
ముందస్తు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు. ఎలాగూ అదే రోజు నా పెళ్లి రోజు కూడా అయినందున ఆ రోజు నేను మీకు శుభాకాంక్షలు తెలిపేందుకు అందుబాటులో ఉండలేను. అంతేకాదు… మీ నుంచీ పెళ్లి రోజు కానుకలు అందుకోలేని పరిస్థితి ఏర్పడగలదు.
ఈ కారణంగా ముందుగానే మీరు నాకు కానుకలు అందించేశారంటే ఆ శుభదినాన్ని మేము కూడా మీ ఆకాంక్షలకు తగ్గట్టు హాయిగా జరుపుకోగలము. ఎలాగూ మీరు రూ. 200ల కన్నా తక్కువ విలువ చేసే కానుకలు నాకు ఇవ్వరని తెలుసు. కానీ రూ. 500లు మాత్రం మించనివ్వకుండా చూసుకోండి. పొదుపు మన జీవితాలకు చాలా ముఖ్యం కదా.
మరోసారి ముందస్తు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలతో…
మీ గురువు
గురువుగారికి,
ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు ముందస్తుగానే అందించినందుకు ధన్యవాదాలు.
ఇక కానుకల సంగతి -
మేము మీకు ఎంతో చేద్దాము, ఇద్దాము అనుకుంటుంటే మీరు మరీ రెండు వందల నుంచి ఐదు వందల మధ్యలో నిల్చిపోయారు. ఇది మాకు ఊహించని ఎదురుదెబ్బ. మా మనస్సుల్లో మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీకు తెలియదు.
అందునా వివాహ మహోత్సవ పర్వ దినాన కానుకల విషయంలో పొదుపు పాటిస్తే.. జీవితమే వ్యర్థం.
అందునా వివాహ మహోత్సవ పర్వ దినాన కానుకల విషయంలో పొదుపు పాటిస్తే.. జీవితమే వ్యర్థం.
కానీ చిక్కల్లా అక్కడే వచ్చింది.. ఏదైనా వస్తువు ఇద్దామనుకుంటేనా - దాని ఖరీదు ఎంతైనప్పటికీ మీపై మా అభిమానం ముందు పూచిక పుల్లతో సమానం.. అందులో చిచ్చరపిడుగులు ఉన్న ఇల్లాయె. ఈ రోజుల్లో పిల్లలు ఉన్న ఇళ్లలో టీవీలు, ఫ్రిడ్జ్‌లకే గ్యారంటీ లేదు. కాబట్టి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాం.
ఇక ధనరూపంలో ఇద్దామంటే - తుచ్ఛం, అశాశ్వతం, క్షణికం. ఈ రోజుల్లో డబ్బు ఎన్ని మార్గాల్లో వస్తోందో అంతకు రెట్టింపు మార్గాల్లో, పద్ధతుల్లో ఖర్చయిపోతోంది.. దానికి తోడు మా అభిమానానికి ఇంత అని వెలకట్టి ఇచ్చి మమ్మల్ని మేము కించపర్చుకోలేము.. క్షంతవ్యులం..
కానీ ఏదో ఓ కానుక ఇవ్వాల్సిందే - అది శాశ్వతమైనది, వెలకట్టలేనిది అయ్యి ఉండాలి. క్షరం కానిది అక్షరం అన్నారు పెద్దలు.. కనుక మీకివే మా శుభాకాంక్షలు -
“వివాహ దినోత్సవ శుభాకాంక్షలు..”
మీరు మీ ధర్మపత్నితో (ఆవిడతో మాత్రమే) ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ...
శిష్యుడు
0 comments:
Post a Comment