అప్పటికి సమయం ఉదయం 4 గంటలు అవుతోంది. నిద్రలేమితో ఎర్రబడ్డ కళ్లతో దీర్ఘంగా ఆలోచిస్తున్నాను.. నిన్న సాయంత్రం నాకు తారసపడిన ఒక సంఘటన ఇలా ఎడతెగని ఆలోచనలకు బీజం వేసింది. అప్పటి నుంచి ఎంతగా ఆలోచించినా నన్ను నేను సమాధానపర్చుకోలేక సతమతమైపోతున్నాను. నిన్న సాయంత్రం ఎమ్మార్వో ఆఫీసులో నేను చూసిన ఆ దృశ్యం ఇంకా నా మనోఫలకం పైన కదలాడుతూనే ఉంది.ఆవిడ అప్పటికే రెండేళ్లుగా నష్ట పరిహారం కోసం తిరుగుతూనే ఉందట..
లక్ష రూపాయల నష్ట పరిహారంలో 10 శాతం కమీషన్ ముందుగానే ఇస్తేనే తప్ప ఫైలు కదలదంటాడు ఈ పెద్ద మనిషి...
తినే తిండి గింజలకే ఎదురు చూడాల్సిన పరిస్థితుల్లో ఉన్న ఆ దీనురాలు కాళ్లు పట్టుకున్నా ఈయన హృదయం (ఉందా?) కరగలేదు సరికదా, ప్యూనుగారితో వెళ్లగొట్టించాడు.
ఎవరీమె...
చూస్తే అమాయకురాల్లా ఉంది...
ఆమె ఆ పరిస్థితుల్లో ఎందుకుంది?
ఆ.. గుర్తుకొచ్చింది… డ్రైవర్ హరి భార్య ఈమె...
గుర్తుకురాని ముందు ఉన్న ఉత్సుకత ఇప్పుడు లేదు...
ములుగుకర్రలా గుచ్చుకునే పాత జ్ఞాపకాలు తప్ప...
ఎప్పటిలా వద్దనుకుంటూనే మరోసారి గతంలోకి జారుకున్నాను…
నేను ఓ మారుమూల గిరిజన తండాలో పుట్టి పెరిగాను. దళంలో చేరక ముందు నా పేరు సూరన్న, ఇప్పుడు క్రాంతి. చిన్ననాటి నుంచే అనేక కష్టాలు. కుటుంబ పరిస్థితులు, భవిష్యత్తు గురించిన ఆందోళన నన్ను కుదురుగా ఉండనిచ్చేవి కావు. నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమైపోయేవాడిని. అలాంటి రోజుల్లో నా మిత్రుడి ద్వారా దళంతో పరిచయమేర్పడటం, కుటుంబాన్ని చురకత్తుల లోకానికి వదిలి ఎర్ర జెండా చేతబట్టి దళంలో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి.
పదిహేనేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మలుపులు, మరెన్నో ఆటుపోట్లు...
మందుపాతరలు పేల్చడం, ప్రజల ఆస్తులైనటువంటి రైల్వే స్టేషన్లు, బస్సులు, టెలిఫోన్ ఎక్స్ఛేంజ్లను పేల్చివేయడం లాంటి ఎన్నో విధ్వంసకర చర్యల్లో పాలుపంచుకున్నాను...
ఇవన్నీ ఒక ఎత్తయితే.. స్వంత (?) పార్టీలో…
దేశంలోని మరే పార్టీకి తీసిపోని స్థాయిలో ఎర్రెర్రని పార్టీలోనూ గ్రూపులూ, కోవర్టుల వెన్నుపోట్లు, సానుభూతిపరుల ముసుగులో ఆప్యాయంగా విషాహారం వడ్డించే సంఘటనలు…! తమ చిందులతో, ఆవేదన, ఆవేశం కలగలిపి నింపిన గొంతుకలతో, ఎంతో మంది తల్లులకు కడుపుకోత మిగిలేలా నాలాంటి వేలాది యువకులను ‘సో కాల్డ్’ దళం, పోరాటం, సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా అడవుల్లో నడుస్తున్న పార్టీ ముగ్గులోకి దింపిన కొందరి మహామహుల పిల్లలు మాత్రం విదేశాల్లో సురక్షితంగా డాక్టర్గిరీలు చేసుకోవడం వంటివి నన్ను నిజంగానే కాంతిపథంవైపు ఆలోచింపచేసాయి.
బూటకపు ఎన్కౌంటర్లు...
సహచరుల హఠాన్మరణాలు...
ప్రతీకార చర్యలు - అనాథలై వీధులపాలవుతున్న కుటుంబాలు...
పార్టీ పుణ్యమా అని కలిగిన అక్షరజ్ఞానంతో చదివిన సాహిత్యం నాకు కొంత లోకపరిజ్ఞానాన్ని కూడా సంపాదించి పెట్టింది...
ఓ అవినీతి రాజకీయ నాయకుడి కోసం నేను మందుపాతర పేల్చితే, అతనితో పాటు ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ హరి, సెక్యూరిటీ గార్డులు, పిఎ లాంటివారు ఎందరో పోయారు...
నాయకుని జీవిత భాగస్వామో, కడుపున పుట్టిన పిల్లలో ఆ “సింపతీ ఓట్ల”తో మళ్లీ ఆ నియోజకవర్గం బై ఎలక్షన్లలో గెలిచి గద్దెనెక్కేస్తే...
అదే పేలుడులో మరణించిన దిగువ తరగతి ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబం తమకు రావలసిన నష్ట పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాయి...
ఒక పెళ్లాం సర్టిఫికేట్ అందించాలి.. ఆమె అతను ఉంచుకున్నది కాదు.. కట్టుకున్నదేనని నిరూపించుకునేందుకు...
ఒక పెళ్లాం సర్టిఫికేట్ అందించాలి.. ఆమె ఇంకా చావలేదు.. బతికే ఉన్నానని చెప్పుకునేందుకు...
ఎమ్మార్వో ఆఫీసుల్లో, ట్రెజరీ ఆఫీసుల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో చేతులు తడపాలి.. మొగుడు చచ్చి ముండ మోసినందుకు ప్రతిఫలంగా రానున్న ప్రభుత్వం అందించే కంటితుడుపు సాయాన్ని అందుకునేందుకు...
ఒకటా, రెండా ఇలా కంటి వెంబడి నీరు రప్పించే సంఘటనలు..ఒకరా, ఇద్దరా కార్యాలయపు మెట్లు ఎక్కలేక అలసిసొలసి నిస్సారంగా బతుకులు వెళ్లదీసేవారు...
ప్రజలు అంటే భూస్వాముల కబంధ హస్తాల్లో నలిగే పల్లె ప్రజలేనా..ప్రజలు అంటే కామాంధ కామందుల కర్కశ కౌగిల్లో నలుగుతున్న పల్లె పడతులేనా..ప్రజలు అంటే నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతన్నలు మాత్రమేనా...
మార్చలేనా ఈ కుళ్లిన సమాజాన్ని...
మార్చలేనా వీరి నుదుటి రాతలను...
మౌనంగా రోదించాను ఎన్నో రాత్రులు...
కుమ్మరి పురుగులా మెదడును తొలిచేస్తున్న ఆలోచనలు...
తల బ్రద్దలైపోతుందేమోనన్న అనుమానం...
కనీసం నా వల్ల అనాథలైన కుటుంబాలనైనా ఆదుకోవాలన్న దృఢ నిర్ణయానికి వచ్చాను...
మర్నాటి ఉదయమే జోనల్ కమాండర్‌కి కబురంపాను నేను పోలీసులకు లొంగిపోదలచుకుంటున్నానని..అప్పటివరకు నాపై విపరీతమైన ప్రేమ చూపిన సీనియర్లు, నన్ను సైతం ఆదర్శంగా తీసుకుని దేశాన్ని ఉద్ధరించేందుకు నాలాగే కుటుంబాలను త్యజించి ఆయుధ పోరాటంలో సమిధలయ్యేందుకు సిద్ధంగా ఉన్న కామ్రేడ్ సోదరులు నమ్మలేకపోయారు.. ఏవగింపుగా చూశారు… నాలో ఉత్తేజాన్ని కల్గించేందుకు విఫల ప్రయత్నాలు చేశారు.. కానీ నా నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో వారి (ప్రస్తుతం) దళం రహస్యాలను పోలీసులకు చెప్పకూడదన్న ఆంక్షతో నేను ఆ కీకారణ్యం నుంచి బయటపడేందుకు అనుమతించారు...
నాకు నేనుగా ఊహించుకున్న నాదైన ప్రపంచానికి వెలుగులందించే ఉద్దేశ్యంతో ఉదయించాను నేనే సూర్యుడినై...
ఇప్పుడు నాకే బంధనాలు, అడ్డంకులు లేవు,
వారం రోజుల తర్వాత...
జిల్లా ఎస్పీ కార్యాలయంలో భేషరతుగా లొంగిపోయిన నన్ను సాదరంగా జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించింది ప్రభుత్వం...
ఉండేందుకు ఇల్లు, బతికేందుకు పొలం, ట్రాక్టర్, నా తలకి కట్టిన వెల అంతా ఇక నాకే..కేవలం నెల రోజుల్లోనే నాకు రావలసిన ప్రభుత్వ సాయం నా ముంగిట వాలింది...
నవ్వుకున్నాను నేను నా దేశ దుస్థితిని చూసి...
నిజంగానే నవ్వుకున్నాను నేను నా దేశ దుస్థితిని చూసి ఏడ్వలేక..
ఈ రోజుకీ నా మూలంగా అనాథలైనవారు అభిమానాన్ని చంపుకుని అడుక్కుంటున్నారు...
అభిమానాన్ని కూడా చంపలేని, చంపుకోలేని మానధనులు నిస్సహాయంగా చావు కోసం ఎదురు చూస్తున్నారు...
మరి నాకు సీల్డ్ కవర్లో పెట్టి మరీ ఇచ్చారు పరిహారం...
మారణ హోమాన్ని ఆపినందుకా?ఏమో?
నేను పేల్చిన మందుపాతర మూలంగా చనిపోయినవారి కుటుంబ సభ్యులందర్నీ ఒకేసారి కలుసుకున్నాను..ఆ క్షణం.. నన్ను నేను పరిచయం చేసుకున్నాక.. వారి కళ్లల్లో ప్రతిఫలించిన భావాలకే శక్తి ఉంటే ఈ రోజు మీకు నా కథ చెప్పే అవకాశమే ఉండేది కాదు...
నేను వచ్చిన పని చెబుతూనే వారు మరింతగా అసహ్యించుకున్నారు...
అక్కర్లేదు పొమ్మన్నారు.. లేని శక్తిని కూడదీసుకుని కొట్టేందుకు మీదికొచ్చారు...
జీవితంలో ఎవరికీ, దేనికీ తలవంచని మొండివాడిగా పేరుపడ్డ క్రాంతి ఆరోజు లేడు...
చేసిన తప్పుకు పరిహారం చెల్లించేందుకు, పశ్చాత్తాపంతో కుంగిపోతున్న సాధారణ సూరన్న తప్ప...
కళ్ల వెంబడి ధారలుగా కారుతున్న కన్నీటి సాక్షిగా వారి కాళ్లు పట్టుకున్నాను...
ప్రభుత్వం ఇచ్చిన భూమి, ట్రాక్టర్, డబ్బును నిండు మనస్సుతో వారికి అందించాను...
నా వల్ల వారికి కలిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయలేకున్నప్పటికీ, వారి బ్రతుకులకో దారి
చూపించగలిగినందుకు ఓమేరకు ఆనందం కల్గింది.
నా బ్రతుకు గురించి నాకు చింత లేదు...
ఉన్న కండలు కరిగిస్తే ఈ ఏకాకిగాడి పొట్టకు ఇన్ని మెతుకులు దొరక్కపోవు...
ఏమంటారూ?