
ఉదయాన్నే (?) కార్యాలయంలోకి వచ్చేసరికి మా సరదా మిత్రుడు తయారు..
“కాఫీకి పోదాం గురూ” అంటూ క్యాంటీన్‌కి దారి మళ్లించాడు. ఇలాంటి విషయాల్లో నేను మిత్ర ధర్మం తెగ పాటిస్తాను...
సీన్ కట్ చేస్తే...
చేతుల్లో వేడి కాఫీ..మా వాడు తుఫాను ముందు ప్రశాంతతలా ఉన్నాడు...
వాడి గురించి తెలిసీ నేను మళ్లీ అదే తప్పు చేశాను.. “ఏంటి మామా విషయాలు” అని...
ఇక మొదలెట్టాడు.. పాక్‌తో జరిగిన ట్వంటీ 20 వరల్డ్ కప్ ఫైనల్ గూర్చి...
తెగ మెచ్చేసుకున్నాడనుకుంటే పప్పులో కాలేసినట్లే… తెగ తెగిడాడు..
అదో టోర్నీనా...
20 ఓవర్లు, 3 గంటల మ్యాచ్‌లో గెలిస్తే ఏంటి, ఓడితే ఏంటి...
టైమింగ్ లేదు.. టెక్నిక్ లేదు.. ఫుట్‌వర్క్ లేదు.. అసలు ఏ బౌలరన్నా లెక్కే లేదు.. (మన వాడు గతంలో గల్లీ క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్ పట్టుకునేందుకు చేతగాక, బౌలర్‌గానే మిగిలిపోయాట్ట)
మ్యాచ్ అంటే టెస్ట్ మ్యాచే...
వన్డేలతోనే దాని పతనం ప్రారంభమైంది...
దానికి తోడు.. టి20 అంటూ ఈ చిల్లర క్రికెట్ ఒకటి అంటూ రెచ్చిపోయాడు...
అంతే కాకుండా.. దీన్ని ప్రోత్సహించడం మంచిది కాదంటూ ఓ ఉచిత సలహా కూడా పారేశాడు...
సీన్ కట్ చేస్తే...
చేతుల్లో చల్లారిన కాఫీ...
వేడెక్కిన బుర్ర...
వాడితో వాదించే ఓపికా, తీరికా రెండూ లేక మౌనంగా భరించి (గతానుభవాలను దృష్టిలో పెట్టుకునా?)...
కార్యాలయానికి కదిలాం...
నా ఆలోచనలు కొన్నాళ్లు వెనక్కి మళ్లాయి...
ఈ నా సరదా మిత్రుడే.. న్యూజిలాండ్‌తో జరిగిన టి20 క్వార్టర్ ఫైనల్‌లో భారత్ ఓడిపోగానే.. మన వాళ్లు ఈ మ్యాచ్ గెలిచేందుకు కూడా పనికిరారు అని, పాక్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో “బౌలౌట్” ప్రకారం గెలిచినప్పుడు ఇదీ ఓ గెలుపేనా అంటూ పెదవితో పాటు మెటికలూ విరిచేశాడు.. మరిప్పుడు మళ్లీ వాడే ఇలా ప్లేటు ఫిరాయించేశాడు...
రాళ్లు వేయాలని నిర్ణయించుకోవాలే గానీ...
గెలిచినా వేస్తారు.. ఓడినా వేస్తారు...
నాకు జ్ఞానోదయమైంది.. మరి వాడికో…?!
0 comments:
Post a Comment