే సంఘంలో గుర్తింపు, హోదా వస్తాయి. నక్సలైట్ అయితే అనుక్షణం భయపడుతూ బ్రతకాలి. ఇక్కడ తల్లయినా, తండ్రైనా తమ స్వప్రయోజనాల కోసమే కొన్ని సాంఘిక ప్రయోజనాలను తనఖా పెడుతుంటారు.” నిక్కచ్చిగా అనేసాడు..

మా పోట్లాటలో పడి పట్టించుకోలేదు. ఎప్పుడొచ్చాడో కానీ, మూల కిటికీలో కూర్చుని ఎంతో శ్రద్ధగా మా వాదనంతా వింటున్నాడు సంజయ్.

వాడి వైపు చూసిన చూపులోనే సహాయం చేయరా బాబూ అంటూ అభ్యర్థన పారేశా.. మా వాడు అందుకున్నాడు..

అసలు నక్సలైట్లు ఏయే విషయాల్లో గొప్పవాళ్లంటావ్కుమార్పై మొదటి బాణం విసిరాడు.
నాకు కాస్తా పట్టు దొరికింది.
నైతిక విలువలు పాటించడం నుంచి అన్ని విషయాల్లోనూదృఢంగా చెప్పాడు.
పోలీసులు నైతిక విలువలకు తిలోదకాలిచ్చేశారని అంటావ్మా సంజయ్ గొంతులో ఈసారి వ్యంగ్యం ధ్వనించింది.
మరి.. కానిస్టేబుల్ నుంచి .జి. దాకా ఎన్ని అక్రమాలకు పాల్పడటం లేదు? వీళ్ల అండతో వీళ్ల పెళ్లాలూ, పిల్లలూ అదే హోదాను, దర్పాన్ని ప్రదర్శిస్తుంటారుకుమార్ గొంతులో విసురు.
మచ్చుకు నాకొకటి చెప్పొచ్చుగావీడే మాత్రం తగ్గలేదు.
ఎస్.. పెళ్లానికి కానిస్టేబుల్ పెళ్లాం అంటే లోకువ. సి.. పెళ్లానికి ఎస్.. పెళ్లాం లోకువ.”
మధ్యలోనే కట్ చేసాడు సంజయ్ - “మధ్యలో పెళ్లాల గొడవేంటి బాస్…”
అక్కడికే వస్తున్నా.. వీళ్లిచ్చే చనువుతోనే వాళ్ల పెళ్లాలూ అధికారాన్ని ప్రదర్శిస్తుంటారు. ప్రభుత్వ సొమ్ముతో నడిపే జీపుల్లో దర్జా ఒలకబోస్తూ సినిమాలకు పోతుంటారు. గుళ్లలో ప్రత్యేక దర్శనాలు, షాపింగ్ మాల్లలో ఊహించని డిస్కౌంట్లుఆవిడ మొగుడిగారికి భయపడి అందరూ ఆమెకు సలాములు చేస్తుంటారు. ఇక అడ్డేముంటుంది.”

మా టాపిక్ పూర్తిగా పక్కదారి పట్టిందనే నేననుకున్నా..

వీడి పెళ్లాన్ని వాడు చేస్కుంటాడు. దాని మొగుడిని ఇది లేపుకుపోతుంది.. అసలు వీళ్లకేం విలువలున్నాయి.” అలాగే ముందుకెళ్లిపోతున్నాడు వాడు..

ఆగాగు బ్రదర్.. అసలీ విషయాలన్నీ నీకెలా తెలుసు”..

ఏం.. మీరు పేపర్లు చూడరా. సందుకో నిర్వాకం జరుగుతోంది. బీటు కానిస్టేబుల్ నుంచీ డి.ఎస్పీ, డి..జిల వరకు ఇదే తంతు.”

పేపరోళ్లకు వీళ్ల సంగతి ఎలా తెలుస్తుంది”..

వీళ్ల బయోడేటాలు, ప్రొఫైళ్లు సంపాదించడం అంత కష్టమేం కాదు.. ఎవరినడిగినా వీళ్ల దుర్మార్గాలను పూసగుచ్చినట్టు చెబుతారు.”

అదే మరి.. కాస్తా ఆగు.. వీళ్లందరూ సంఘంలో - పెద్ద పెద్ద పదాలు ఎందుకు గానీ.. నీ పక్క ఇళ్లల్లో, మీ పక్క కాలనీల్లో బ్రతికేస్తుంటారు. వీడు పోలీసు, ఈమె పోలీసుగారి మిసెస్.. వీడు తప్పు చేసింది, ఆమె అలా కులికింది అంటూ ఎప్పటికప్పుడు అందరికీ తెలుస్తుంటాయి. మరి అడవుల బాట పట్టినవారు చేసే పనులు నీకు నాకూ ఎలా తెలుస్తాయి చెప్పు. కొన్ని సంవత్సరాలకు, మధ్య గానీ గణపతి అనే పెద్దాయన ముఖం ఎలా ఉంటుందో పోలీసులకు, ప్రజలకు తెలియదు.. దొరికిన ఫోటో కూడా కాలానిదో ఏంటో.. ఇక వాళ్ల కుటుంబాలు, పెళ్లాలు సంగతి నీకు ఎలా తెలుస్తుంది.

నక్సలైట్లలోనూ పెళ్లీడుకొచ్చిన పిల్లలతో సహా మొగుడిని వదిలేసి సరిక్రొత్త రాగాలందుకునే పాతకులున్నారు.

చూడు బ్రదర్.. మీడియా గురించి నీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయినా బటన్ కెమెరాలు పట్టుకుని ఎప్పుడు సంచలనం దొరుకుతుందా అని, దొరక్కపోతే మనమే సృష్టించేస్తే పోలా అనుకునే బాపతు వాళ్లు ఇప్పుడు బాగా పెరిగిపోయారు. వీళ్లు రిస్క్ తీసుకోరు. అడ్డంగా దొరికిపోయే బకరాగాడి న్యూసో ఇరవై నాలుగ్గంటలూ తిప్పించి, మళ్లించి ప్రసారం చేసేస్తుంటారు. అవునా, కాదా..” సంజయ్ వాగ్ధాటికి కుమార్ నుంచి స్పందనే లేదు.

కుమార్ గాడు మౌనం దాల్చాడు.

నక్సలైట్లకు, పోలీసులకు కొన్ని తేడాలున్నాయి బాస్.. అవి - మంచి లక్ష్యం కోసం అడ్డదారిలో పోయేవాళ్లు నక్సలైట్లు. ఏదో లక్ష్యంతో సర్వీసులోకొచ్చి ఏమి చేయలేక, రాజకీయాలకు బలయ్యేవాళ్లు పోలీసులురాజకీయ చదరంగంలో ఇద్దరూ బలిపశువులే.”

అయినా కుమార్, నాకు తెలీకడుగుతాను - మీ ఇద్దరిలో ఒక్కరూ పోలీసు కాదు, నక్సలైటూ కాదు.. కానీ నువ్వన్నట్లు పోలీసుల గురించి ఎలాగైనా తెలుస్తుంది. అడవుల్లో బ్రతికే మాబోటిగాళ్ల గురించి నీకెలా తెలుస్తుంది ?!”

ఆకాశంలో సూరీడు అలసిపోయాడు..
గదిలో మేమూ అలసిపోయాం..
సంజయ్ చెప్పినదాంతో పూర్తిగా కాకున్నా, కొంతవరకు శాంతించినట్లు మా కుమార్ ఆలోచనల్లో మునిగిపోయాడు..
మా ఇద్దరినీ మళ్లీ ఏకాంతంలోకి నెట్టేస్తూ, మా సంజయ్ అలియాస్ సూర్యం చీకట్లో మాయమైపోయాడు.

0 comments: