Sunday, April 5, 2009

ఆనందంగా ఉన్నావా?



ఈ మధ్యనే చాలా రోజుల తర్వాత మా ఊరికి వెళ్లాను.

సాధారణంగా మా ఇంట్లో చుట్టాలు, ఇరుగుపొరుగుల సందడి ఎక్కువ. అందులో మనం (!!) వెళ్లేసరికి, విషయం తెలిసినవారు వచ్చి పరామర్శించి పోతుంటారు. కొందరితో తప్పనిసరై మాట్లాడాల్సి వస్తే (అంటే చెప్పిందే చెప్పి, అడిగిందే అడిగే టైమ్ పాస్ శాల్తీలన్నమాట), చాలా మందితో ఇష్టంగా మాట్లాడేస్తుంటాను.

అసలు నా గొంతులోనే ఏదో తెలీని శక్తి ఉంటుంది అని మా పిన్నమ్మ అంటే, ఆ మాత్రం తెలియదా - ఆ తెలియని, కనిపించని శక్తి పేరే “ప్రేమ” అని మా అత్తమ్మ అంటూ ఉంటుంది.

ఏంటీ ‘శ్రీచరితం’లోనూ ఈ ఆత్మ స్తుతి (సుత్తి) అనుకుంటున్నారా?

సరే అయితే..

ఆ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది.
ఎప్పుడో గానీ కనిపించని మా నాన్న ప్రియ మిత్రుడు, మేమందరం ఇష్టపడే మా పార్థసారథి మావయ్య మా ఇంటికి వచ్చారు. మా నాన్న సమకాలీనుడు, సహోద్యోగి. సుఖాల్లోనే తోడుండే కొందరిలా కాకుండా, మా కష్టాల్లోనూ ఆయన మా వెంట ఉన్నారు. ఏమాత్రం కల్మషం, స్వలాభాపేక్ష లేని మనిషి.

“బాగున్నావా బాబూ..”
వృద్ధాప్యం వల్ల కాబోలు, గొంతు కొంచెం కంపిస్తోంది.
“బాగున్నా మావయ్యా.. మీరు..”
“బాగున్నానంటే..”
అయితే ఈ అలవాటు ఇంకా పోలేదన్నమాట.. ఎదుటి మనిషి చెప్పేది పూర్తి కాకుండానే మరో ప్రశ్న తయారు…
“నాకేం మావయ్యా.. ఆనందంగా ఉన్నాను.”
“మరి నీపై ఆధారపడినవారు”
“అదేంటి కొత్తగా. నాపై ఆధారపడినవారు ఎవరన్నారు. నాలుగురాళ్లు సంపాదించేంత మాత్రాన కుటుంబమంతా నా మీదే ఆధారపడి ఉన్నారని నేననుకోవడం లేదు మావయ్యా.”
“సరే బాబూ.. నీతో కలిసి ఉన్నవారి సంగతి”
“నాతో కలిసి ఉన్నవారంటే?”
ప్రశ్నకు ప్రశ్నే జవాబుగా ఇచ్చేంత చనువు ఉంది నాకు. అప్పట్లో మా నాన్నకు నచ్చంది అదే. స్నేహితుడు చిన్నతనంగా అనుకుంటాడేమోనని ఈయనే అనుకునేసి, నా వాగ్ధాటికి అడ్డుపడేవాడు మా నాన్న.
“నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ స్నేహితులు, సహోద్యోగులు ఎవరైనా కావచ్చు.”
“అందరూ ఆనందంగా ఉన్నారు మావయ్యా.. ఇంతకీ మీ సంగతి ఏంటి?”
చురక అంటించాననుకున్నా.
“నీతో ఉన్నవారందరూ ఆనందంగా ఉన్నారా?”
“అందరూ ఆనందంగా ఉన్నారు”
“అందరునా?”
అసలేంటి ఈయన అనుకుంటూనే
“అందరూ మావయ్యా.. అందరూ ఆనందంగానే ఉన్నారు”
నా గొంతులో ధ్వనించిన ఒకింత అసహనాన్ని పసిగట్టారేమో.. ఆయన కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. మళ్లీ తేరుకున్నారు.

“అలా కాదు బాబూ.. మరి నువ్వు ఆనందంగా ఉన్నావా?”
“మావయ్యా.. నేను, నాతో ఉన్నవారు, నా స్నేహితులు, నా సన్నిహితులు, నా సహోద్యోగులు అందరూ బాగున్నారు మావయ్యా.. ఏమైంది, నీ విషయాలు చెప్పవేంటి, అత్తయ్య, మధు ఎలా ఉన్నారు?”
“వాళ్ల సంగతి తర్వాత బాబు. నీ గురించే నా ఆలోచన”
“అందరూ ఆనందంగా ఉంటే, నేను ఆనందంగా ఉన్నట్లేగా మావయ్యా.”

“కాదు బాబూ.. నువ్వు ఆనందంగా ఉన్నది నిజమై ఉండదు”
ఈయనేంటి మరిచిపోయేందుకు ప్రయత్నిస్తున్న తీపి జ్ఞాపకాలను పనిగట్టుకుని తవ్వేలా ఉన్నాడే.
“బాబూ.. నువ్వు ఆనందంగా ఉన్నాననుకుంటున్నావేమో.. ఒకసారి ఆలోచించి చూడు”
“ఇప్పుడా విషయాలన్నీ ఎందుకులే మావయ్యా.. ”
“ఏవో విషయాలు కాదు. ప్రస్తుత విషయాలే. నువ్వు ఆనందంగా ఉన్నావు అనుకుంటూ, నీ వారి కోసమో, నీతో కలిసి ఉన్నవారి కోసమో ఇప్పుడు నువ్వు అనుభూతించాల్సిన కొన్ని అనుభవాలను కోల్పోతున్నావురా. చూడు - నాకు తెలుసు కొన్ని కష్టాలు. నిరంతరం ఎవరో ఒకరి కోసం నీ సంతోషాలను, సరదాలను కట్టిపెట్టేసి, ఈ వయసులో అనుభవించాల్సిన కొన్ని సరదాలను కోల్పోతున్నావేమోరా. నేను, మీ నాన్న చేసిన తప్పులనే నువ్వు మళ్లీ చేస్తున్నావేమో.. ఆలోచించు బాబూ.”

బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. గుమ్మం దాకా వెళ్లి, మళ్లీ తిరిగి -

“ఒకటి గుర్తుంచుకో..
నువ్వు ఆనందంగా ఉన్నావు అంటే, నీతో ఉన్న ప్రతి ఒక్కరినీ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆనందంగా ఉంచలేవు ; అలాగని వారంతా నీపై పగ పట్టారని నేను చెప్పను. నీ బాగు కోసమో, భవిష్యత్ కోసమో వారికి తోచిన సలహాలిస్తూ, నిన్ను, నీ ఆనందాన్ని పరిమితం చేస్తుంటారు. నీ ఆలోచనా దృక్పథం, ఆలోచనా సరళి వారికి అంతు పట్టకపోవచ్చు. బిడ్డ ఏమైపోతాడేమోనన్న బెంగ కావచ్చు.

అలాగే నీతోటివారందరినీ సంతృప్తిపరుస్తూ, ఆనందింపజేస్తున్నావంటే, నువ్వు కనీసం కొన్ని ఆనందాలనైనా కోల్పోతుంటావు.

గడిచిపోయిన కాలం తిరిగి రాదురా.
ఎంతకాలం బతుకుతామో తెలియదు. రెండు రోజుల తర్వాత ఎలా ఉంటామో తెలియదు.
మనకంటూ ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్రా.
దురలవాట్ల వెంటపడకుండా, నీ వయసులో నీకుండే చిన్న చిన్న సరదాలను తప్పకుండా అనుభవించు.
లేకుంటే,

పోలికల్లోనే కాదు, జీవన శైలిలోనూ నువ్వు మీ నాన్నవే అవుతావు!!”

0 comments: