Thursday, June 12, 2008
నా రైలు వెళ్లిపోయింది…!
కావాలని నేనెప్పుడూ ఏదీ చేయలేదు..
(అది చదువైనా, తిరుగుళ్లయినా, ఉద్యోగాలైనా)
కావాలనుకున్నదేదీ నాకు దక్కలేదు..
(ఇది ఇక్కడ ప్రస్తావించడం తగదేమో)
నన్ను కావాలనుకున్న వారికెవరికీ నేను అందుబాటులో లేను..
(ఉద్యోగరీత్యా పరాయి రాష్ట్రంలో అమ్మకు దూరంగా ఉండటం మాత్రమే కాకపోవచ్చు)
నేను కావాలనుకున్నవారెవరూ నా కనుచూపు మేరలో లేరు..
(ఇది గానీ చెప్పానంటే గొడవలైపోతాయంతే)
జరిగిపోయిన రణానికి కారణాలను, అయిపోయిన ఎన్నికలపై సమీక్షలను వ్రాయడం ఎంత టైమ్ వేస్టో తెలిసిందే అయినప్పటికీ అనుక్షణం నేనున్నానంటూ లోనుండి తన్నుకొచ్చే ఆ బాధతో కూడిన విచారం వల్ల కలిగిన దిగులు ఉంది చూశారూ.. దాన్ని ఆపడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు.
అవసరం కొద్దీ అన్ని పురాణాలను, వేదాలను, సామెతలను మనకనుగుణంగా వాడేసుకోవడం ; దాని మూలంగా ఏదైనా పొరపాటు సంభవించినప్పుడు, ఎవరైనా మనల్ని వేలెత్తి చూపినప్పుడు - నేరం నాది కాదు - అంటూ తప్పించేసుకోవడం అలవాటైపోయిన సగటు జీవినే కనుక నేనూ ఈ సందర్భంగా నాకు తోచిన ఓ వాక్యాన్ని మీతో పంచుకుంటున్నానన్నమాట.
కష్టాలను పంచుకుంటే తరిగిపోతాయి, సుఖాలను పంచుకుంటే రెట్టింపు అయిపోతాయి.
నాలుగేళ్ల క్రితం నేనూహించిన, నేను తెద్దామనుకున్న విప్లవం, నేను ఎంతగానో ప్రయత్నించి భంగపడిన ఓ మహా కార్యం ఈ మధ్యే మా ప్రజా మండలిలో విజయవంతంగా చోటు చేసుకుంది. ఏ మాటైతే మా సభ్యుల నోట వెంట వస్తుందని అహర్నిశలూ శ్రమించానో, ఏ ఒక్క చిన్న అనుమతి కోసం నిరంతరం తపించానో, ఉపవాసాలు, మౌనవ్రతాలు, జాగరణలు, బహిష్కరణలు లాంటి విభిన్న దీక్షలకు పూనుకున్నానో, అది అలాంటి మార్పు ఇప్పుడు జరిగింది.
కానీ,
నేనెక్కవలసిన రైలు ఎప్పుడో వెళ్లిపోయింది..!
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment