Sunday, April 5, 2009

నేనూ.. మధూ.. చిన్నా!!


“ఈ రోజూ గొడవ పడ్డారేమో”

నాలో నేననుకున్నానో, పైకే అనేసానో. అప్పటికే యుద్ధం ముగిసినట్లుంది. ఇల్లంతా భరించలేనంత నిశ్శబ్దం. ఎవరి పనుల్లో వారు ఉన్నారు - నిశ్శబ్దంగానే, చప్పుడు చేయకుండా, కనురెప్పలు కదిలినా వినిపిస్తుందనుకున్నాడేమో మా అబ్బాయి కళ్లార్పకుండా వీక్లీలోని అక్షరాలను తరుముతున్నాడు. వాడి ఆలోచనలు ఎక్కడున్నాయో గానీ, తల అయితే పుస్తకంలోనే ఉంది.

మా ఆవిడ.

తెలిసిన విషయమే.

తను ఎవరితో గొడవ పడినా వంట గదిలోని పాత్రలతో మాట్లాడేస్తుంటుంది. కాలికి తగిలే పీటపై చిటపటలాడుతుంది. చీపురును ఛీ ఛీ అంటుంది. నీకు బుద్ధిలేదు అని నా కారుపై విరుచుకు పడుతుంది.

అలవాటైపోయిన విషయాలే ఇవన్నీ.

అయితే అంతుపట్టని విషయమల్లా, ప్రస్తుత సమస్య ఏమిటనే.

నాకు నేనుగా వాళ్ల వ్యవహారాల్లో వేలు పెట్టడం మానేసాను. ఎవరి అభిమానాలు వారికుంటాయిగా. నేనూ మినహాయింపును కాదు. భార్యాపిల్లల విషయాల్లో అభిమానాలు, ఆత్మాభిమానాలు ఏంటయ్యా అని మీరు అనుకోవచ్చు. గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా నేను ఉచిత సలహాలు ఇవ్వడం, మధ్యస్థాలు చేయడం మానుకున్నాను.

ఉరుము ఉరిమి ఉరిమి మంగళంపై పడ్డట్లు వాళ్లిద్దరూ కలిసి నాతో చెడుగుడు ఆడేస్తారు. అబ్బాయి అలా తయారైనదానికి నేనే కారణమంటుంది భార్యామణి. నన్నే విషయంలోనూ సపోర్ట్ చేయరే అని మూతి ముడుచుకుంటాడు నా ముద్దుల కొడుకు.

ఇక ఈరోజు భోజన కార్యక్రమానికి సెలవు ప్రకటించేసినట్లే. వీరిద్దరి తగవుల పుణ్యమేమో గానీ, ఏకాదశి, అమావాస్యలకే కాకుండా ఇలాంటి అకాల ఉపవాసాలకు అలవాటు పడిపోయాను. కాసిని మంచినీళ్లు తాగి, సిస్టమ్ ముందు సెటిలైపోయాను. పర్సనల్ మెయిళ్లు ఏవైనా వచ్చాయేమోనని చెక్ చేసుకోవడానికి. అంత ముఖ్యమైనవి ఏవీ లేవు, మా అబ్బాయి కాన్వెంట్ అడ్మినిస్ట్రేటర్ నుండి తప్ప. ఈ ఇ-మెయిలే అమ్మా కొడుకుల గొడవకు మూలకారణమై ఉండవచ్చు.

అయినా మనవాడి ప్రోగ్రెస్ కార్డు, బిహేవియర్, కాండక్ట్ గురించి ఎప్పుడూ చింతించాల్సిన అవసరం లేదు, ఈసారేమైనా తిరకాసు జరిగిందా చెప్మా అనుకుంటూనే మెయిల్ ఓపెన్ చేసాను. తీరా చూస్తే, మా వాడి స్కూల్లో డార్జిలింగ్‌కు టూర్ ప్లాన్ చేస్తున్నారట. ఆసక్తి గల పిల్లలు పేర్లు నమోదు చేసుకోండి అంటున్నారు.

మా మధుకి కొడుకును ఒంటరిగా అంతంత దూరం పంపడం సుతారమూ నచ్చదు. తోటి పిల్లలు, టీచర్లు తోడు ఉంటారుగా అంటే వినదు. ఈ విషయంలో తను ఇప్పటివరకు రాజీ పడలేదు, ఇకపై రాజీ పడుతుందన్న నమ్మకమూ నాకు లేదు. మా వాడిపై తనకుండే ప్రేమ అలాంటిది.

కన్న తండ్రినైన నన్నే ఓ మాట కూడా అననీయదు. వాడినిక ఎవరూ ఏమీ అనరు. అలాగని అతి గారాబంతో వాడినేమీ పాడు చేయట్లేదు. తాను ఓవైపు ఆఫీస్ పనులు చూసుకుంటూనే, వాడి చదువు, ఆరోగ్యం విషయాల్లోనూ ఎంతో శ్రద్ధగా ఉంటుంది. నేను ఈ మాత్రం నిశ్చింతగా ఉన్నానంటే అందుక్కారణం నా మధు.

వాడికి ఎన్నో విషయాల్లో సపోర్టుగా ఉండే తను ఇందులో మాత్రం బద్ధ శత్రువు అయిపోతుంది. వాడికి అసలు బైట ప్రపంచమే తెలియదు. వాడి పుట్టినరోజుకి సకుటుంబ సపరివారంగా వెళ్లే తిరుమల తప్ప. బంధువుల ఇళ్లకు వెళ్లినా, వాడి స్కూల్, మా ఇద్దరి ఆఫీసుల పేర్లు చెప్పి ముచ్చటగా మూడు రోజులైనా గడిపింది లేదు. సమ్మర్‌లోనూ వాడిని ఒంటరిగా వాళ్ల మేనత్త వాళ్లింటికీ పంపదు. మా అక్కయ్య కూడా అప్పుడప్పుడు చాటుగా బాధ పడుతుంటుంది.

నా ఆలోచనల్లో నేనుండగానే అమ్మా కొడుకులిద్దరూ నా గదిలోకి దూరారు.

“విషయం తెలిసిందిగా మీకు.” ఉపోద్ఘాతాలు కూడా అనవసరం కాబోలు.

“ఊ”

“మీ అబ్బాయి ఈ సంవత్సరం మరీ పట్టుబడుతున్నాడు, డార్జిలింగ్‌కు వెళ్లి తీరాల్సిందేనట” వాళ్లు కొట్టుకున్నప్పుడు మాత్రం వాడు నా కొడుకైపోతాడు ఈవిడకి. మిగతా సందర్భాల్లో నెత్తిన పెట్టుకొని ఉంటుంది.

మధ్యలోనే మా వాడు అందుకున్నాడు..

“నా ఫ్రెండ్స్ అందరూ వెళుతున్నారు నాన్నా.. నా కంటే చిన్నవాళ్లు కూడా.. ఇంతవరకు నేనే ఊరికి వెళ్లలేదు. నా ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా సెలవుల్లో ఊటీ, ఢిల్లీ వెళ్లి వస్తుంటారు తెలుసా. నాకు మాత్రం అమ్మమ్మ, నాన్నమ్మ ఊర్లు తప్పితే ఏమీ తెలియదు. నేను డార్జిలింగ్ చూడాల్సిందేనంటే అమ్మ ఒప్పుకోనంటోంది” ఇంగ్లీష్ మీడియం చదువులైనా అమ్మా నాన్న సంస్కృతే మధుకి, ఆ మాటకొస్తే నాకు ఇష్టం. మమ్మీ డాడీలను గుమ్మం తొక్కనివ్వలేదు.

“చివరి తేదీ ఎప్పుడు” అడిగాను

వాడి మొహంలో ఒక్కసారిగా వెలుగు - “ఎల్లుండే” ఠకీమని జవాబు

మధు మొహం ఎలా ఉంటుందో నేనూహించగలను - అందుకే చూడలేదు.

“రేపు ఉదయాన చెప్తాను గానీ, నువ్వు వెళ్లి చదువుకో” అన్నాను. మరొక మాటకు అవకాశం లేకుండా, ఇంకాస్సేపు అక్కడ ఉంటే ఏమైపోతుందోనన్నట్లు వాడు వెంటనే వెళ్లిపోయాడు.

”మధూ”

ఆ వైపు నుంచి జవాబు లేదు..

”పిల్లలకు బయట ప్రపంచం తెలియడం అవసరం కదా. వాడి ఫ్రెండ్స్ అంతా టూర్ వెళ్లి వచ్చి, అక్కడి వింతలు, విశేషాలు చెబుతుంటే, మనవాడు బిక్కమొహం వేసుకుని వినాల్సి వస్తుంది. నా చిన్నతనంలో అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి కూడా. మన అబ్బాయి అలా బాధపడటం అవసరమా చెప్పు..”

మీరు, మీ అబ్బాయి మంచివాళ్లే. అయితే నేనేనా మీ ఆనందానికి అడ్డు వచ్చేది అంటూ ముక్కు చీదలేదు తను. నా గురించి నాకంటే, తనకే బాగా తెలుసు.

“అక్కడ ఎలాగుంటుందో ఏమిటో, అంతమంది పిల్లల్లో మన చిన్నా గురించి ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. అందులోనూ ఇప్పటి వరకు వాడిని వదిలి వారం కాదు కదా, ఒక్క రోజూ ఉండలేదే. మీరే చెప్పండి - నిద్ర లేచి వాడిని చూడకుండా మీరు మరొక పని చేస్తారా, చేసారా?”

నిలదీసినట్లు కాకుండా, నెమ్మదిగానే అడిగింది. నిజమే. ఆలోచించాల్సిన విషయమే అనిపించింది నాక్కూడా. నెమ్మదిగా వెళ్లి చిన్నాగాడి గది తలుపు తట్టాను. మేల్కొన్నట్లే ఉన్నాడు.

”నువ్వు ఫ్రెండ్స్ కోసం వెళ్తానంటున్నావా, డార్జిలింగ్ చూడాలని ఉందా”

”డార్జిలింగ్ చూడాలని ఉంది, అంతే”

”సరే”నని నా గదికి వచ్చేసాను.

మధు మా మాటలు వింటూనే ఉంది.

”చిన్నా డార్జిలింగ్ చూడాల్సిందేనంటున్నాడు. వాడి కోరికలోనూ న్యాయం లేకపోలేదు మధూ. వాడికి డార్జిలింగ్ చూడాలని ఉంది, నీకు వాడిని ఒంటరిగా పంపడం ఇష్టం లేదు. ఓ పని చేద్దాం. వాడితో పాటు మనమూ వెళ్దాం. స్కూల్ బస్‌లో కాదులే, మన కార్‌లోనే.. ఏవంటావ్” అన్నాను.

”బడ్జెట్..?” ఆర్థిక మంత్రి అవతారం ఎత్తింది.

“ఫర్లేదులేవోయ్.. నేను చూసుకుంటాలే”

ఈయనేనా ఈ మాటలంటోంది..

ఇంకా అపనమ్మకమే తన కళ్లల్లో.. అనవసర ఖర్చులకు ఆమడ దూరం నేను. ఆశ్చర్యంగా చూస్తూనే నిద్రకు ఉపక్రమించింది తను.

”ఇది అనవసరమైన ఖర్చు కాదు మధూ.. నా బిడ్డ కోరిక తీర్చడం నాకు అనవసరం అవుతుందా చెప్పు..”

నేను నడుము వాల్చాను.. సంతృప్తిగా..

నిజమే.. ఆనందంగా ఉన్నది నేను ఒక్కడినే కాదు..

నా పక్కన పడుకున్న నా మధు, తలుపు చాటున నిలుచున్న మా చిన్నా కూడా..

0 comments: