Thursday, March 20, 2008


అవును నిజమే..
మనకెక్కడిది సమయం..
పొద్దున్న లేచింది మొదలు
పక్కనోడ్ని కుళ్లబొడవడమే..


నెత్తిమీదున్నోడి కుళ్లు జోకులకు
రాని నవ్వును కొని తెచ్చుకోవడమే..
మనకెక్కడిది సమయం..
ఉదర పోషణార్థం చాకిరీలకే సరిపోవట్లేదే సమయం
ఊరోళ్ల కష్టాలు మనకెందుకులెద్దూ

ఉద్యోగం రాలేదని బాధ
వస్తే జీతం తక్కువైందని బాధ
మన కష్టాలకంటే
పక్కనోడి సుఖాల గూర్చే మనకు మరింత బాధ..

పొద్దున లేచింది మొదలు
సమస్యలతో సమరం మనకు
పేపర్ లేటైతే చిక్కు
కాఫీ లైట్‌గుంటే చిక్కు
బస్సు రద్దీగుంటే చిక్కు
ఈ చిక్కులతోనే పెద్ద చిక్కు

మొబైల్‌లో ఛా(ఛీ)టింగులు
ఇంటర్నెట్‌లో డే(ఫై)టింగులు
ఇంట్లో పక్కనున్న మనిషితో
మాట్లాడటమే గగనమైపోయిన త(రుణం)రంలో
మనకెక్కడిది సమయం..

మొబైల్ మోగితే సంబరం
పెళ్లాం పలకరిస్తే సమరం
మనిషికి మనిషికి సంబంధాలు తగ్గి
మనీ మమత ఎ(మ)క్కువైన ఈ రోజుల్లో..

“మనకెక్కడిది సమయం..
మనసులను కలబోసుకునేందుకు
మనసుతీరా నవ్వుకునేందుకు..”

మన ప్రాప్తమింతే.. ప్చ్..!

సురాసురులిరువురునూ అమృతాన్ని పొందేందుకు సమానంగానే శ్రమించారు..

ఏళ్లకు ఏళ్లు వాసుకిని “పిండి” పిప్పి చేసేసారు..

అసురులైతే - ఆ అమృతం మీద మోజుతోనే మధ్య మధ్యలో చంద్రుడు, లక్ష్మీదేవి, కల్పవృక్షం, ఐరావతం వంటి ఎన్ని తాయిలాలు వచ్చినా విశ్రమించకుండా కష్టించారు..

సురులు మాత్రం ఆ మాయల మరాఠిపై నమ్మకంతో నింపాదిగానే కష్టంలోనైనా సుఖించారు..

ఎందుకంటే వీళ్లు పట్టుకుంది ఆ పాముగాడి తోక భాగమాయె.. వాళ్లకేమో (దానవులకు) తల భాగం పట్టుకున్నామన్న తుత్తి తప్ప పాముగాడి సెగలు, పొగలతో మంటెక్కిపోతోంది..

సరే -

ఆ సంగతి పక్కన పెడితే,

ఎట్టకేలకు అమృతం రావడం, మోహినిగా మనోడు ఎంటరవడం, దాన్ని స్వజనులకు పంపకాలు చేసేయడం జరిగిపోయింది..

దానవులు ఓ మూల ఏడుస్తూ కూర్చున్నారట..

ఇక ఏదో విధంగా వారిని సముదాయించాలని ఒంటికన్ను గురువు శుక్రాచార్యుడు ఇలా సెలవిచ్చాడట
“నాయనలారా - అమృతం వారికి చెందాలని వ్రాసి ఉంది, మనకు ప్రాప్తం లేదు” అని..

ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే -

ఈ నా కథ చదవి తీరాలని మీకు వ్రాసి పెట్టి ఉంది కనుక.. ఏం చేద్దాం పాపం.. ప్చ్!

మా శాంతి చచ్చిపోయింది!

మా శాంతి చచ్చిపోయింది..

కూతురై పుట్టాక ఒక అయ్య చేతిలో పెట్టాలి అన్నట్లుగా చెయ్యలేదా తండ్రి.

కాశమంత పందిరి, భూదేవి అంత పీట వేసి.. ఓ సారీ.. ఇది మరీ పాత పోలిక కదా.లేజర్ షోలు, సెక్యూరిటీ గోలతో సినిమా స్టార్లలా కాకున్నా తనకున్నంతలో సాంప్రదాయబద్ధంగా, సకల లాంఛనాలతో ఘనంగానే పెళ్లిని జరిపించాడు.

కానీ..శాంతి చచ్చిపోయింది.

పెళ్లయ్యి ఏడాదైనా గడవక ముందే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది.

మొగుడు తాగుబోతు కాదు, తిరుగుబోతూ కాదు.అందరూ అనుకునేట్లు సూర్యకాంతం లాంటి అత్త, నర్రా వెంకటేశ్వర్రావు లాంటి మామగారు కూడా లేరు. అందరికీ తెలిసినంతవరకు కోడల్ని నెత్తిన పెట్టుకుని చూసుకునేవారే.కట్నకానుకల బాధలు లేవు, ఆడపడుచుల అఘాయిత్యాలూ లేవు.

శాంతి చావుకు గల కారణాలను వెదుకుతూనే ఉన్నారు - రంధ్రాణ్వేషకులు.

నాలో తప్పు చేసానేమోనన్న అపరాధ భావం.ఇది నిజం కాకపోయి ఉంటే బాగుండునన్న ఆశ.ఎందుకంటే - వీళ్లెవరికీ తెలియంది నాకు తెలుసు కాబట్టి.నేను సరైన చర్యలు తీసుకున్నట్లయితే ఈ రోజు శాంతి చనిపోయి ఉండేది కాదు కాబట్టి.

రెండు నెలల క్రితమే నేను శాంతిని కలిసి ధైర్యం చెప్పి ఉంటే..పరిస్థితి మరోలా ఉండేదేమో?
మేము తరచూ ఉత్తరాలు వ్రాసుకునేవాళ్లం.మొబైల్ ఫోన్లు, ఇ-మెయిల్‌ల స్పీడు యుగంలో ఈ పాత చింతకాయ అలవాటేంటి అని ముక్కున వేలేసుకునేవారు, అడపాదడపా వెక్కిరించేవారు ఉన్నప్పటికీ మేము మా అలవాటును మానుకోలేదు. తను వ్రాసిన ఉత్తరాలు ఇప్పటికీ నా బీరువాలో భద్రంగా ఉన్నాయి.

తలుపులు బిగించుకుని ఉత్తరాలను ముందేసుకున్నాను.మొదటి ఉత్తరం.. షరా మామూలే.. శ్రీవారి ముచ్చట్లతో నింపేసింది.రెండవ ఉత్తరం.. ఏడాది క్రితం మామగారు కొని ఆశలొదిలేసుకున్న షేర్ల ధర అమాంతం పెరిగిపోయిందట. అంతా నీ చలవేనమ్మాయ్ అంటూ అందరూ ఆకాశానికెత్తేస్తున్నారట. చాలా ఆనందంగా సాగిపోయింది ఉత్తరం.మూడు, నాలుగు ఉత్తరాల్లోనూ ఇదే వరుస.. శ్రీవారికి ప్రమోషన్, అత్తగారి ఆస్మా రోగం కుదుటపడటం వగైరా వగైరా..

వీటన్నింటికీ కారణం ఈ అమ్మాయి పాద మహిమే గానీ మరొకటి కాదని అత్తవారింటి అభిప్రాయం.

అలాంటిదేమీ లేదండి, అంతా కాలమహిమ అంటుంది ఈ అమ్మాయి. వింటేగా? నెత్తినెట్టుకున్నారు, గారాలు పోయారు.

సాక్షాత్తూ ఐశ్వర్యారాయ్ లిఫ్ట్ అడిగినా సెకనైనా ప్రయాణం ఆపని కాలం మాత్రం శరవేగంతో దూసుకెళ్తూనే ఉంది.

పరిస్థితులు తారుమారయ్యాయి..ఎవరూ, ఎప్పటికీ ఖచ్చితంగా అంచనా వేయలేని షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుదేలవడంతో మావగారికి నష్టాలొచ్చాయి.చలికాలంలో సరైనా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అత్తగారికి కొత్త రోగాలు పుట్టుకొచ్చాయి.కొత్త పెళ్లాం మోజుతో పనిపై సరిగ్గా శ్రద్ధ వహించని శ్రీవారికి మెమో.

ఎవరు మాత్రం ఒప్పుకుంటారు తప్పుని ఎత్తి చూపితే?నెత్తిన బరువు దించేసుకునేందుకు, జరిగిన విపరీతాలన్నింటికీ మరొకరే కారణమని నింద వేసేస్తే?

అదే జరిగింది..

మాబంగారం అని నెత్తిన పెట్టుకున్నవారే దరిద్రపు జన్మ అని ఛీకొట్టారు.అదృష్టదేవత అని ముద్దు చేసిన శ్రీవారు నష్ట జాతకురాలు అని ఈసడించుకున్నాడు.అత్తగారైతే సరేసరి. సూటిపోటి వాగ్బాణాల వడ్డింపులు తప్పనిసరి.

క్రమంగా శాంతికి మనశ్శాంతి కరువై. అశాంతికి నిలువెత్తు సాక్ష్యమైంది.
తను ఎంత మానసిక క్షోభననుభవిస్తోందో తను వ్రాసిన చివరి ఉత్తరంలో వివరించింది.తీరిక లేని టూర్‌లతో నిత్యం సతమతమయ్యే నేను తనను కలిసి ధైర్యం చెప్తామనుకునేంతలోనే.. ఇలా..

కాస్త ప్రేమ, మరికాస్త ఓదార్పు కరువైన బ్రతుకు బండిని లాగడం కష్టమనుకుందో ఏమిటో..చివరికి ఇలాంటి నిర్ణయం తీసేసుకుంది.

మా శాంతి చచ్చిపోయిందికాదు కాదు అందరూ కలిసి చంపేశారు.

గురువుకో బహుమతి

శిష్యులందరికీ,

ముందస్తు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు. ఎలాగూ అదే రోజు నా పెళ్లి రోజు కూడా అయినందున ఆ రోజు నేను మీకు శుభాకాంక్షలు తెలిపేందుకు అందుబాటులో ఉండలేను. అంతేకాదు… మీ నుంచీ పెళ్లి రోజు కానుకలు అందుకోలేని పరిస్థితి ఏర్పడగలదు.

ఈ కారణంగా ముందుగానే మీరు నాకు కానుకలు అందించేశారంటే ఆ శుభదినాన్ని మేము కూడా మీ ఆకాంక్షలకు తగ్గట్టు హాయిగా జరుపుకోగలము. ఎలాగూ మీరు రూ. 200ల కన్నా తక్కువ విలువ చేసే కానుకలు నాకు ఇవ్వరని తెలుసు. కానీ రూ. 500లు మాత్రం మించనివ్వకుండా చూసుకోండి. పొదుపు మన జీవితాలకు చాలా ముఖ్యం కదా.
మరోసారి ముందస్తు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలతో…

మీ గురువు

ఓ శిష్యుని సమాధానం…

గురువుగారికి,

ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు ముందస్తుగానే అందించినందుకు ధన్యవాదాలు.

ఇక కానుకల సంగతి -

మేము మీకు ఎంతో చేద్దాము, ఇద్దాము అనుకుంటుంటే మీరు మరీ రెండు వందల నుంచి ఐదు వందల మధ్యలో నిల్చిపోయారు. ఇది మాకు ఊహించని ఎదురుదెబ్బ. మా మనస్సుల్లో మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీకు తెలియదు.
అందునా వివాహ మహోత్సవ పర్వ దినాన కానుకల విషయంలో పొదుపు పాటిస్తే.. జీవితమే వ్యర్థం.

కానీ చిక్కల్లా అక్కడే వచ్చింది.. ఏదైనా వస్తువు ఇద్దామనుకుంటేనా - దాని ఖరీదు ఎంతైనప్పటికీ మీపై మా అభిమానం ముందు పూచిక పుల్లతో సమానం.. అందులో చిచ్చరపిడుగులు ఉన్న ఇల్లాయె. ఈ రోజుల్లో పిల్లలు ఉన్న ఇళ్లలో టీవీలు, ఫ్రిడ్జ్‌లకే గ్యారంటీ లేదు. కాబట్టి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాం.

ఇక ధనరూపంలో ఇద్దామంటే - తుచ్ఛం, అశాశ్వతం, క్షణికం. ఈ రోజుల్లో డబ్బు ఎన్ని మార్గాల్లో వస్తోందో అంతకు రెట్టింపు మార్గాల్లో, పద్ధతుల్లో ఖర్చయిపోతోంది.. దానికి తోడు మా అభిమానానికి ఇంత అని వెలకట్టి ఇచ్చి మమ్మల్ని మేము కించపర్చుకోలేము.. క్షంతవ్యులం..

కానీ ఏదో ఓ కానుక ఇవ్వాల్సిందే - అది శాశ్వతమైనది, వెలకట్టలేనిది అయ్యి ఉండాలి. క్షరం కానిది అక్షరం అన్నారు పెద్దలు.. కనుక మీకివే మా శుభాకాంక్షలు -

“వివాహ దినోత్సవ శుభాకాంక్షలు..”
మీరు మీ ధర్మపత్నితో (ఆవిడతో మాత్రమే) ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ...

శిష్యుడు

ప్రాస - ప్రయాస

అసలే పరాయి రాష్ట్రంలో గడుపుతున్నామనే దిగులేమో - మా కార్యాలయంలో అందరికీ కూడా భాషాభిమానం జాస్తే.. వచ్చింది ఆంధ్రలోని పలు ప్రాంతాల నుంచి అయినప్పటికీ, ఎవరి యాసలో వారు, ఎవరి పద్ధతిలో వారు విచ్చలవిడిగా మాట్లాడేసుకుంటూ ఉంటాం. మరి పని మాటేమిటి అనేగా మీ సందేహం. ఆ.. దేని దారి దానిదే. ప్రణాళికలు (ప్రాజెక్టులు), చావుగీతలు (డెడ్‌లైన్లు), మధ్య మధ్యలో ఈ ఉప సంచాలకం (అసిస్టెంట్ మేనేజర్ లెండి) గాడి కుళ్లు జోకులూ ఉండేవే లెండి.

తెలుగులో, అందునా అచ్చమైన ప్రాకృతాంధ్రలో మాట్లాడేందుకు మాలో మేము శతథా ప్రయత్నిస్తూ ఉంటాం. అందులో బయటకు తెలియని ఓ సౌలభ్యం దాగి ఉంది కూడా. ఈ రోజుల్లో పెరిగిన శాటిలైట్ ఛానెళ్ల పుణ్యమాని కన్నడ, తమిళ, మలయాళ సోదరులందరూ కూడా అంతో ఇంతో తెలుగును అర్థం చేసేసుకోగలుగుతున్నారు. ఇక మన ఉన్నతాధికారులను మనం, మన కింది స్థాయి ఉద్యోగులు మనల్ని తిట్లతో సత్కరించుకోవడం ఏ ఒక్క కార్యాలయంలోనైనా ఉండేదే.

భావోద్వేగాన్ని సరిగ్గా వ్యక్తీకరించేందుకు మాతృభాషను మించిన మాధ్యమం లేదు కదా. మరి అది కాస్తా నలుగురికీ అర్థమైపోతే రేపటి సంగతి ఎలా? అందుకనే ఈ ప్రాకృత భాష. కొత్తగా మా బృందంలో చేరేవారికి మొదట్లో కూసింత ఇబ్బందిగా ఉన్నప్పటికీ, కొత్త పుంతలను తొక్కడంలో వారు మాతో పోటీ పడుతుంటారు.

అలా ప్రవేశించిందే - ప్రాస ప్రయాస.

అబ్బో.. ఒకటా రెండా ఆయాసానికి హేతువులు. నవ్వలేక మా ఉప సంచాలకులు, సంచాలకులు తెగ ఇది అయిపోతుంటే, పొట్ట చెక్కలయ్యేలా నవ్వడమంటే ఏంటో మాకు తరచుగా అనుభవంలోకి వస్తూ ఉంటుంది.

ఇటీవలి సంభాషణలో పేలిన ఓ ప్రాస పటాసు…మాకంటే అనుభవంలోనూ, వయస్సులోనూ పెద్దవారైనటువంటి మా సహోద్యోగి ఒకరు మా మిత్రుడు చూ(చే)స్తున్న ఫైలులోని ఓ గొప్ప తప్పును కనిపెట్టేసి (అని అనుకునే కావచ్చు - అదిక్కడ అప్రస్తుతం) -“ఎంత బ్లండర్ అండి, మీలాంటి యువకులు దీన్ని వండర్ చేయాలి” అనేశాడు..ఏదో పెద్ద ముండావాడు కదా అని వదిలేయకుండా మనవాడు -“జెండర్ వివక్ష, స్ప్లెండర్ బైకు లేని మీరు థండర్‌లా వస్తే గానీ ఈ బ్లండర్ మిస్టేక్ వండర్ అయిపోదండి” అంటూ చాంతాడంత రిటార్ట్ ఇచ్చేసుకున్నాడు.

ఇలాంటివి బోలెడు మా దైనందిన సంభాషణల్లో దొర్లుతుంటాయి.

మా కార్యాలయ ఆంతరంగిక వ్యవహారాలను ప్రస్తావించడం బ్లాగోచితమో కాదో నాకు తెలియదు గానీ, నూతన ఆంగ్ల సంవత్సరంలో నా తొలి బ్లాగు రూపకల్పన అయితే జరిగిపోయింది..వెనుకటికి ఓ పెద్దాయన - తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి అన్నాట్ట.ఆ పద్ధతిలో -నేను బ్లాగేశాను, చదవడం చదవకపోవడం మీ ఇష్టం :)

Wednesday, March 5, 2008

పశ్చాత్తాపమా… ఏదీ నీ చిరునామా

అప్పటికి సమయం ఉదయం 4 గంటలు అవుతోంది. నిద్రలేమితో ఎర్రబడ్డ కళ్లతో దీర్ఘంగా ఆలోచిస్తున్నాను.. నిన్న సాయంత్రం నాకు తారసపడిన ఒక సంఘటన ఇలా ఎడతెగని ఆలోచనలకు బీజం వేసింది. అప్పటి నుంచి ఎంతగా ఆలోచించినా నన్ను నేను సమాధానపర్చుకోలేక సతమతమైపోతున్నాను. నిన్న సాయంత్రం ఎమ్మార్వో ఆఫీసులో నేను చూసిన ఆ దృశ్యం ఇంకా నా మనోఫలకం పైన కదలాడుతూనే ఉంది.

ఆవిడ అప్పటికే రెండేళ్లుగా నష్ట పరిహారం కోసం తిరుగుతూనే ఉందట..

లక్ష రూపాయల నష్ట పరిహారంలో 10 శాతం కమీషన్ ముందుగానే ఇస్తేనే తప్ప ఫైలు కదలదంటాడు ఈ పెద్ద మనిషి...

తినే తిండి గింజలకే ఎదురు చూడాల్సిన పరిస్థితుల్లో ఉన్న ఆ దీనురాలు కాళ్లు పట్టుకున్నా ఈయన హృదయం (ఉందా?) కరగలేదు సరికదా, ప్యూనుగారితో వెళ్లగొట్టించాడు.

ఎవరీమె...

చూస్తే అమాయకురాల్లా ఉంది...

ఆమె ఆ పరిస్థితుల్లో ఎందుకుంది?

ఆ.. గుర్తుకొచ్చింది… డ్రైవర్ హరి భార్య ఈమె...

గుర్తుకురాని ముందు ఉన్న ఉత్సుకత ఇప్పుడు లేదు...

ములుగుకర్రలా గుచ్చుకునే పాత జ్ఞాపకాలు తప్ప...

ఎప్పటిలా వద్దనుకుంటూనే మరోసారి గతంలోకి జారుకున్నాను…


నేను ఓ మారుమూల గిరిజన తండాలో పుట్టి పెరిగాను. దళంలో చేరక ముందు నా పేరు సూరన్న, ఇప్పుడు క్రాంతి. చిన్ననాటి నుంచే అనేక కష్టాలు. కుటుంబ పరిస్థితులు, భవిష్యత్తు గురించిన ఆందోళన నన్ను కుదురుగా ఉండనిచ్చేవి కావు. నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమైపోయేవాడిని. అలాంటి రోజుల్లో నా మిత్రుడి ద్వారా దళంతో పరిచయమేర్పడటం, కుటుంబాన్ని చురకత్తుల లోకానికి వదిలి ఎర్ర జెండా చేతబట్టి దళంలో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి.

పదిహేనేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మలుపులు, మరెన్నో ఆటుపోట్లు...

మందుపాతరలు పేల్చడం, ప్రజల ఆస్తులైనటువంటి రైల్వే స్టేషన్లు, బస్సులు, టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్‌లను పేల్చివేయడం లాంటి ఎన్నో విధ్వంసకర చర్యల్లో పాలుపంచుకున్నాను...

ఇవన్నీ ఒక ఎత్తయితే.. స్వంత (?) పార్టీలో…

దేశంలోని మరే పార్టీకి తీసిపోని స్థాయిలో ఎర్రెర్రని పార్టీలోనూ గ్రూపులూ, కోవర్టుల వెన్నుపోట్లు, సానుభూతిపరుల ముసుగులో ఆప్యాయంగా విషాహారం వడ్డించే సంఘటనలు…! తమ చిందులతో, ఆవేదన, ఆవేశం కలగలిపి నింపిన గొంతుకలతో, ఎంతో మంది తల్లులకు కడుపుకోత మిగిలేలా నాలాంటి వేలాది యువకులను ‘సో కాల్డ్’ దళం, పోరాటం, సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా అడవుల్లో నడుస్తున్న పార్టీ ముగ్గులోకి దింపిన కొందరి మహామహుల పిల్లలు మాత్రం విదేశాల్లో సురక్షితంగా డాక్టర్‌‌గిరీలు చేసుకోవడం వంటివి నన్ను నిజంగానే కాంతిపథంవైపు ఆలోచింపచేసాయి.

బూటకపు ఎన్‌కౌంటర్లు...

సహచరుల హఠాన్మరణాలు...

ప్రతీకార చర్యలు - అనాథలై వీధులపాలవుతున్న కుటుంబాలు...

పార్టీ పుణ్యమా అని కలిగిన అక్షరజ్ఞానంతో చదివిన సాహిత్యం నాకు కొంత లోకపరిజ్ఞానాన్ని కూడా సంపాదించి పెట్టింది...

ఓ అవినీతి రాజకీయ నాయకుడి కోసం నేను మందుపాతర పేల్చితే, అతనితో పాటు ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ హరి, సెక్యూరిటీ గార్డులు, పిఎ లాంటివారు ఎందరో పోయారు...

నాయకుని జీవిత భాగస్వామో, కడుపున పుట్టిన పిల్లలో ఆ “సింపతీ ఓట్ల”తో మళ్లీ ఆ నియోజకవర్గం బై ఎలక్షన్లలో గెలిచి గద్దెనెక్కేస్తే...

అదే పేలుడులో మరణించిన దిగువ తరగతి ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబం తమకు రావలసిన నష్ట పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాయి...

ఒక పెళ్లాం సర్టిఫికేట్ అందించాలి.. ఆమె అతను ఉంచుకున్నది కాదు.. కట్టుకున్నదేనని నిరూపించుకునేందుకు...

ఒక పెళ్లాం సర్టిఫికేట్ అందించాలి.. ఆమె ఇంకా చావలేదు.. బతికే ఉన్నానని చెప్పుకునేందుకు...

ఎమ్మార్వో ఆఫీసుల్లో, ట్రెజరీ ఆఫీసుల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో చేతులు తడపాలి.. మొగుడు చచ్చి ముండ మోసినందుకు ప్రతిఫలంగా రానున్న ప్రభుత్వం అందించే కంటితుడుపు సాయాన్ని అందుకునేందుకు...

ఒకటా, రెండా ఇలా కంటి వెంబడి నీరు రప్పించే సంఘటనలు..ఒకరా, ఇద్దరా కార్యాలయపు మెట్లు ఎక్కలేక అలసిసొలసి నిస్సారంగా బతుకులు వెళ్లదీసేవారు...

ప్రజలు అంటే భూస్వాముల కబంధ హస్తాల్లో నలిగే పల్లె ప్రజలేనా..ప్రజలు అంటే కామాంధ కామందుల కర్కశ కౌగిల్లో నలుగుతున్న పల్లె పడతులేనా..ప్రజలు అంటే నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతన్నలు మాత్రమేనా...

మార్చలేనా ఈ కుళ్లిన సమాజాన్ని...

మార్చలేనా వీరి నుదుటి రాతలను...

మౌనంగా రోదించాను ఎన్నో రాత్రులు...

కుమ్మరి పురుగులా మెదడును తొలిచేస్తున్న ఆలోచనలు...

తల బ్రద్దలైపోతుందేమోనన్న అనుమానం...

కనీసం నా వల్ల అనాథలైన కుటుంబాలనైనా ఆదుకోవాలన్న దృఢ నిర్ణయానికి వచ్చాను...

మర్నాటి ఉదయమే జోనల్ కమాండర్‌కి కబురంపాను నేను పోలీసులకు లొంగిపోదలచుకుంటున్నానని..అప్పటివరకు నాపై విపరీతమైన ప్రేమ చూపిన సీనియర్లు, నన్ను సైతం ఆదర్శంగా తీసుకుని దేశాన్ని ఉద్ధరించేందుకు నాలాగే కుటుంబాలను త్యజించి ఆయుధ పోరాటంలో సమిధలయ్యేందుకు సిద్ధంగా ఉన్న కామ్రేడ్ సోదరులు నమ్మలేకపోయారు.. ఏవగింపుగా చూశారు… నాలో ఉత్తేజాన్ని కల్గించేందుకు విఫల ప్రయత్నాలు చేశారు.. కానీ నా నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో వారి (ప్రస్తుతం) దళం రహస్యాలను పోలీసులకు చెప్పకూడదన్న ఆంక్షతో నేను ఆ కీకారణ్యం నుంచి బయటపడేందుకు అనుమతించారు...

నాకు నేనుగా ఊహించుకున్న నాదైన ప్రపంచానికి వెలుగులందించే ఉద్దేశ్యంతో ఉదయించాను నేనే సూర్యుడినై...

ఇప్పుడు నాకే బంధనాలు, అడ్డంకులు లేవు,

వారం రోజుల తర్వాత...

జిల్లా ఎస్పీ కార్యాలయంలో భేషరతుగా లొంగిపోయిన నన్ను సాదరంగా జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించింది ప్రభుత్వం...

ఉండేందుకు ఇల్లు, బతికేందుకు పొలం, ట్రాక్టర్, నా తలకి కట్టిన వెల అంతా ఇక నాకే..కేవలం నెల రోజుల్లోనే నాకు రావలసిన ప్రభుత్వ సాయం నా ముంగిట వాలింది...

నవ్వుకున్నాను నేను నా దేశ దుస్థితిని చూసి...

నిజంగానే నవ్వుకున్నాను నేను నా దేశ దుస్థితిని చూసి ఏడ్వలేక..

ఈ రోజుకీ నా మూలంగా అనాథలైనవారు అభిమానాన్ని చంపుకుని అడుక్కుంటున్నారు...

అభిమానాన్ని కూడా చంపలేని, చంపుకోలేని మానధనులు నిస్సహాయంగా చావు కోసం ఎదురు చూస్తున్నారు...

మరి నాకు సీల్డ్ కవర్‌లో పెట్టి మరీ ఇచ్చారు పరిహారం...

మారణ హోమాన్ని ఆపినందుకా?ఏమో?

నేను పేల్చిన మందుపాతర మూలంగా చనిపోయినవారి కుటుంబ సభ్యులందర్నీ ఒకేసారి కలుసుకున్నాను..ఆ క్షణం.. నన్ను నేను పరిచయం చేసుకున్నాక.. వారి కళ్లల్లో ప్రతిఫలించిన భావాలకే శక్తి ఉంటే ఈ రోజు మీకు నా కథ చెప్పే అవకాశమే ఉండేది కాదు...

నేను వచ్చిన పని చెబుతూనే వారు మరింతగా అసహ్యించుకున్నారు...

అక్కర్లేదు పొమ్మన్నారు.. లేని శక్తిని కూడదీసుకుని కొట్టేందుకు మీదికొచ్చారు...

జీవితంలో ఎవరికీ, దేనికీ తలవంచని మొండివాడిగా పేరుపడ్డ క్రాంతి ఆరోజు లేడు...

చేసిన తప్పుకు పరిహారం చెల్లించేందుకు, పశ్చాత్తాపంతో కుంగిపోతున్న సాధారణ సూరన్న తప్ప...

కళ్ల వెంబడి ధారలుగా కారుతున్న కన్నీటి సాక్షిగా వారి కాళ్లు పట్టుకున్నాను...

ప్రభుత్వం ఇచ్చిన భూమి, ట్రాక్టర్, డబ్బును నిండు మనస్సుతో వారికి అందించాను...

నా వల్ల వారికి కలిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయలేకున్నప్పటికీ, వారి బ్రతుకులకో దారి
చూపించగలిగినందుకు ఓమేరకు ఆనందం కల్గింది.

నా బ్రతుకు గురించి నాకు చింత లేదు...

ఉన్న కండలు కరిగిస్తే ఈ ఏకాకిగాడి పొట్టకు ఇన్ని మెతుకులు దొరక్కపోవు...

ఏమంటారూ?

శ్రీరామనామ దూషణ(?!) పర్వం

(ఇది కేవలం హాస్యం కోసమే బ్లాగినది.. కథ, పాత్రలు, పాత్రధారులు కేవలం కల్పితం.. ఏ ఒక్క ప్రాంతం వారినో కించపరిచేందుకు, నొప్పించేందుకు బ్లాగినది కాదు అని గుర్తించ మనవి.)

నేను గత వారం మా ఊరికి వెళ్లానోచ్...

అదిగో.. అదే తొందరంటే...

ఇందులో వింతేముంది అనుకోకండి...

ఈసారి ఎప్పటిలా శనివారం కాకుండా - శుక్రవారమే వెళ్లానన్నమాట...

ఓసోస్.. అంతేనా అని అనేసుకున్నారా?

మరదే...నాకు కాలేది...

నన్ను పూర్తిగా చెప్పనివ్వండి — ఓహ్.. సారీ - బ్లాగనివ్వండి...

మరేమో.. మొన్న ఊరికి మా అగ్రజుడి మిత్రునితో కలిసి వెళ్లానన్నమాట...

ఆ ప్రయాణంలో - మా మధ్య జరిగిన చర్చల్లో - నాకు తెలీని ఎన్నో విశేషాలను నేను తెలుసుకోగలిగాను.చర్చాంశం సాఫ్ట్‌వేర్ కాదు, సినిమాలు కాదు, సినీ తారల వ్యక్తిగత జీవితాలూ కాదు.. 25 నుంచి 30 ఏళ్ల కుర్రాళ్ల మధ్య ఇంతకు మించి చర్చకు మరేం ఉంటాయని మరీ అలా తీసిపారేయకండి...

మా చర్చాంశం - “రామాయణం”

పాపం ఇక్కడ ప్రస్తావించకూడనిదే గానీ.. మనోడికి ఆవేశం కూసింత జాస్తే...

ఆ మధ్య ఒక తమిళ, ప్రముఖ, వృద్ధ, రాజకీయ నాయకుడు రాముడు లేడనడాన్ని, రామాయణం కల్పితమనడాన్ని, అంతటితో ఆగకుండా రాముడు తాగుబోతు అంటూ ప్రకటనలు గుప్పించేయడాన్ని ఈయన జీర్ణించుకోలేకపోయాడు...

నీకు అసలు తమిళుల మూలం తెలుసా అంటూ మొదలెట్టాడు - తెలీదన్నా (నేను చరిత్రలో కొంచెం వీక్ మరి)...

అసలు తమిళులు రామునిపై ఇలాంటి అవాస్తవ, అసత్య ప్రచారం చేయడానికి కారణం తెలుసునా అన్నాడు.. మళ్లీ “తెలీదన్నా” అన్నా...

చెప్పనా మరి అంటూ ఊరించాడు.. ఊ కానీ.. ప్రయాణం సాగాలి కదా అనేశా...

ఇక చూస్కోండి…

అయోధ్య నుంచి రాముడు వనవాసానికి బయల్దేరడం, సీతమ్మను రావణాసురుడు ఎత్తుకెళ్లిపోవడం, రామలక్ష్మణులు వానరులతో జట్టు కట్టి లంకకు వారధి కట్టి, రావణాసురుని పని పట్టడం తెలిసిన విషయాలే..ఆ తర్వాత అందరికీ తెలిసిన విషయాలేమిటంటే - సీత అగ్నిప్రవేశం, పుష్పక విమానంలో అయోధ్య ప్రయాణం వగైరా వగైరా...

కానీ మధ్యలో మరొకటుంది...

అయోధ్యకు వెళ్లేందుకు బోల్డంత మంది వానర వీరులు పుష్పక విమానంలో చేరిపోయారట..అందులో ఎంత మంది ఎక్కినా మరొకరికి చోటు ఉంటుంది కదా...

మార్గమధ్యంలో -

వారి చిందులకు, గంతులకు అంతూ పొంతూ లేకుండా పోయిందట...

లక్ష్మణుడు, సుగ్రీవుడు ఎన్నోసార్లు హెచ్చరించారట...

వాళ్లు వచ్చినప్పుడు వీళ్లేమో “అరవం, అరవం” అనేవారట...

వాళ్లటు పోగానే మళ్లీ అదే వరుస.. ఇహ లాభం లేదనుకున్న లక్ష్మణస్వామి, సుగ్రీవుడు పుష్పక విమానాన్ని అక్కడికక్కడే దింపి, వారిలో కొందరిని అక్కడ వదిలేసి చక్కా వెళ్లిపోయారట.

అలా వదిలివేయబడిన వానరమూక అక్కడే స్థిర నివాసమేర్పరచుకున్నారట...

వాళ్ల భాష పేరు - “అరవం” అయిందట...

ఇక మరో వైపున -

రావణుని వధతో ఆయన అనుచరులైనటువంటి కొందరు రాక్షసులు, విభీషణుని పాలనను, అధికారాన్ని అంగీకరించలేక రాముడు నిర్మించిన ఆ వారధి పైనే ప్రయాణించి, ఈ అల్లరి వానర మూకలు నివసిస్తున్న ప్రాంతానికే తరలి వచ్చాయని, ఇద్దరి శత్రువు శ్రీరాముడే కాబట్టి, ఎంచక్కా కలిసిమెలిసి సహజీవనం చేసి, అలాగే స్థిరపడిపోయారట...

తమ ‘సాయం’తోనే రాముడు యుద్ధం గెలిచాడని అనుకుంటున్న వానరులకు అవసరం తీరగానే తమను అక్కడ వదిలిపోయాడని రాముడి మీద అక్కసు అట ; శ్రీరాముడు కారణంగానే తమ లంకను వదిలి ఇలా పరాయి చోట నివసించవలసి వచ్చిందనే బాధతో దానవులు - - - ఆ కారణంగానే వారి తర్వాతి తర్వాతి తర్వాతి తరం అయినటువంటి ఇప్పటి తరం వారిలో అంతర్లీనంగా ఆ కసి, పగ ఉన్నాయని, అందుకే వారు ఇలా పేట్రేగిపోతున్నారని మా అన్నగారి స్నేహితుడు తేల్చి పారేశారు.

అప్పటి నుంచి ఈ నా కొత్త జ్ఞానాన్ని మీతో పంచుకోవాలని తెగ ప్రయత్నించేశాను.. ఇదిగో ఇప్పటికి తీరిక దొరికి బ్లాగేశా..

మరో కొత్త కథనంతో మళ్లీ కలుస్తా...

Monday, March 3, 2008

ఓ మంచి పద్యం


పద్యం:


కూరిమి గల దినములలో
నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచు చుండు నిక్కము సుమతీ!


తాత్పర్యం:

పరస్పరము స్నేహమున్న రోజులలో నేరములు కనిపించవు. కానీ ఆ స్నేహము చెడగానే అన్నీ తప్పులుగా కనపడుతాయి. ఇది నిజము.

ప్రసార సాధనాల తీరుతెన్నులు

ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి...

మీకు న్యూస్ పేపర్ చదివే అలవాటుందా? (అది మీదా, పక్కింటి వాళ్లదా, టీ బంకువాడిదా, లేక మంగళి షాపువాడిదా అన్నది కాదు నా ప్రశ్న.. మీరు న్యూస్ (?) చదువుతారా, చదవరా)

పోనీ.. ఇది ప్రత్యక్ష ప్రసారాల (!) యుగం కదా...

ఏ న్యూస్ ఛానల్‌నైనా చూసే అలవాటుందా? (అది చూశాక మీ మానసిక, శారీరక ఆరోగ్యం సంగతి నాకక్కర్లేదు.. చూస్తారా, చూడరా?)

గత నెల, రెణ్ణెల్ల కాలంలో మీకు గుర్తున్న వార్తలేంటి?

మరీ అంత మొహమాటం అక్కర్లేదు - ఆలోచించుకోండి..


నావరకు నాకు గుర్తున్నవైతే,...

1) హైదరాబాద్ బాంబు పేలుళ్లు
2) మిత్రుడి(?)పై కెకె కుమారుని కాల్పులు, తాజాగా
3) మెగాస్టార్ తనయ ప్రేమ వివాహం

మధ్య మధ్యలో - నాలికలు కోస్తాం, తలలు నరుకుతాం, తరిమి తరిమి కొడతాం అంటూ నాయకుల ప్రవచనాలు...

వార్తా పత్రికలు, న్యూస్ ఛానళ్లు మీ కోసం ఎంత కష్టప(పె)డుతున్నాయో మీకీపాటికి అర్థమయ్యే ఉండాలి. మీరు నిద్ర లేచీ లేవగానే, సంచలనాలను మీ ముంగిట్లో తెచ్చేందుకు పోటాపోటీగా ముందుకు పోతూనే ఉన్నాయి. ఛానళ్లలో, స్నానాల గది దృశ్యాల నుంచి పెండ్లి మండపం, శోభనం వరకు అన్నీ ప్రత్యక్ష ప్రసారం పేరుతో మన నట్టింట్లో ప్రసారమై పోతూనే ఉన్నాయి.

ఇటీవల సంచలనం సృష్టించే సదుద్దేశంతో టీచర్‌పై నిందలు మోపింది ఓ ఛానల్. ఆమెకు దాదాపు చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పనైంది.


ఇది మా కుటుంబ వ్యవహారం బాబోయ్ అని మొత్తుకుంటున్నా వినకుండా, సర్వసమానత్వాన్ని చాటిచెబుతూ - మెగాస్టార్, అతని కుటుంబ సభ్యులను సైతం రచ్చకీడ్చేసింది మరో ఛానల్...

మరో పక్క ముఖ్యమైన వ్యవహారాలు మూలన పడిపోతున్నాయి.... సామాన్య ప్రజలను చైతన్యవంతులుగా మలచాల్సిన వార్తాసాధనాలు కాస్తా సంచలనాలు, టిఆర్‌పిల మోజులో నాణ్యత లేని.. కాదు.. పస లేని వార్తలను అందిస్తూ, సమాజం కోసం పాటు పడుతున్నామని, సమాజాన్ని మార్చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాయి.

చిరంజీవి తనయ ప్రేమ పెళ్లి దెబ్బతో ముఖ్యమైన(?) విషయాలన్నీ మూలన పడిపోయాయి..బాంబు పేలుళ్ల కారకులను పట్టేసామంటూ, వేరెవరు అభినందించక పోయేసరికి, తమకు తామే జబ్బలు చరిచేసుకుని సంబరపడిపోయిన పోలీసులు, ఆ పేలుళ్లకు వారు బాధ్యులు కారని చెప్పిన తర్వాత, దాని దర్యాప్తు గురించి పట్టించుకున్న నాథుడు లేడు... నా భర్తను చంపిన వాళ్లని శిక్షించండి బాబోయ్ అంటూ రోడ్డున పడ్డ స్త్రీకి ఓదార్పు లేదు..

మనం తెలుసుకోవలసింది ఏమిటంటే -
మన వార్తా సాధనాలు - నాయకుల ప్రచార సాధనాలు..
స్వలాభాపేక్షకు తప్ప, ప్రజలకు ఉపయోగపడేవి కావు..

ట్వంటీ20 - కథా కమామీషు


ఉదయాన్నే (?) కార్యాలయంలోకి వచ్చేసరికి మా సరదా మిత్రుడు తయారు..

“కాఫీకి పోదాం గురూ” అంటూ క్యాంటీన్‌కి దారి మళ్లించాడు. ఇలాంటి విషయాల్లో నేను మిత్ర ధర్మం తెగ పాటిస్తాను...

సీన్ కట్ చేస్తే...

చేతుల్లో వేడి కాఫీ..మా వాడు తుఫాను ముందు ప్రశాంతతలా ఉన్నాడు...

వాడి గురించి తెలిసీ నేను మళ్లీ అదే తప్పు చేశాను.. “ఏంటి మామా విషయాలు” అని...

ఇక మొదలెట్టాడు.. పాక్‌తో జరిగిన ట్వంటీ 20 వరల్డ్ కప్ ఫైనల్ గూర్చి...

తెగ మెచ్చేసుకున్నాడనుకుంటే పప్పులో కాలేసినట్లే… తెగ తెగిడాడు..

అదో టోర్నీనా...

20 ఓవర్లు, 3 గంటల మ్యాచ్‌లో గెలిస్తే ఏంటి, ఓడితే ఏంటి...

టైమింగ్ లేదు.. టెక్నిక్ లేదు.. ఫుట్‌వర్క్ లేదు.. అసలు ఏ బౌలరన్నా లెక్కే లేదు.. (మన వాడు గతంలో గల్లీ క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్ పట్టుకునేందుకు చేతగాక, బౌలర్‌గానే మిగిలిపోయాట్ట)

మ్యాచ్ అంటే టెస్ట్ మ్యాచే...

వన్డేలతోనే దాని పతనం ప్రారంభమైంది...

దానికి తోడు.. టి20 అంటూ ఈ చిల్లర క్రికెట్ ఒకటి అంటూ రెచ్చిపోయాడు...

అంతే కాకుండా.. దీన్ని ప్రోత్సహించడం మంచిది కాదంటూ ఓ ఉచిత సలహా కూడా పారేశాడు...

సీన్ కట్ చేస్తే...

చేతుల్లో చల్లారిన కాఫీ...

వేడెక్కిన బుర్ర...

వాడితో వాదించే ఓపికా, తీరికా రెండూ లేక మౌనంగా భరించి (గతానుభవాలను దృష్టిలో పెట్టుకునా?)...

కార్యాలయానికి కదిలాం...

నా ఆలోచనలు కొన్నాళ్లు వెనక్కి మళ్లాయి...

ఈ నా సరదా మిత్రుడే.. న్యూజిలాండ్‌తో జరిగిన టి20 క్వార్టర్ ఫైనల్‌లో భారత్ ఓడిపోగానే.. మన వాళ్లు ఈ మ్యాచ్ గెలిచేందుకు కూడా పనికిరారు అని, పాక్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో “బౌలౌట్” ప్రకారం గెలిచినప్పుడు ఇదీ ఓ గెలుపేనా అంటూ పెదవితో పాటు మెటికలూ విరిచేశాడు.. మరిప్పుడు మళ్లీ వాడే ఇలా ప్లేటు ఫిరాయించేశాడు...

రాళ్లు వేయాలని నిర్ణయించుకోవాలే గానీ...

గెలిచినా వేస్తారు.. ఓడినా వేస్తారు...

నాకు జ్ఞానోదయమైంది.. మరి వాడికో…?!

Saturday, March 1, 2008

హర్షవర్ధనుడా...



ఏ ముహూర్తంలో నువ్వు చెన్నపురిని వదిలి అభాగ్యుడిలా భాగ్యనగరంలో అడుగు పెట్టావో కానీ ఆ క్షణం నుంచే దానికి దౌర్భాగ్యం చుట్టుకుందిరా నిర్భాగ్యుడా...

వంతెనలు కూలిపోయాయి.. మసీదుల్లో, లుంబినీ పార్క్‌లో, గోకుల్ చాట్‌ల వంటి వరుస బాంబు పేలుళ్లతో పాటు కెకె పదవి కూడా పోయింది కదరా తుచ్ఛుడా...

అసలు కుట్రదారులు బంగ్లాదేశ్ నుంచి దేశంలోనికి అక్రమంగా చొరబడిన హుజీ సభ్యులని పోలీసు మామలు నచ్చచెబుతున్నా...

ఇంతటి దారుణానికి మూలకారణం నీ పాద మహిమే గానీ మరొకటేది కాదని నా దృఢమైన, బలమైన, ఖచ్చితమైన అభిప్రాయం...

నువ్వు కాట్రావారిపల్లె నుండి చెన్నై చేరుకున్న కాలంలోనే సునామీ సంభవించింది...

అన్న పెళ్లి సాకుతో ఆంధ్రకు చేరుకున్నప్పుడు వరదలు వెల్లువెత్తాయి...

టెస్టింగ్ కోర్సు అంటూ హైదరాబాద్ చేరుకుని దానినీ పునీతం చేసి (?) ముంచేశావు కదరా త్రాష్టుడా..మళ్లీ అడుగెట్టావు చెన్నైలో...

అదిగో అప్పుడే తుఫాను హెచ్చరికో, సునామీ హెచ్చరికో వెలువడబోతుంది..

పన్నుల రూపంలోని ప్రజల సొమ్మంతా ప్రమాద బాధితుల పేరున నాయకుల నల్ల ఖాతాల్లోకి పోతుంది కదరా...

సందేహం లేదురా..రేయ్...

ఈసారి ఏమైనా విపత్తు జరిగిందంటే...

ఖచ్చితంగా..నిన్ను నేనే చంపేస్తానురోయ్...

అప్పుడుగానీ తెలియదు...


ఎంత కాదనుకున్నా.. ఎంత నచ్చజెప్పుకున్నా..ఎప్పటికప్పుడు మళ్లీ మళ్లీ అనిపిస్తూనే ఉంటుంది.. నేనూ అదే దారిలో నడుస్తున్నానని..వ్యక్తిగతంగా జీవితంలో ఎన్ని శిఖరాలను అధిరోహించినా (?)మనిషిగా పాతాళపు అంచులను చేరుకుంటున్నానని..

నా డైరీలో మంచి పనులకు మాత్రం ఎప్పుడూ వాయిదాలే..అలాగని చెడ్డ పనులు చేస్తున్నానని కాదు..ఎప్పటికప్పుడు రేపు అయినా చేయాలనే ‘ఎస్కేపిజం‘ తప్ప..ఇవాళ ఎందుకు చేయకూడదు, చేయలేము అనే భావనే రాదు కదా..

తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని శతకకారుడు, ఇంకా సదా నా పక్కనే ఉండే రాజుగారు చెబుతున్నప్పటికీ..అనుభవమైతే గానీ తెలియదు.. తప్పించుకు తిరగడం ఎంత కష్టమో..ఆత్మారాముడి నుండి..

పరిచయం



బ్లాగ్ ప్రియులకు నమస్సులు...


ఏదో నాకున్న కొద్దిపాటి భాషా పరిజ్ఞానంతో, బ్లాగు పట్ల ఉన్న అభిమానంతో మీ అందరి అభిమానాన్ని పొందేయాలనే ఆశతో ఈ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాను…


మంచి మనస్సులతో స్వాగతిస్తారని, ఆశీర్వదిస్తారని ఆశిస్తూ...


శ్రీ.