సమయం సరిగ్గా గుర్తు లేదు గానీ, నేను ఆఫీసు నుండి ఇంటికి చేరుకున్న కొద్దిసేపులోనే.. ఊరి నుండి మా అన్నగారు ఫోన్. అర్జెంటుగా, ఉన్నపళంగా కాకపోయినా 21వ తేదీ నాటికీ ఊర్లో ఉండాలని హుకుం జారీ చేసారు. విషయం ఏంటో చెప్పవయ్యా అంటే – మరిన్ని వివరాలకు చూస్తూనే ఉండండి టీవి9 అనేసి ఫోన్ పెట్టేసాడు.
ఈయనతో ఇదో తలనొప్పి.. ఏదీ పూర్తిగా చెప్పడు. మధ్యలో ఈ 21వ తేదీ అని డెడ్‌లైన్ ఏంటి చిరాగ్గా. ఆఫీసుల్లోనే కాదు, ఇంట్లోనూ డెడ్‌లైన్లు పెట్టేయడం మొదలెడితే ఇక బతికినట్టే మరి.
ఏదో ఈ మధ్యనే మా బాబాయికి మంచి బుద్ధి పుట్టి సన్ డిటిహెచ్ పెట్టించిన కారణంగా తెలుగు ఛానళ్లు అన్నీ చూడగలుగుతున్నాము. ఇక తప్పుతుందా అనుకుంటూ తక్కిన పనులన్నీ పక్కనెట్టేసి రిమోట్ చేతబట్టాను.
కింద స్క్రోల్ అవుతుండే వార్తల నుండి పైన న్యూస్ రీడర్ వివరించే అన్ని వార్తలను ఓ అరగంట పాటు క్షుణ్ణంగా చదివి, చూసేసిన తర్వాత అర్థమైంది అసలు విషయం.
ఈ 30 నిమిషాల్లో నేను తెలుసుకున్నది ఏమిటంటే -
22వ తేదీన “సునామీ” రాబోతుందని. అప్పటికే ఈ విషయంతో బోల్డన్ని ఫార్వార్డెడ్ మెయిళ్లు, ఎస్ఎంఎస్‌లు చూసేసిన ఫలితంగా నేనేమీ అంత కంగారు పడకపోయినా ఊరిలో మనోళ్లు భయపడిపోయారన్నమాట. కాసేపు నాలో నేనే నవ్వేసుకుని హాయిగా సిస్టమ్ ముందు సెటిలైపోయాను.
పిన్ని ఆఫీస్ నుండి కాస్త ఆలస్యంగా ఇంటికి చేరుకుంది. వచ్చీ రాగానే మొదలు. “నీ ప్రాజెక్ట్‌లు ఏవైనా ఉంటే కాస్తా త్వరగా ముగించేందుకు ప్రయత్నించు” అని ఆర్డర్ పారేసింది. ఆదివారం ఏదైనా పిక్నిక్ ప్లాన్ చేస్తుందేమోనని నేను – “నేనీ సండే ఎక్కడికీ రాలేను పిన్నీ.. పైవారం ఆలోచిద్దాంలే” అన్నాను. “ఇప్పుడు నిన్ను ఆదివారం ఎక్కడికీ బయల్దేరమనలేదు గానీ మంగళ, బుధవారాలు మాత్రం లీవ్ పెట్టేయ్” అందావిడ. అప్పటికి గానీ అర్థం కాలేదు నా బుర్రకు. అన్నగారి ఫోన్ చాతుర్యం. ఆయన చెబితే ఎట్లాగూ నేను విననని ఫిక్స్ అయిపోయి నేరుగా పిన్నమ్మ దగ్గరే ఇరికించేసాడు.
ఓ పక్కన ఈవిడ మాట్లాడేస్తూనే ఉంది -
“మాకయితే అన్నీ అయిపోయినాయి చిన్నా, నీకు ఇంకా బోలెడు భవిష్యత్తు ఉంది. రిస్క్ ఎందుకు చెప్పు – మరేమీ మాట్లాడకుండా నువ్వు ఊరెళ్లు…” ఆమె గొంతులో కొంత భయం తొంగిచూస్తూనే ఉంది. ఫోన్‌లో గాంభీర్యం ముసుగున మా అన్న తన గొంతులో ఆందోళన ధ్వనించకుండా జాగ్రత్తపడగలిగాడు గానీ, ఈమెకా టెక్నిక్‌లు తెలియవాయే. నాకు వాళ్లను చూసి, నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఇక అమ్మ ఎలాంటి ఆలోచనల్లో తలమునకలయ్యిందో ఆలోచించాలంటేనే భయంగా ఉంది. వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేయాలని డిసైడ్ అయ్యి ఫోన్ చేసాను – మా అన్నకి.
ఎప్పుడూ లేనిది మా అన్న మొదటి రింగ్‌కే కాల్ అటెండ్ చేసాడు. సమస్య తీవ్రతకు ఇదొక నిదర్శనం.
“అసలు ఈ గొడవేంటి బాబూ” గొంతులో కొంత విసుగును ప్రదర్శించాను.
“నీకేం తెలియదులేరా.. అయినా ఇప్పుడు నీకు అక్కడ అంత కొంప మునిగిపోయే పనులేంటి, ఈ ఎంక్వయిరీలేంటి..” ఆయన కూడా ఏమాత్రం తగ్గలేదు. నాకు అన్న కదా…
“అలా కాదన్నా.. ఇప్పటికిప్పుడు పెండింగ్‌లో ఉండే పనులన్నీ ముగించాలంటే మాటలా.. అవతల ఆఫీసులో లీవ్ దొరికేది కష్టమాయె. తెలుసుగా, ఈ మధ్యనే హర్షగాడూ హ్యాండిచ్చేసి బెంగుళూర్ జంపైపోయాడు..” ఈసారి కాసింత మర్యాద కనబర్చాను.
“ఆ ఆఫీస్ కాకుంటే మరొకటి.. ఆ ఒక్క రోజు గడిస్తే చాలురా.. వెంటనే ఆ నెక్స్ట్ డే బయల్దేరెయ్.. నిన్ను ఎవరూ ఇక్కడే ఉండిపో అనట్లేదు..” ఆయన కూడా కాస్తా తగ్గినట్లున్నాడు.
ఇక అటు నుంచి నరుక్కు వద్దామనిపించింది..
“సరే అయితే – వస్తాలే” అన్నాను.
“మంచిది.. ఉంటా అయితే..” బై చెప్పేసాడు మా అన్న..
“ఒక్క నిమిషం.. ఒక్క నిమిషం.. హలో”…. గట్టిగానే అరిచా.
“ఏంట్రా…” ఆయన మాత్రం బిజీనే ఎప్పుడూ.
“సరేగానీ… సునామీ ఖచ్చితంగా 22వ తేదీనే వస్తుందంటావా?” సందేహంగా అడిగాను
“అవునట”..
“అంత ఖచ్చితంగా చెప్పారంటే సైంటిస్టులు రీసెర్చ్ చేసి మరీ చెప్పుంటారేమో” అన్నాన్నేను.
“అలాంటిదేమీ లేదు.. కానీ ఆ రోజు సునామీ వస్తుందట..” ఘంటాపథంగా చెప్పేసాడు.
నాక్కావలసిన పాయింట్ అదే..
“ఎవడో ఎక్కడో గుడ్డిగా ఏదో అంటే.. దాన్ని పట్టుకుని ఈ టీవి వాళ్లు ఏదో యాగీ చేస్తే నువ్వు దాన్ని నమ్మేసి నన్ను వచ్చేయమంటావా?” మళ్లీ ఫామ్‌లోకొచ్చేసా.. మనదే అప్పర్‌హ్యాండ్ ఇప్పుడు.
“అలా కాదురా. ఉత్తినే టీవీల్లో రాదుగా.. ఏదో ఉండే ఉంటుంది” అవతల వైపు ఇదివరకు ఉన్న ఫోర్స్ లేదు.
“ఇప్పుడు నేను మా మేనేజర్ గాడికి ఫోన్ చేసి – అయ్యా.. 22వ తేదీన సునామీ వస్తుందని టీవీల్లో వచ్చిన కారణంగా, లీవ్ శాంక్షన్ చేయ్యండి మహాప్రభో.. నేను మా ఊరికి పారిపోతాను – అని మొత్తుకోవాలా?” వీలైనంత వెటకారం రంగరించాను నా డైలాగులకి.
“నువ్విక్కడ మా వైపు నుండి ఆలోచిస్తే అర్థం అవుతుందిరా మా బాధ” ఆయన ఘాటైన సెంటిమెంట్ అద్దేశాడు.
“అలా కాదన్నా.. వాళ్లకేదో ఒక సంచలనం కావాలి. తద్వారా టిఆర్‌పి రేటింగులు పెంచుకోవాలి. యాడ్‌లు కొట్టేయాలి.. అంతే.. ఆ ఏకైక లక్ష్యంతో పని చేస్తారే తప్ప, వాళ్లు చెప్పేటట్టుల మెరుగైన సమాజం కోసం మాత్రం కాదు.. వాళ్ల బ్యాంక్ బ్యాలెన్సులను మెరుగుపరుచుకునేందుకోసం” వ్యాపార సూత్రాలను వల్లించాను.
మళ్లీ నేనే కొనసాగించాను -
“ఒకవేళ సునామీ వచ్చిందనుకో, మేము ముందే ప్రజలను, ప్రభుత్వాన్ని హెచ్చరించామోచ్.. అంటూ లబలబలాడతారు. ఎంతమంది పోయారో, ఎన్ని ఇళ్లు నాశనమైపోయాయో లెక్కగట్టి ఇదంతా ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యమే తప్ప మరొకటి కాదని వాదిస్తారు. ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని పనీపాటా లేని నలుగురు పెద్దలతో టీవీల ముందు చెప్పిస్తారు.. అంతే.. ఖతం” ఆయాసంతో కాస్తా ఆగాను.
“ఇంతకీ నువ్వు చెప్పొచ్చేదేమిటీ?” ఓపిక నశించినట్లుంది మహాశయుడికి.
“నిరాధార కథలను, కథనాలను నమ్మవద్దని.. ఐనా నాకు తెలీక అడుగుతాను. కర్మ సిద్ధాంతాన్ని చక్కగా ఒంటబట్టించుకున్నవాడివేగా నువ్వు. మొన్నామధ్య మనూళ్లో తుఫాన్లు ముంచెత్తబోతున్నాయని వాతావరణ శాస్త్రజ్ఞులు నెత్తీనోరు కొట్టుకుని చెప్పారయ్యా.. అక్కడ ఉండవద్దు నా దగ్గరకు వచ్చెయ్యమని పోరితే నువ్వు వచ్చావా.. “… ఏది ఎక్కడ ఎలా జరగాలని వ్రాసి పెట్టి ఉంటే అది జరుగుతుందని నా బుర్ర తినేసి, పోవాలని నుదుటిన వ్రాసి ఉంటే ఎక్కడ దాక్కున్నా పోతామని, చెత్తాచెదారం మాట్లాడేసి ఇప్పుడేమో ఇలాంటి చెత్త టీవీ కథనాలను చూసి నన్నక్కడికి పారిపోయి రమ్మంటావా?”…
ఆవైపు నుండి సమాధానం లేదు..
“అందుకే బాబూ.. మనదాకా వస్తేగానీ అర్థం కాదంటారు.. ఐనా నేనేమీ నీలా కాదులే.. నీ కోసం కాకపోయినా, అమ్మ కోసమైనా వస్తాను. ఆమెనేమీ కంగారుపడవద్దని చెప్పు. అయితే నేనొక్కడినే కాదు.. పిన్ని, బాబాయి కూడా. ఇకపై నా దగ్గర కర్మ సిద్ధాంతాలు వల్లించకు.. ”
ఫోన్ కట్ చేసేసి, పిన్ని వైపు చూసాను.
ఆమె ఓ నవ్వు నవ్వేసి తన ఫోన్ చేతిలోకి తీసుకుంది.. మరి ఊరెళ్లాలంటే బాబాయి కూడా ఆఫీసుకు నామం పెట్టాలిగా..!!
0 comments:
Post a Comment