Saturday, July 5, 2008

ఓ అమ్మ కథ

కన్ను నీదని, వేలు నీదని పొడుచుకుంటే రాదా రక్తం
రక్తమెంతగా ధారపోసినా దొరుకుతుందా మళ్లీ హృదయం
మనసులేని బ్రతుకొక నరకం
మరువలేని మనసొక నరకం

పై పాటను ఎవరు పడితే వారు, సందర్భంతో సంబంధం లేకుండా ఆయా పరిస్థితులకు తగ్గట్లుగా తమకు అన్వయించేసుకోవచ్చు.

మనసుకవి కలం నుంచి జారిన ఆణిముత్యాల్లో ఇదీ ఒకటి.

నా వరకు నేను, మొదటి వరుస మాత్రం ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఏ అమ్మకైనా సరిపోతుందనుకుంటున్నాను. అన్నదమ్ములుగా పట్టుమని ఐదేళ్ల వయసైనా లేని స్థాయి నుంచే మొదలయ్యే ఓ విచిత్రమైన పరిస్థితి కొన్ని సందర్భాల్లో హద్దులు దాటిపోతుంది. ఆజన్మ శత్రువుల్లా తలపడేవరకు తరుముతుంది. చివరికి వేరు కుంపట్లు, ఏవైనా కార్యాల్లో ఒకరికొకరు ఎదురైనా ఎడముఖం పెడముఖంగా ఉంటూ నలుగురిలోనూ చులకనైపోతుంటారు.

నాకు తెలిసిన ఓ ఇద్దరు అన్నదమ్ములున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమే. ఆ ప్రేమ స్థాయి ఎంతటిదో, ఏపాటిదో వివరించలేను గానీ, ఒకరిపై ఒకరికి ద్వేషం మాత్రం లేదని ఖచ్చితంగా చెప్పగలను. కాకుంటే ఒకరికంటే ఒకరు ఏమాత్రం తీసిపోలేని రీతిలో కొంచెం మూర్ఖత్వంతో కూడుకున్న కోపం. అన్న వయస్సు అనుభవాల్లో పెద్ద కాబట్టి తన పంతమే నెరవేరాలంటూ పట్టుబడతాడు. మరి చిన్నవాళ్ల సంఘానికి అధ్యక్షుడినని ఫీలైపోయే చిన్నవాడు తక్కువ తిన్నాడా ఏంటి? చిన్నతనంలో వాళ్ల నాన్నగారు చెప్పిన ఓ మాటను గుర్తు చేస్తాడు. అది నాకూ ఎన్నోసార్లు చెప్పి ఉన్నాడు. “మంచి చెప్పేందుకు చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేదు. ఎవరైనా తమ అభిప్రాయాలను చెప్పవచ్చు”. ఇలా కొంచెం సెంటిమెంటు రంగులనద్దుతూ తన అన్నగారికి అసలు తెలివితేటలే లేవంటూ తేల్చి పారేస్తాడు. అన్నదమ్ముల మధ్య, ఆ మాటకొస్తే ఏ ఇద్దరి మధ్య ఉండాల్సింది భయభక్తులు కావని, స్నేహమేనంటూ పట్టుబడుతాడు.

ఇక ఆపై మాటకు మాట, దెబ్బకు దెబ్బ తోడై ఇల్లు కురుక్షేత్రాన్ని తలపిస్తుంది.

ఆ మహా సంగ్రామం మధ్యలో ఆ అమ్మ పడే కష్టముంది చూశారూ.. అబ్బో.. పగవాడికి కూడా అంత కష్టం వద్దు అనిపిస్తుంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. పిల్లల మీద కోపంతో ఉపవాస వ్రతం చేపట్టి తనను తాను శిక్షించుకుంటుంది. రెండు కళ్ల వంటి ఇద్దరు పిల్లలు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ, రెచ్చిపోయిన రేచుకుక్కల్లా కాట్లాడుకుంటుంటే తనలో తాను మౌనంగా రోదిస్తూ కూర్చుంటే సరిపోదుగా. ఈ నా కొడుకుల్లో మార్పు తీసుకురా దేవుడా అంటూ కనపడిన రాయికల్లా చేతులు జోడించడమంటే గాలిలో దీపం పెట్టి నువ్వే దిక్కు దేవుడా అన్నట్లే. ఒకరు లేని సందర్భాల్లో మరొకరిని దగ్గరకు తీసుకుంటుంది. వాడి కోసం అన్న ఎలా తాపత్రయపడేది నూరిపోస్తుంది. వాడు వచ్చే వరకు వీడు భోజనం చేయకుండా ఎదురుచూసిన రాత్రులను కళ్లకు కట్టినట్లు వర్ణిస్తుంది. ఐకమత్యం గురించి, ఇద్దరూ కలిసి ఉంటే కలిగే లాభాలను గురించి విడమరిచి చెబుతుంది. నువ్వు తెలివైనవాడివేనంటూ వాడి అహాన్ని తృప్తిపరుస్తూ, నేనెన్నో రోజులు బతకను సుమా అంటూ బెదిరిస్తూ, నీ సోదరుడిని కూడా నువ్వే కనిపెట్టుకోవాలి అంటూ బాధ్యతలను అప్పచెబుతుంది.

ఆ ఇద్దరూ కూడా ఆమె చివరి మాటలకు పడిపోతారు. బుద్ధిగా నడుచుకుంటామంటూ ప్రమాణాలు చేసేస్తారు. ఇకపై చూడు మా అన్నదమ్ముల ఐకమత్యం గురించి అంటూ డబ్బాలు వాయిస్తారు. ఆ రాత్రికి కొడుకుల కబుర్లతో కడుపు నిండిపోయిన ఆ తల్లి భోజనమే చేయదు. వారం, పదిరోజులు ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది.

ఆ అన్నగారికో, ఈ తమ్ముడుగారికో మళ్లీ పూనకం వచ్చేవరకు!

మా ఊరు పెద్దాయన!


మడిసన్నాక ప్రతి ఓడికీ ఎప్పుడో అప్పుడు శ్మశాన వైరేగం వచ్చే ఉంటది. ఆ మూన్నాలుగ్రోజులూ తెగ ఇదైపోతాడు. అమ్మ లేదు, ఆలి లేదు. ఏవీ వద్దంటాడు. నాకెవరూ లేరు తో మొదలై, నేనెవరు వరకు లింకులెట్టేసుకుంటూ ఆలోసనల్లో తనకలాడతాడు.తిప్పి తిప్పి సూస్తే, ఆ ముచ్చట సరిగా మూడ్రోజుల్లో మూల కూచుంటాది.

అప్పుడెతుక్కునేస్తారు, ఓరోరు మనకు బాకీలున్నారు, ఓరోరు మనకు ఏమౌతారు ఇలాంటియ్యన్నీ.. ఆ మద్దెనెప్పుడో భూమిని ముంచేసే మహా పెలయం వచ్చేస్తాందంటే మా ఊరోళ్లంతా అయినకాడికీ కయ్య, కాలవ అమ్మేసుకున బలే జల్సా చేసేసుకున్నారులే. అప్పుడేమో బూమిని కొనేవాడిని జూసి అందరా - ఏందొరే, పిచ్చేవైనానా నీకా - అంటా తెగ ఎక్కసెక్కాలాడేసుండా. మరి ఆళ్లే ఇప్పుడు లచ్చలు లచ్చలు కూడబెట్టేసి, దర్జాగా కార్లో తిరిగేస్తుండారు. ఆళ్లని జూసి ఈళ్లు వలవలా ఏడస్తండారు.

అందుకే గందా - ఈ మద్దొచ్చిన ఆ పొడవాటి ఈరో - అదేనబ్బా అవితాబో, అకితాబో సినిమాలో మాబాగ చెప్పినాల్లే

కంటి ముందుగాలె కనబడె లాబాన్ని జూసేసి సంకలు గుద్దేసుకుంటే సరిపోదంట, ఆ యెనకాల యెంబడే వచ్చే నష్టాన్నో, కష్టాన్నో కూడా చూడాలంట!

సరే ఐతే - మా ఊరు బస్సుకి యేలైంది గానె - నే పోతా ఉండానబ్బా..