Sunday, May 10, 2009

“శ్రీ” మథనం


అసలే విద్యుత్తు ఉండదు
ఉన్నా అందులోనూ కోతలు
రాత్రుళ్లు మోటారు పంపు దగ్గర కాపలాలు
కరెంటు - రైతు దాగుడుమూతలు
ఎప్పుడూ “అవుట్” అయ్యి “పోయేది” రైతే !!

తడిసీ తడవని పైరు
నకిలీ విత్తనాలు
రైతులపై తప్ప పంటల్లో
పురుగులపై పని చేయని మందులు !!

వానలు పడవు
జలయజ్ఞాలు ఫలించవు
కృత్రిమ వాన కరుణించదు
కప్పల పెళ్లిళ్లు కనికరించవు !!

పట్నవాసులేమి చేయగలరు
నేల విడిచి నింగికెగుస్తున్న
బియ్యం ధరను నిలువుగుడ్లతో చూడడం తప్ప !!

ఆకాశ గంగమ్మపై ఆశ ఎలాగూ పోయింది
ఇక అంతంత మాత్రంగా మిగిలింది
ఎండిన నదుల అట్టడుగున దాక్కున్న గంగమ్మే !!

ఇంతలో..
నదుల నీరు లేదు, నన్నడిగే వాడూ లేడు అంటూ
బయలుదేరారు "ఇసుకాసురులు" -
మేము లేమా స్వాహా చేసేందుకు అంటూ !!

నిర్భీతిగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా
ట్రాక్టర్ల లోడులతో కప్పెట్టేస్తున్నారు….
భారతదేశ వెన్నెముకను
మనకు అన్నం పెట్టే రైతన్నను !!

1 comments:

పరిమళం said...

కళ్ళకు కట్టినట్టు రాశారు ...
రైతన్నల ఇక్కట్లు ..........