Sunday, April 5, 2009

నువ్వు మాత్రం ఎందుకు?



నీకసలు మతి ఉందా
ఎన్ని సార్లు చెప్పినా మారవా
అసలెవరు నువ్వు..
ఎందుకిలా ఎండనకా, వాననకా నా వెంట పడి విసిగిస్తావ్
నీకు నా గురించి తెలియదు

ఇదేంటి
ప్రేమా, ఆరాధనా
నేను తింటేనే తింటానంటావ్
నేను తాగితే తాగుతుంటావ్
అసలు నీ లోకంలో నేను తప్ప మరొకరు లేరా

ఆ..
నీ బలహీనత నాకు గుర్తుందిలే..

చీకటి అంటే చచ్చేంత భయం నీకు
అప్పుడప్పుడూ నిన్ను తప్పించుకోవాలంటే నేనదేగా చేసేది
కానీ, కాసింత వెలుతురుంటే చాలు
చటుక్కుమని ప్రత్యక్షమైపోతావ్

నా సుఖాల్లో వెంటే ఉన్నావు
నా కష్టాల్లోనూ తోడుగా ఉన్నావు
నేను చేసే పాపపుణ్యాల్లో నీకు భాగముందిగా
మరి నేనేమైనా పుణ్యం చేసానా అనేది ఎప్పటికీ శేష ప్రశ్నే

మరి..
ఎవరున్నారు ఇంతలా
నా వెంట నువ్వు తప్ప
రక్త సంబంధీకులా
స్నేహితులా
అధ్యాపకులా
అధికారులా

ఐనా..
నేను నిన్ను ఎప్పుడూ నిర్లక్ష్యం చేస్తూనే వచ్చాను
అసలు ఈ రోజేగా
నీతో మాట్లాడటం
నువ్వున్న దిక్కుకే నేను చూడనే
నీ ఉనికినే పట్టించుకోనే

నాకు ఇప్పటికీ అర్థం కాదు
నేను నీకేం ఉపకారం చేసాను
ఎందుకింత ప్రేమ నీకు
ప్రేమగా పెంచుకున్న కుక్కపిల్ల
తొలి ముద్దు రుచి చూపిన కన్నెపిల్ల
ఎవరూ లేరే నా వెంట

నీకు నా గురించి తెలియదు
నాతో ఉంటే నువ్వూ చచ్చిపోతావ్
ఇదిగో
ఇప్పుడో
ఇంకాసేపటికో

ఏదో తాగిన మత్తులో చెబుతున్నానుకోకు
ఏం
తాగితే చెప్పకూడదా
తాగడం నేరమా ఏం

డబ్బున్నోడు తాగితే కల్చర్
పేదోడు తాగితే వల్గర్
ఈ డబ్బు నిషా నాకు తెలియంది కాదులే
అన్నీ అనుభవించేగా చివరికి ఈ పరిస్థితి

ప్లీజ్
నువ్వయినా చెప్పిన మాట విను
వెళ్లిపో
ఏమి లేని నాకు
నాది అని చెప్పుకునేందుకు
“నీడ” మాత్రం ఎందుకు

అందుకే
వెళ్లిపో

0 comments: