Thursday, March 20, 2008


అవును నిజమే..
మనకెక్కడిది సమయం..
పొద్దున్న లేచింది మొదలు
పక్కనోడ్ని కుళ్లబొడవడమే..


నెత్తిమీదున్నోడి కుళ్లు జోకులకు
రాని నవ్వును కొని తెచ్చుకోవడమే..
మనకెక్కడిది సమయం..
ఉదర పోషణార్థం చాకిరీలకే సరిపోవట్లేదే సమయం
ఊరోళ్ల కష్టాలు మనకెందుకులెద్దూ

ఉద్యోగం రాలేదని బాధ
వస్తే జీతం తక్కువైందని బాధ
మన కష్టాలకంటే
పక్కనోడి సుఖాల గూర్చే మనకు మరింత బాధ..

పొద్దున లేచింది మొదలు
సమస్యలతో సమరం మనకు
పేపర్ లేటైతే చిక్కు
కాఫీ లైట్‌గుంటే చిక్కు
బస్సు రద్దీగుంటే చిక్కు
ఈ చిక్కులతోనే పెద్ద చిక్కు

మొబైల్‌లో ఛా(ఛీ)టింగులు
ఇంటర్నెట్‌లో డే(ఫై)టింగులు
ఇంట్లో పక్కనున్న మనిషితో
మాట్లాడటమే గగనమైపోయిన త(రుణం)రంలో
మనకెక్కడిది సమయం..

మొబైల్ మోగితే సంబరం
పెళ్లాం పలకరిస్తే సమరం
మనిషికి మనిషికి సంబంధాలు తగ్గి
మనీ మమత ఎ(మ)క్కువైన ఈ రోజుల్లో..

“మనకెక్కడిది సమయం..
మనసులను కలబోసుకునేందుకు
మనసుతీరా నవ్వుకునేందుకు..”

1 comments:

పద్మ said...

నిజమే కదా. ఇంట్లో మనుషులతో మాట్లాడితే వచ్చే ఆనందం కన్నా ఎక్కడో సముద్రాల ఆవల ఉన్న ముక్కుమొహం తెలియని వాళ్ళతో చాట్ చెయ్యటం ఆనందాన్ని ఇవ్వటం ఈ తరం చేసుకున్న అతి పెద్ద దురదృష్టం. గ్లోబలైజేషన్‌తో ప్రపంచం చిన్నదైనందుకు సంతోషించాలో లేక మనుషుల మధ్య అంతరాలు పెరుగుతున్నందుకు బాధపడాలో అర్థం కాదు.